నేడే విడుదల.. కొత్త నేర, న్యాయ చట్టాలు అమల్లోకి

by Hajipasha |
నేడే విడుదల.. కొత్త నేర, న్యాయ చట్టాలు అమల్లోకి
X

దిశ, నేషనల్ బ్యూరో : భారతదేశ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం సోమవారం(జులై 1) మొదలుకానుంది. కొత్త నేర న్యాయ చట్టాలు తక్షణం అమల్లోకి రానున్నాయి. దీంతో దాదాపు 150 ఏళ్ల క్రితం బ్రిటీషర్లు అమల్లోకి తెచ్చిన చట్టాలు చరిత్ర పుటల్లో కలిసిపోనున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ (సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ) అమల్లోకి వస్తాయి. ఇకపై ఈ కొత్త చట్టాల ప్రకారమే తీర్పులు, నేర విచారణ, కేసుల న‌మోదు, ఫిర్యాదుల న‌మోదు వంటివన్నీ జరుగుతాయి. ఈ కొత్త నేర, న్యాయచట్టాలను జులై 1 నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. అయితే కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఇంకా వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. కొత్త చట్టాలను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టుల‌కు ఆదేశాలు జారీ చేసింది. భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 106 సబ్ సెక్షన్ 2 అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు.

కొత్త చట్టాలపై మూడు కోర్సులు..

కొత్త చట్టాలపై కోర్సులు తీసుకునేలా పోలీసు, జైళ్లు, న్యాయవ్యవస్థ, ఫోరెన్సిక్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మొదలైన అధికారులందరినీ ప్రోత్సహించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, యూటీల ప్రధాన కార్యదర్శులకు జూన్ 6నే లేఖ రాశారు. దీంతో వెంటనే ఆయా విభాగాల అధికారులు కేంద్ర ప్రభుత్వం సూచించిన ‘ఐగాట్ కర్మయోగి’ పోర్టల్ ద్వారా శిక్షణా కోర్సుల్లో చేరారు. ఇందులో కొత్త నేర, న్యాయ చట్టాలపై మొత్తం 3 కోర్సులు ఉన్నాయి. మొత్తం 3 కోర్సుల్లో 2,17,985 మంది అధికారులు నమోదు చేసుకున్నారు. 3 కోర్సులు ఇప్పటికే పూర్తి చేసిన అధికారుల సంఖ్య 1,53,037. కనీసం 1 కోర్సు పూర్తి చేసిన అధికారుల సంఖ్య 1,87,046.

మహిళా భద్రతకు పెద్దపీట వేసే అంశాలివీ..

కొత్త నేర, న్యాయ చట్టాల ప్రకారం.. క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ నుంచి 60 రోజులలోపే అభియోగాలను నమోదు చేయాలి. 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లోనే సిద్ధం చేయాలి. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును రెండు నెలల్లోనే పూర్తి చేయాలి. బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలి. వాళ్లు లేకుంటే మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలి. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా సేకరించి పోలీసులు కేసు నమోదు చేయాలి. అయితే పోక్సో కేసుల్లో బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయొచ్చు. క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించడానికి న్యాయస్థానాలు గరిష్ఠంగా కేవలం రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది. సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డిజీ లాకర్‌‌లో భద్రపరుస్తారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పుడు వాగ్దానాలతో సంబంధాలు పెట్టుకునే వారిపై కొత్త చట్టాల్లో కఠిన శిక్షలు ఉన్నాయి.

Next Story

Most Viewed