దేవాలయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు: మంత్రి కొండా సురేఖ

by Mahesh |
దేవాలయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు: మంత్రి కొండా సురేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేవాదాయ భూముల పరిరక్షణ, దేవాదాయ శాఖకు ఆదాయమే లక్ష్యంగా దేవాదాయ శాఖ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశించారు. ఆదాయం లేని, శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాల పురోగతికి కామన్ గుడ్ ఫండ్ నిధులు వెచ్చించి, సీజీఎఫ్ నిధులకు సార్ధకతను చేకూర్చాలని సూచించారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో దేవాలయాలను అలంకరించి, భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సౌకర్యాల కల్పన తో పాటు తెలంగాణ సంస్కృతిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. సెక్రటేరియట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం దేవాదాయ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, బోనాల ఉత్సవాలకు నిధుల మంజూరు, కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులు తదితర అంశాల పై మంత్రి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ సహకారంతో తెలంగాణలో సాగు చేయని, ఆర్థికంగా ఉపయుక్తంగా లేని భూముల్లో సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు విధివిధానాలను రూపొందించాలన్నారు. ఇలా ఉత్పత్తి చేసిన విద్యుత్ ను డిస్కమ్లకు విక్రయించడం ద్వారా దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ తో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అన్నారు. దేవాలయాల ఉపరితలాల పై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పరిశీలించాలని, భద్రకాళి దేవాలయం, యాదగిరి గుట్ట దేవాలయాల పై ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూప్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా కార్యాచరణను వేగవంతం చేయాలన్నారు. దేవాలయాల అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే దాతలు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకారం అందించే దిశగా ప్రోత్సహించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను అనుసరించి పంచాయతీ రాజ్ శాఖ, రెడ్ కో, టీఎస్ డిస్కమ్స్ లతో చర్చించి సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించాలన్నారు.

గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సిజిఎఫ్ కు రూ.150 కోట్ల నిధులను కేటాయించే నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డిని కోరతామన్నారు. సీజీఎఫ్ నిధుల ఖర్చు విషయంలో ఖచ్చితత్వం కోసం ‘హెడ్ ఆఫ్ అకౌంట్’ పోస్టును సృష్టించాలని అధికారులను ఆదేశించారు. కొత్త దేవాలయాల నిర్మాణం, ఏ రకమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరని, భూములు, ఇతరత్రా ఆదాయం లేని దేవాలయాల అభివృద్ధి, పరిరక్షణ, భద్రత, నవీకరణ పనులకు సి జి ఎఫ్ నిధులు వెచ్చించాలని సూచించారు. బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవాలయాలకు నిధుల విడుదల ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. బోనాల జాతరకు కేటాయించిన రూ. 20 కోట్ల నిధులను పలు శాఖలు, కార్యక్రమాలకు కేటాయింపునకు సంబంధించి అధికారులతో చర్చించారు.

దేవాదాయ శాఖలో ఏళ్ళుగా ప్రమోషన్ కు నోచుకోని ఉద్యోగులతో పాటు, ఉద్యోగుల బదిలీల విషయంలో త్వరలోనే మార్గదర్శకాలను ప్రకటిస్తామన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని భూములు, షాపుల లీజ్ లకు సంబంధించి పాత మార్గదర్శకాలకు సవరణలు, మార్పులు చేసి కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని, వచ్చే టెండర్లలో ఈ మార్గదర్శకాలను అమలు చేయాలన్నారు. అన్యాక్రాంతమైన దేవాలయాల భూముల కేసుల వాదనల విషయంలో నిపుణులైన అడ్వకేట్లను నియమించుకోవాలని, ధర్మపురి సంస్కృత కళాశాలలో సిబ్బంది నియామకాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. వేములవాడ గోశాలలో పోషకాహార లోపంతో బాధపడుతున్న కోడెలకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, అడిషనల్ కమిషనర్ లు జ్యోతి, కృష్ణవేణి, డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఎస్సీ మల్లికార్జున్ రెడ్డి, డీఈ ఓం ప్రకాశ్, ఈఈ కనకదుర్గా ప్రసాద్, రెడ్కో ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి రామకృష్ణ, జనరల్ మేనేజర్ జీఎస్వీ ప్రసాద్, సిజిఎఫ్ కమిటి ఇతర మెంబర్లు పాల్గొన్నారు.

Next Story