స్లమ్ టూర్స్‌తో పేదరికాన్ని అమ్ముతున్న కంపెనీలు.. కోట్లలో సంపాదన

by sudharani |
స్లమ్ టూర్స్‌తో పేదరికాన్ని అమ్ముతున్న కంపెనీలు.. కోట్లలో సంపాదన
X

దిశ, ఫీచర్స్ : 'స్లమ్ డాగ్ మిలియనీర్', 'గల్లీ బాయ్' వంటి చిత్రాల్లో మురికివాడలను చూపించిన విధానానికి ఫిదా అయిన ఫారినర్స్‌ 'ఇదే నిజమైన భారతదేశం' అని పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతాలను సందర్శించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా ఈ ఆసక్తినే మేనేజ్మెంట్ కంపెనీలు, ట్రావెల్ ఏజెన్సీస్ క్యాష్ చేసుకుంటున్నాయి. సీక్రెట్‌గా స్లమ్స్ విజిటింగ్‌కు ఆఫర్ చేస్తూ.. సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ట్రావెల్ కంపెనీ ట్రిప్ అడ్వైజర్ ఢిల్లీలో 'స్లమ్ వాకింగ్ టూర్'ను అందిస్తోంది. ఆసియాలోని అతిపెద్ద మురికివాడల్లో పర్యటించేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.1,800 వసూలు చేస్తోంది. ఢిల్లీ మురికివాడలో మూడు గంటల నడక సందర్శన ద్వారా స్లమ్ లైఫ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు 'ఫస్ట్ హ్యాండ్ గ్లింప్స్'కు ఆహ్వానిస్తోంది.

'ఢిల్లీలోని పేదల పోరాటాల గురించి తెలుసుకోండి. వీరిలో ఉద్భవించిన గొప్ప సంస్కృతి, సమాజ భావాన్ని కనుగొనండి. ఈ చిన్న-సమూహ పర్యటనలో గరిష్టంగా ఆరుగురు వ్యక్తులు ఉంటారు. ఇది గౌరవప్రదమైన సందర్శనను నిర్ధారిస్తుంది' అని స్లమ్ గురించి వర్ణిస్తూ ఫారినర్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. అంతేకాదు 'చిన్న-తరహా పరిశ్రమలు, చిన్న చిన్న నివాసాలలో పర్యటించండి. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చికెన్ మార్కెట్‌లో నడవండి. ప్రతిరోజూ నగరానికి 8000 కంటే ఎక్కువ చపాతీలు డెలివరీ చేసే చపాతీ ఫ్యాక్టరీని సందర్శించండి. ఒక కప్పు రుచి చూసి.. మీ ఆలోచనలను మాతో పంచుకోండి' అంటూ విదేశీయులను ఆకర్షిస్తున్నాయి ట్రావెల్ ఏజెన్సీస్. ఇక ఇంగ్లీష్ మాట్లాడే లోకల్ గైడ్, కంపెనీ నుంచి వెల్ కమ్ డ్రింక్, జ్ఞాపికతో పాటు లోకల్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ సమకూరుస్తున్నాయి.

తనిష్క సోది అనే మహిళ ఈ 'స్లమ్ వాకింగ్ టూర్' గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ట్రావెల్ ఏజెన్సీలపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. పేదరికాన్ని అమ్ముకుంటున్న ధనిక కంపెనీలు అని విమర్శలకు దిగారు. డబ్బుల కోసం ఫారినర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు పేదలను వాడుకోవడాన్ని 'పావర్టీ పోర్న్'గా అభివర్ణిస్తున్నారు.

Next Story

Most Viewed