కొత్త క్రిమినల్ చట్టాలపై మాట్లాడేందుకు నిరాకరించిన సీజేఐ చంద్రచూడ్

by S Gopi |
కొత్త క్రిమినల్ చట్టాలపై మాట్లాడేందుకు నిరాకరించిన సీజేఐ చంద్రచూడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్ వాటిపై మాట్లాడేందుకు నిరాకరించారు. మంగళవారం దేశ రాజధానిలోని కొత్త ట్రయల్ కోర్టు భవనాల శంకుస్థాపన కార్యక్రమం అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై పిటిషన్‌లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో వరుసగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్యా అధినియం(బీఎస్ఏ)లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చట్టాల అమలుపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ చట్టాల్లోని కొన్ని నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును పిల్ సవాలు చేసింది. దాంతో ఈ చట్టాలు సుప్రీంకోర్టు, బహుశా ఇతర హైకోర్టులలో విచారణ దశలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన నేను మాట్లాడకూడదని చంద్రచూడ్ అన్నారు. కోర్టులు రాజ్యాంగానికి మాత్రమే లోబడి ఉంటాయని, న్యాయవాదులకు తప్ప ఎవరికీ సేవ చేయవని చెప్పారు. కోర్టు ప్రాంగణాలు కేవలం ఇటుకలు, కాంక్రీటుతో తయారు చేయబడవని, న్యాయ ధర్మాలు, చట్టబద్ధమైన పాలనను గుర్తించడానికి ఉద్దేశించినవి అని ఆయన వెల్లడించారు.

Next Story