హుజురాబాద్‌లో లిక్కర్ మాఫియా భారీ ప్లాన్‌.. మళ్లీ సిండికేట్‌ ధరలు

by Sridhar Babu |
Wines
X

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్‌లో లిక్కర్ మాఫియా సిండికేట్‌గా ఏర్పడినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం హుజురాబాద్ పట్టణంలో ఓ రహస్య ప్రాంతంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. హుజురాబాద్‌లో 8 వైన్ షాపులు ఉండగా బుధవారం అన్ని షాపులు తెరవాల్సి ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి, మొక్కుబడిగా ఒకటిరెండు షాపులను తెరిచి మిగతా మద్యం దుకాణాల వ్యాపారులంతా సీక్రెట్ మీటింగ్‌లో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.

హుజురాబాద్ మండలంలో వందకు పైగా బెల్టుషాపులు ఉన్నాయని, వీటికి విక్రయించే లిక్కర్ విషయంలో MRP ధరలతో సంబంధం లేకుండా చూడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం బెల్టుషాపులకు అమ్మే ఒక్క ఫుల్ బాటిల్‌కు MRP ధరకు అదనంగా రూ. 40 తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. బెల్టుషాపుల నిర్వాహకులు మద్యం ప్రియులకు ఒక క్వాటర్‌పై రూ. 20 అదనంగా తీసుకుంటున్నందున ధరలు పెంచినా ఇబ్బందేమీ లేదని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అంతేకాకుండా లిక్కర్ సిండికేట్ వ్యాపారులు ఈ ధరల విషయంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదని కూడా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ధరలను నిర్ణయించుకోవడంతో పాటు షాపుల అద్దె విషయంలోనూ ఒకే విధానం అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వైన్ షాపులన్నీ కూడా ఒకే తీరుగా అద్దె చెల్లించాలని, హెచ్చు తగ్గులు ఉండవద్దని కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఇంటి యజమానులకు ఇచ్చే రెంట్ విషయంలో కూడా అందరూ సమానంగా చెల్లించాలని కూడా నిర్ణయించుకున్నారు.

సామాన్యుడే బలి..

లిక్కర్ వ్యాపారులు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చివరకు సామాన్యుని జేబుకే చిల్లు పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బెల్ట్ షాపుల్లో ఎక్కువ శాతం సామాన్యులే మద్యం కొంటుంటారని, వీరు అధిక ధరలు చెల్లించి అమ్మడం వల్ల వారిపై మరింత ఆర్థిక భారం పడుతుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed