సీఎంఆర్ గోల్ మాల్ .!

by Sumithra |
సీఎంఆర్ గోల్ మాల్ .!
X

దిశ, మేడ్చల్ బ్యూరో : కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఎఫ్ సీఐకి సకాలంలో బియ్యాన్ని అందించకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాలో రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధన్యానికి, ఎఫ్ సీఐకి తిరిగి అప్పగించిన బియ్యానికి లెక్కల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చాలా మిల్లుల్లో బియ్యాన్ని ఇష్టారాజ్యంగా నిల్వ చేస్తున్నారని, టార్పాలిన్లు కూడా కప్పడంలేదని, రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేటాయింపులు ఇలా..

2022-23 యాసంగి లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో రైతుల వద్ద నుంచి 19,387 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. వీటిలో 13,103 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం మిల్లులకు కేటాయించారు. ఇప్పటికి 62 శాతం అనగా 8157 మెట్రిక్ టన్నులు తిరిగి ఎఫ్ సీఐకి రాగా, ఇంకా 4946 మెట్రిక్ టన్నులు తిరిగి రావాల్సి ఉంది. అదేవిధంగా 2023-24 యాసంగిలో 13,837 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, 9409 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు కేటాయించారు. అయితే కేవలం 6 శాతం అనగా 572 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే తిరిగి ఎఫ్ సీఐకి రాగా, మిగిలిన 8837 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దనే ఉంది. 2023-24 వానకాలం సీజన్ లో 9835 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, మిల్లులకు 6605 మెట్రిక్ ధాన్యాన్ని అప్పగించారు. వీటిలో 51 శాతం అనగా 3346 మెట్రిక్ టన్నుల ధాన్యం తిరిగి ఎఫ్ సీఐకి రాగా, ఇంకా 3260 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దనే ఉంది. ఇలా జిల్లా వ్యాప్తంగా రూ. కోట్ల రూపాయాల బియ్యాన్ని మిల్లర్ల నుంచి రాబట్టాల్సిన అవసరం ఉంది.

అవకతవకలు..

మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రైస్ మిల్లులో సీఎంఆర్ చేయించి, టార్గెట్ కు అనుగుణంగా ఎఫ్ సీఐ గోడౌన్లకు తరలిస్తుంటుంది. అయితే మిల్లర్లు ఇక్కడే అక్రమాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి వచ్చిన ధాన్యాన్ని ఆరునెలల్లోగా మిల్లింగ్ చేసి ఎఫ్ సీఐకి అప్పగించాలి. అయితే రెండు, మూడు సీజన్లు గడిచినా మిల్లర్లు బియ్యం ఇవ్వడం లేదు. నాణ్యమైన ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఎక్కువగా ఒత్తిడి తేస్తే రేషన్ బియ్యం కొని రీసైక్లింగ్ చేసి ఆ లోటును భర్తీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారులు తనిఖీలకు వస్తున్నారని సమాచారముంటే ధాన్యం బస్తాలను అస్తవ్యస్తంగా పడేస్తున్నారని, లెక్కలు చెప్పేందుకు ఒప్పుకోవడంలేదనే సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. కొందరు మిల్లర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో ఫోన్లు చేయించి ఒత్తిడి చేయడం, వినకపోతే మభ్య పెట్టడం పరిపాటిగా మారినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed