రివర్స్ టెండర్ల పేరుతో రిజర్వ్ టెండర్లు!.. జగన్ సర్కారు పై చంద్రబాబు ఆగ్రహం

by Ramesh Goud |
రివర్స్ టెండర్ల పేరుతో రిజర్వ్ టెండర్లు!.. జగన్ సర్కారు పై చంద్రబాబు ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. అధికారులతో వరసగా సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఏడు ప్రభుత్వ శాఖల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పారు. దీనికి ఏపీ కేబినెట్ అమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై తొలి శ్వేత పత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పోలవరంలో జరిగిన అవకతవకలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్దికి జీవనాడి పోలవరం అని, అలాంటి దానిని ఐదేళ్లలో విధ్వంసం సృష్టించారని వాపోయారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేందుకే శ్వేత పత్రం విడుదల చేస్తున్నామని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులు యుద్ద ప్రతిపాధికన కొనసాగాయని, ఒక్క రోజులోనే స్పిల్ ఛానెల్ లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించామని గుర్తుచేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు సాయంత్రమే పోలవరం పనులు నిలిపివేసి డ్రామాలు ఆడారని మండిపడ్డారు. రివర్స్ టెండర్ల పేరుతో రిజర్వ్ టెండర్లకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేధావులు నిపుణులు సహా అందరి సలహాలతోనే ముందుకు వెళతామని తెలిపారు. ఏది ఏమైనా ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని అన్నారు. మొత్తం ఏడు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నామని, దుష్ప్రచారాలకు చెక్ పెట్టేందుకే ఈ శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి త్వరగా నిధులు తెచ్చుకోవాలని, 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మరో 20-25 రోజుల్లో శ్వేత పత్రాలన్నీ విడుదల చేస్తామని, ఈ పత్రాలని వెబ్ సైట్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చంద్రబాబు వెల్లడించారు.

Next Story

Most Viewed