నాచురల్ గా ఇంట్లోనే షాంపూ తయారు.. ఎలాగో చూసేద్దామా..

by Sumithra |
నాచురల్ గా ఇంట్లోనే షాంపూ తయారు.. ఎలాగో చూసేద్దామా..
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క వ్యక్తి ఎదుర్కొంటున్న సాధారణ సమస్య జుట్టు రాలడం, చిట్లడం. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రజలు ఆయిల్, షాంపూ, కండిషనర్ వంటి అనేక రకాల ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. అలాగే సెలూన్‌లలో వేల రూపాయలు ఖర్చుచేసి చికిత్సలను తీసుకుంటున్నారు. అయితే ఈ పరిష్కారాలు కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. మళ్లీ జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.

ఎందుకంటే చాలా వరకు బయట తీసుకునే ప్రొడక్ట్స్ రసాయనాలు కలిపి ఉంటాయి. ఇవి జుట్టుకు హాని కలిగిస్తాయి. అయితే పూర్వం రోజుల్లో షాంపూ కి బదులుగా సహజమైన వస్తువులతో తలంటు పోసుకునేవారు. పూర్వకాలంలో లాగా సహజ పదార్థాలతో ఇంట్లోనే షాంపూని సిద్ధం చేసుకోవచ్చు.

ఇంట్లో సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన షాంపూ మీ జుట్టును పూర్తిగా శుభ్రం చేయడమే కాకుండా జుట్టును సిల్కీగా మెరిసేలా చేస్తుంది. స్కాల్ప్ హెల్తీగా మారుతుంది. దీని వల్ల జుట్టు పెరుగుదల కూడా మెరుగుపడుతుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అందుకే కెమికల్స్‌కి బై బై చెప్పి షాంపూని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

షాంపూ చేయడానికి కావలసిన పదార్థాలు..

రెండు చెంచాల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. 15 నుంచి 20 రీఠాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. రోజ్మేరీ లేదా బియ్యం నీరు (బియ్యాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి నీటిని తీసివేయాలి), రెండు మూడు మందార పువ్వులు, ఆకులను తీసుకోవాలి. కలబంద ఆకులను చిన్న ముక్కలుగా చేయాలి. అలాగే రెండు చెంచాల అవిసె గింజలను తీసుకోవాలి.

హెర్బల్ షాంపు తయారీ విధానం..

రీఠా నానబెట్టిన నీటిని తీసివేసి, ఒక బాణలిలో పక్కన పెట్టండి. రీఠాను చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో ఉంచండి. నానబెట్టిన మెంతి గింజలు, బియ్యం నీరు లేదా రోజ్మేరీ, కలబంద, మందార పువ్వులు, ఆకులు, అవిసె గింజలను గిన్నెలో ఉంచండి. ఇప్పుడు ఆ నీటిని పదినిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత దాన్ని ఫిల్టర్ చేయాలి. నీరు కొద్దిగా జెల్ లాగా మారినట్లు అనిపిస్తుంది. ఆ తరువాత నీటిని చల్లారనివ్వండి. కాసేపయ్యాక మిక్సీ గ్రైండర్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మీ షాంపూ తయారయిపోతుంది.

ప్రయోజనం..

రీఠా సహజమైన క్లీనర్‌గా పనిచేస్తుంది. తలస్నానం చేసే సమయంలో నురగలు వస్తాయి. అలాగే మెంతులు, అవిసె గింజలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. కండిషనింగ్‌గా కూడా పనిచేసి జుట్టును సిల్కీగా చేస్తుంది. కలబంద, మందార కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడతాయి. ఈ షాంపూ వాడడం ద్వారా జుట్టు నల్లగా, అందంగా, ఒత్తుగా పెరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed