పెద్ద చెరువులో చేపల మృతి కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు..

by Aamani |
పెద్ద చెరువులో చేపల మృతి కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు..
X

దిశ,పటాన్ చెరు : పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద చెరువులో కాలుష్యం తో టన్నుల కొద్దీ చేపలు మృతిచెందడంపై ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెరువులో కాలుష్యంతో చేపలు మృతిచెందాయంటూ పత్రికలలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దాదాపు 15 టన్నుల చేపలు మృతిచెందిన ఈ ఘటనలో పరిసరాల్లో పరిశ్రమల చెరువులో కాలుష్యాన్ని వదిలిపెట్టడం తోనే ఈ ప్రమాదం జరిగినట్లు పత్రికలు ఆధారాలతో కూడిన వార్తలను ప్రచురించాయి. గతంలో సైతం ఇలాంటి ఘటనలు జరిగిన విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చాయి.

15 టన్నుల చేపల మృతితో ఈ వృత్తి పై ఆధారపడ్డ 100 కుటుంబాలు సుమారుగా రూ.కోటిన్నర నష్టం వాటిల్లింది. దీంతో పత్రికల్లో వచ్చిన కథనాలతో హైకోర్టు సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం తీసుకుంది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్ తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి, సంగారెడ్డి కలెక్టర్, మత్స్య శాఖ కమిషనర్, జిల్లా మత్స్య శాఖాధికారి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శులకు నోటీ సులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 16 కు వాయిదా వేసింది.

Next Story

Most Viewed