Left Handers : ఎడమ చేతివాటం ప్రమాదమా..? అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ విషయాలు !

by Javid Pasha |   ( Updated:2024-10-18 06:30:05.0  )
Left Handers : ఎడమ చేతివాటం ప్రమాదమా..? అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ విషయాలు !
X

దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా? మనుషులందరూ తమ రెండు చేతులను ఒకే విధంగా ఉపయోగించలేరు. ప్రపంచంలో అత్యధిక మంది వివిధ పనులు చేస్తున్నప్పుడు కుడిచేతిని ఎక్కువగా ఉపయోగిస్తుంటే.. ఎడమ చేతిని అందుకు సహాయంగా ఉపయోగిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా కొందరు ఎడమ చేతిని మాత్రమే అధికంగా యూజ్ చేస్తుంటారు. అలాంటి వారినే ‘ఎడమచేతి వాటం’ గలవారు (Left-Hamders) అంటారు. అంటే వీరు చేయాల్సిన అన్ని పనుల్లోనూ లెఫ్ట్ హ్యాండ్ కీలకంగా ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. 90 శాతం మంది కుడిచేతిని అధికంగా యూజ్ చేస్తుంటే.. దాదాపు 10 శాతం మంది మాత్రమే రాయడం, తినడం, వివిధ పనుల కోసం ఎడమ చేతిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కాగా రీసెంట్ స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఏంటంటే.. ఎడమ చేతివాటం గలవారు మిగతావారితో పోలిస్తే కొన్ని వ్యాధుల బారిన పడే రిస్క్ ఎక్కువగా ఉంటుందని జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం పేర్కొన్నది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

* నరాలపై ప్రభావం : కుడిచేతిని ఎక్కువగా ఉపయోగించే ప్రజలతో పోలిస్తే లెఫ్ట్ హ్యాండర్స్‌ వయస్సు పెరిగే కొద్దీ నరాల బలహీనత వంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అటెన్షన్ డెఫిసిట్, హైపరాక్టివిటీ డిజార్డర్, ఆటిజం, డైస్‌ప్రాక్సియా వంటివి ఎడమచేతివాటం కలిగిన వారిలో ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. తరచుగా మానసిక స్థితిలో మార్పులకు లోనయ్యే అవకాశం కూడా లెఫ్ట్ హ్యాండర్స్‌లో ఎక్కువగా ఉంటోంది.

* చెస్ట్ క్యాన్సర్ : రొమ్ము క్యాన్సర్ బాధితుల్లోనూ ఎడమచేతి వాటం ఎక్కువగా ఉంటున్నారని పరిశోధకులు చెప్తున్నారు. అయితే గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ అధికంగా రిలీజ్ కావడం వల్ల కూడా ఎడమచేతివాటం కలిగిన మహిళల్లో ఈ రిస్క్‌ పెరుగుతోందని రీసెర్చర్స్ గుర్తించారు.

*స్కిజోఫ్రెనియా : మానసిక వ్యాధులతో కూడా ‘ఎడమచేతి వాటం’ ముడిపడి ఉందని అధ్యయనం పేర్కొన్నది. 2019, 2022, అలాగే 2024 సంవత్సరాలలో జరిగిన పరిశోధనల ప్రకారం.. లెఫ్ట్ హ్యాండర్స్ భ్రమ, భ్రాంతి, ఓవర్ థింకింగ్ వంటి ప్రవర్తనలతో కూడిన మానసిక రుగ్మతగా పేర్కొనే ‘స్కిజో ఫ్రెనియా’ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు గుర్తించారు. దీంతోపాటు కోపం, చిరాకు, ఆందోళన, భయం, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటివి వీరిలోనే అధికంగా ఉంటున్నాయి.

* గుండె జబ్బులు : స్టడీలో భాగంగా 18 నుంచి 50 ఏండ్ల మధ్య వయస్సు గల 379 మంది వ్యక్తులను ఎనలైజ్ చేసిన పరిశోధకులు మరో షాకింగ్ విషయం కనుగొన్నారు. ఏంటంటే.. కుడిచేతిని ఎక్కువగా ఉపయోగించేవారితో పోల్చినప్పుడు ఎడమచేతి వాటం కలిగిన వారే ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దీంతో వీరు యావరేజ్‌గా 7 నుంచి 9 ఏండ్ల ముందే చనిపోతున్నారు. అయితే ఇవన్నీ కేవలం ఎడమచేతి వాటం, కుడిచేతివాటం కలిగిన వారిలో వ్యాధులు, ప్రభావాలను పోల్చిన పరిశీలనలు, ప్రాథమిక నిర్ధారణలు మాత్రమేనని అధ్యయనం పేర్కొన్నది. కాగా లెఫ్ట్ హ్యాండర్స్‌లో వ్యాధుల రిస్క్ పెరిగడానికిగల శాస్త్రీయ కారణాలేమిటో పరిశోధకులు ఇంకా తేల్చలేదు. కాకపోతే జన్యుపరమైన లోపాలు ఇందుకు కారణం అవుతుండవచ్చునని భావిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed