రాహుల్ అసలురంగులు మరోసారి ప్రపంచానికి బట్టబయలైంది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

by Mahesh |
Kishan Reddy Regrets Over firing In Secunderabad Railway Station
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారతీయ జనతా పార్టీ పట్ల, ప్రధాని నరేంద్ర మోడీ పట్ల వారికున్న అక్కసును, ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఓడిపోయిన ఉక్రోషంతో రాహుల్ గాంధీ ప్రసంగంలో స్పష్టంగా కనిపించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి .కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో అయన మీడియాతో మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ, వారి మిత్రపక్షాలు హిందుత్వాన్ని అవమానిస్తూ మాట్లాడటం ఇది మొదటిసారేమీ కాదని, సనాతన ధర్మాన్ని వారి మిత్ర పక్షాలు తీవ్రమైన పదజాలంతో విమర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, పార్లమెంటు వేదికను తన విద్వేష పూరిత ప్రసంగాలని వేదికగా మలచుకోవడం దురదృష్టకరమన్నారు.

యావత్ హిందూ సమాజానికి హింసను, విద్వేషాన్ని ఆపాదిస్తూ ఆయన మాట్లాడిన మాటలకు యావద్భారతం సాక్షీభూతంగా నిలిచిందన్నారు. ఇది రాహుల్ గాంధీ అసలురంగులను మరోసారి ప్రపంచానికి బట్టబయలు చేసిందని చెప్పారు. ఎప్పటిలాగే రాహుల్ గాంధీ తన ప్రసంగంలో భాగంగా అబద్ధాలను దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నిజమైన సమస్యల మీద చర్చించవలసిన లోక్ సభను.. బహుశా ఎన్నికల ప్రచారమని భావించి ఇంకా తప్పుడు సమాచారంతో, తప్పుడు వీడియోలతో దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలని రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నట్లున్నరని ఆరోపించారు. లోక్ సభలో రాహుల్ గాంధీ చేసిన విద్వేషపూరిత ప్రసంగానికి యావత్ హిందూ సమాజాన్ని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.

మహిళలను లక్షాధికారుల్ని చేస్తాం

స్వయం సహాయక బృందాల మహిళలను లఖ్‌పతి దీదీలుగా మార్చే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. డీఎంఎఫ్ నిధుల ద్వారా స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు సరైన గుర్తింపును కల్పిస్తామన్నారు. రానున్న రోజుల్లో మహిళా గ్రూపులకు ఆదాయ వనరులను సమకూర్చే లక్ష్యంలో భాగంగా డీఎంఎఫ్ స్టాల్ ప్రారంభించామని తెలిపారు. గనుల శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 645 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ( డీఎం ఎఫ్ ) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. ప్రధాని ఆదేశాలతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు.. బొగ్గు, ఇతర ఖనిజాల గనుల సీఎస్ ఆర్ యాక్టివిటీ లో భాగంగా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఇందులో భాగంగా గనులున్న ప్రాంతాల ప్రజల విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, నైపుణ్యత, స్వయం సహాయక బృందాలకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహాన్ని అందించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా డీఎంఎఫ్ ఆధ్వర్యంలో రూ.92 వేల కోట్లకు పైగా నిధులున్నాయని , ఇందులో రూ.50,900 కోట్లను వెచ్చించి 3,29,945 ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. ఇందులో 1,88,642 ప్రాజెక్టులు పూర్తయ్యాయని వెల్లడించారు . .ఇప్పటికే ఢిల్లీ హాట్ లో శాశ్వత ప్రాతిపదికన ఓ స్టాల్ ఏర్పాటు చేశామన్నారు. పర్యావరణ పరిరక్షణకు సరైన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story