సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయిలు నందిని, జ్యోతికి స్వర్ణాలు

by Harish |
సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయిలు నందిని, జ్యోతికి స్వర్ణాలు
X

దిశ, స్పోర్ట్స్ : హర్యానాలో ఈ నెల 27న ప్రారంభమైన 63వ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆదివారం ముగిసింది. ముగింపు రోజున తెలుగు అథ్లెట్లు సత్తాచాటారు. తెలంగాణ క్రీడాకారిణి అగసర నందిని హెప్టాథ్లాన్ మల్టీ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. 7 క్రీడల్లో జరిగిన ఈ ఈవెంట్‌లో 5806 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 100 మీటర్ల హార్డిల్స్, షాట్ పుట్, 200 మీటర్ల డాష్, లాంగ్ జంప్, 800 మీటర్ల రేసులో నెగ్గడం ద్వారా నందిని గోల్డ్ మెడల్ సాధించింది. ఆసియా గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్, వైజాగ్ అమ్మాయి యర్రాజి జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. 13.06 సెకన్లలో రేసును ముగించి స్వర్ణం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుతోతు శ్రీనివాస్, రోహిత్ రోమన్ పతకాలు గెలుచుకున్నారు. పురుషుల 200 మీటర్ల రేసులో శ్రీనివాస్(20.95 సెకన్లు) రజతం సాధించగా.. పురుషుల డెకాథ్లాన్ ఈవెంట్‌లో రోహిత్(6,667 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు.

Next Story

Most Viewed