ఉక్కు తయారీదారులకు పీసీఐ బొగ్గును అందించనున్న ప్రభుత్వం

by Harish |
ఉక్కు తయారీదారులకు పీసీఐ బొగ్గును అందించనున్న ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఇటీవల కాలంలో ఉక్కుకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. దీంతో దేశీయ తయారీదారులు అవసరాల కోసం ఉక్కు తయారీలో ఉపయోగపడే పీసీఐ బొగ్గును ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాటి దిగుమతులను తగ్గించడానికి వారికి కోకింగ్ కోల్/పీసీఐ బొగ్గును అందించాలని ప్రభుత్వం చూస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉందని సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు.

పీసీఐ(పల్వరైజ్డ్ కోల్ ఇంజెక్షన్) బొగ్గు అనేది ఒక రకమైన మెటలర్జికల్ బొగ్గు. దీనిని ఉక్కు తయారీలో ఉపయోగిస్తారు. ఇది స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే దీనిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న తరుణంలో దేశీయంగా ప్రభుత్వమే అందించాలని చూస్తుంది. దీంతో పీసీఐ బొగ్గు కోసం ఇతర దేశాలపై ఆధారపడటం చాలా వరకు తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

సీనియర్ అధికారి మాట్లాడుతూ, ప్రత్యేకంగా ఉక్కు రంగానికి మాత్రమే పీసీఐ బొగ్గును అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం, దేశంలోని చాలా ఉక్కు తయారీదారులు పీసీఐ బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. 2030 నాటికి దాని డిమాండ్ 20-30 మిలియన్ టన్నుల మధ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు అధికారి చెప్పారు. ఉక్కు రంగ డిమాండ్‌ను తీర్చడానికి ప్రభుత్వం ఎనిమిది కోకింగ్ కోల్ వాషరీలను ఏర్పాటు చేస్తుంది, వీటి ద్వారా 2030 నాటికి దేశంలో ఉక్కు రంగ డిమాండ్‌ను తీర్చడానికి కనీసం 60 మిలియన్ టన్నుల వాష్డ్ కోకింగ్ బొగ్గును కలిగి ఉంటామని అధికారి అంచనా వేశారు. కోకింగ్ బొగ్గు దిగుమతులు ఎఫ్‌వై24లో 57.22 మిలియన్ టన్నులుగా నమోదైంది, ఇది ఎఫ్‌వై23లో 54.46 మి.టన్నులుగా ఉంది.

Next Story

Most Viewed