గోల్కొండ ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తాం

by Sridhar Babu |
గోల్కొండ ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తాం
X

దిశ, మెహిదీపట్నం : గోల్కొండలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలను సమర్పించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డీసీహెచ్ఎస్ ను ఆదేశించారు. శుక్రవారం గోల్కొండ ఏరియా ఆసుపత్రిని ఆయన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ తో కలిసి ఆసుపత్రిలోని పిల్లల ఓపీ, డెంటల్ ట్రీట్మెంట్ వార్డ్, ఐసీయూ, డయాలసిస్ సెంటర్, ఫార్మసీ స్టోర్, ఔట్ పేషెంట్ వార్డ్ లను పరిశీలించారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

వంద పడకలు ఉన్న ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ గోల్కొండ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే తో కలిసి సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉండడం గమనించి బడులు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరు కాకపోవడం ఏమిటని ప్రధాన ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పాఠశాలలకు వంద శాతం విద్యార్థులు హాజరయ్యేలా వెంటనే పిల్లల

తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలిని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. విద్యార్థులకు టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందరికీ అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సాధించినందున పాఠశాలల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినొద్దీన్, డీసీహెచ్ ఎస్ డాక్టర్ సునీత, గోల్కొండ ఆస్పత్రి సూపరింటెండెంట్ మహమ్మద్ మజారుల్లా, కార్పొరేటర్లు, తహసీల్దార్ అహల్య, వైద్యులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed