‘ఫానా ఆఫ్ ఇండియా చెక్‌లిస్ట్’‌ ఆవిష్కరణ.. ఏమిటిది ?

by Hajipasha |
‘ఫానా ఆఫ్ ఇండియా చెక్‌లిస్ట్’‌ ఆవిష్కరణ.. ఏమిటిది ?
X

దిశ, నేషనల్ బ్యూరో : తొలిసారిగా మనం దేశంలోని అన్ని జంతు,పక్షి, క్షీరద జాతుల వివరాలతో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ) ప్రత్యేకమైన చెక్‌లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో 104,561 జంతు,పక్షి, క్షీరద జాతుల వివరాలను పొందుపరిచారు. ఆదివారం రోజు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిన జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 109వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ‘ఫానా ఆఫ్ ఇండియా చెక్‌లిస్ట్’ పోర్టల్‌ను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ చెక్‌లిస్టు రానున్న కాలంలో శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, విద్యావేత్తలకు బాగా ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. దాదాపు 455 క్షీరద జాతులను ఈ చెక్ లిస్టులో ప్రస్తావించారు.

ఈ క్షీరదాలు అత్యధికంగా మేఘాలయ (163 జాతులు), పశ్చిమ బెంగాల్ (161 జాతులు), అరుణాచల్ ప్రదేశ్ (142 జాతులు), తమిళనాడు (139 జాతులు), అసోం (138 జాతులు), సిక్కిం (137 జాతులు), కేరళ (134 జాతులు) రాష్ట్రాల్లో ఉన్నాయి. క్షీరద జాతులు అత్యధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు (68 జాతులు), లడఖ్ (59 జాతులు), ఢిల్లీ (38 జాతులు) వరుస స్థానాల్లో ఉన్నాయి. మనదేశానికే ప్రత్యేకమైన 52 క్షీరద జాతుల్లో 23 తమిళనాడులో, 19 జాతులు కర్ణాటకలో, 19 జాతులు కేరళలో ఉన్నాయి. మన దేశంలో 1,358 పక్షి జాతులు ఉన్నాయి. వీటిలో 79 పక్షి జాతులు ప్రత్యేకంగా మనదేశానికే చెందినవి. ఈ ప్రత్యేక పక్షి జాతుల్లో 28 పశ్చిమ కనుమల ప్రాంతంలోనే ఉండటం గమనార్హం. అండమాన్ నికోబార్ దీవుల్లోనూ పెద్దసంఖ్యలోనే అరుదైన పక్షి జాతులు ఉన్నాయి.

Next Story

Most Viewed