Lack of confidence: అందంగా లేమా..! ఫిజికల్ అప్పీరియన్స్‌పై అపనమ్మకంతో నష్టపోతున్న వ్యక్తులు

by Javid Pasha |   ( Updated:2024-10-05 12:34:49.0  )
Lack of confidence: అందంగా లేమా..! ఫిజికల్ అప్పీరియన్స్‌పై అపనమ్మకంతో నష్టపోతున్న వ్యక్తులు
X

దిశ, ఫీచర్స్: కొందరు చూడ్డానికి ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తుంటారు. కానీ నలుగురి ముందు ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడరు. శుభకార్యాలకు, పార్టీలకు వెళ్లరు. వెళ్లినా ఎక్కువసేపు ఉండరు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని ట్రై చేస్తుంటారు. ఇంకొందరు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా ఫుల్ మేకప్ చేస్తుంటారు. వెరైటీ దుస్తులు ధరించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా చేసే ప్రతి ఒక్కరిలో లో కాన్ఫిడెంట్ ఉందనేది కరెక్ట్ కాదు కానీ.. తమ శరీరంపై తాము తక్కువ ప్రేమ లేదా తక్కువ విశ్వాసం కలిగి ఉండే వ్యక్తుల్లో ఎక్కువగా ఇలాంటి ప్రవర్తన కనిపిస్తుంది. ఒక విధమైన అభద్రతతో కనిపిస్తుంటారు. అలా ఫిజికల్ అప్పీరియన్స్‌పై కాన్ఫిడెన్స్ లేని వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం.

స్వీయ నిరాశలో కూరుకుపోవడం

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరి శరీరం, అందం, హావభావాలు, రంగు వేర్వేరుగా ఉంటాయి. అవి ఎలా ఉన్నా స్వీకరించాలి. కానీ కొందరు తాము అందంగా లేమని, లేకపోతే ఫలానా వారిలాగా తమ స్కిన్ కలర్ లేదని బాధపడుతుంటారు. ఈ విధమైన ఫిజికల్ అప్పీరియన్స్‌వారిలో అభద్రతా భావం కలిగిస్తుందని, ప్రవర్తనలోనూ అది కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. పైగా భౌతిక రూపం బాగాలేదనే ఆలోచనతో తమపై తాము విశ్వాసం లేదా నమ్మకం కోల్పోతారు. కొన్నిసార్లు ఈ విధమైన వ్యక్తులు తమ శరీరాన్ని తామే నలుగురిలో విమర్శించుకుంటారు. ఇతరుల విమర్శలకు బాధపడాల్సిన అవసరం లేకుండా ముందే అలర్ట్ అవుతారు. అయితే శారీరకంగా తాము బాగోలేమనే ఈ విధమైన ఆలోచనను విడనాడాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం ఎలా ఉన్నా మీ ఆలోచనలను, ప్రవర్తనను బట్టి ఇతరులు గౌరవిస్తారని చెప్తున్నారు.

అద్దంలో చూసుకోవాలంటేనే భయం

తమ భౌతిక రూపానికి సంబంధించి స్వీయ నిరాశలో కూరుకుపోయిన వ్యక్తుల్లో కనిపించే మరో ప్రవర్త ఏంటంటే.. వీళ్లెప్పుడూ అద్దంలో చూసుకోవడానికి ఇబ్బంది పడతారు. బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా బిల్డింగ్‌కు ఉన్న మిర్రర్ కావచ్చు. వాహనాల అద్దాలు కావచ్చు. వీరికి కనిపిస్తే చాలా దూరంగా వెళ్లిపోతుంటారు. అంటే తమలో ఏదో లోపం ఉందనే అభద్రత నుంచి ఇది పుట్టుకొస్తుంది. వాస్తవానికి సమస్య నుంచి పారిపోవడం పరిష్కారం కాదు. మీ రూపాన్ని చూసుకోవడానికి తప్పించుకున్న ప్రతిసారీ మరింత అభద్రతకు లోనవుతారు. కాబట్టి ఈ రోజు నుంనే మీరు మీ భౌతిక రూపాన్ని ప్రేమించడం మొదలు పెట్టండి. మీ ఫిజికల్ అప్పీరియన్స్ పట్ల స్వీయ అంగీకారం మీ ఎదుగుదలకు ఒక సాధనంగా స్వీకరించండి.

మేకప్‌పై ఎక్కువగా ఆధారపడటం

మేకప్ అండ్ ఫ్యాషన్ అనేది వ్యక్తుల స్వీయ వ్యక్తీకరణకు, సృజనాత్మకతకు అద్భుతమైన సాధనాలు. అయినప్పటికీ అవి ఒక ముసుగులా కూడా ఉంటాయి. ఒకరి ఫిజికల్ అప్పీరియన్స్‌కు సంబంధించిన అభద్రతా భావాలను దాచిపెడతాయి. తాము అందంగా లేమని ఫీలయ్యేవారు, తమ భౌతిక రూపంపై విశ్వాసం లేని వ్యక్తులు కూడా నలుగురిలో అందంగా కనిపించడానికి ఎక్కువగా మేకప్‌పై ఆధారపడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఫిజికల్ అప్పీరియన్స్‌పై విశ్వాసం లేదా నమ్మకం లేని వ్యక్తులు తరచుగా మేకప్ లేదా నిర్ధిష్ట దుస్తుల శైలిని అభద్రతా వలయంగా ఉపయోగిస్తారు. తాజా ఫ్యాషన్ ట్రెండ్ అనేది భౌతిక రూపానికి సంబంధించిన అంతర్లీన అభద్రతా భావానికి సూచన కావచ్చు. అయితే నిజమైన అందం అనేది లిప్‌స్టిక్ షేడ్ లేదా ఫ్యాషన్ ట్రెండ్ నుంచి కాకుండా స్వీయ అంగీకారం, విశ్వాసం నుంచి ఉద్భవించిందనే విషయం గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

బాడీ లాంగ్వేజ్‌లోనూ తేడాలు

బాడీ లాంగ్వేజ్ అనేది నిజానికి మీ గురించి మీరు ఏం అనుకుంటున్నారో, ఎలా భావిస్తున్నారో అనేది ప్రవర్తన రూపంలో ఇతరులకు బహిర్గంత చేయగలదని నిపుణులు చెప్తు్న్నారు. తమ భౌతిక రూపం సరిగ్గా లేదని, తాము అందంగా లేమని భావించే వ్యక్తులో కనిపించే మరో లక్షణం ఏమిటంటే.. నిరంతరం తమ దుస్తులను సరిచేసుకోవడం, ముఖాన్ని మళ్లీ మళ్లీ కడుక్కోవడం, మేకప్ పాడైపోతుందని ముఖానికి, కళ్లకు చేతులు అడ్డంగా పెట్టుకోవడం వంటివి వారి ప్రవర్తనలో కనిపిస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు. ఈ బాడీ లాంగ్వేజ్ సూచనలను అర్థం చేసుకోవడంవల్ల ఎవరైనా తమ రూపానికి సంబంధించిన ఆత్మగౌరవ సమస్యలతో పోరాడుతున్నట్లు గుర్తించడంలో సహాయపడుతుంది.

స్వీయ సంరక్షణపట్ల నిర్లక్ష్యం

తాము శారీరకంగా అందంగా లేమని భావించే వ్యక్తులు స్వీయ సంరక్షణ పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంటారు. తమపట్ల తాము ఆసక్తి కలిగి ఉండరు. అందుకోసం కేటాయించే సమయం, కృషి విలువైనవి కావని భావిస్తుంటారు. సమయానికి తినకపోవడం, తగినంతగా నిద్రపోకపోవడం, వ్యాయామాలకు దూరంగా వంటి ప్రవర్తన కనిపిస్తుంది. ఇదంతా వీరిలో తమ భౌతిక రూపంపట్ల కలిగి ఉన్న తక్కువ ఆత్మగౌరవానికి సంకేతాలు కావచ్చు అంటున్నారు నిపుణులు. పైగా ఫిజికల్ అప్పీరియన్స్ పట్ల కాన్ఫిడెంట్ లేనివారు, తాము ఆకర్షణీయంగా లేనప్పుడు తమ శరీరాన్ని తాము ఎంత బాగా చూసుకుంటే ఏం ప్రయోజనం అనే స్వీయ నిరాశాభావంలో కూరుకుపోతుంటారు. నిజానికి సెల్ఫ్ కేర్ అనేది ఒక నిర్దిష్ట మార్గంలో చూసేది కాదు. తమను తాము గౌరవంగా చూసుకోవడమే ఇది. శారీరక అందం, రూపంతో సంబంధం లేకుండా ప్రతీ వ్యక్తి సెల్ప్ లవ్ , సెల్ఫ్ కేర్‌కు అర్హులు.

స్థిరమైన గుర్తింపు కోసం ఆరాటం

తమ భౌతిక రూపంపై తమకు అంతగా కాన్ఫిడెంట్ లేనప్పుడు, ఇతరుల నుంచి గుర్తింపు, పొగడ్తలు వస్తే ఎక్కువగా పొంగిపోయే ప్రవర్తన కూడా కొందరిలో కనిపిస్తుంది. స్వీయ నిరాశలో కూరుకుపోయి ఉన్నందువల్ల తమను పొగిడేవారి కోసం ఏదైనా చేస్తారు. తమ కోసం తాము కాకుండా ఇతరుల ఆమోదం కోసం అవతలి వ్యక్తికి నచ్చిన పనిచేస్తుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండటం, ఎక్కువగా పోస్టులు పెట్టడం కూడా చేస్తుంటారు. ఈ ప్రవర్తనతో ఉన్న సమస్య ఏమిటంటే.. ఇది బాహ్య ధృవీకరణతో స్వీయ విలువను సమం చేస్తుంది. నిజం ఏమిటంటే.. ఇతరులు మిమ్మల్ని భౌతికంగా ఎలా గ్రహిస్తారనే దానిని బట్టి మీ విలువ నిర్ణయించబడదు.

లోపాలపైనే ఎక్కువ ఫోకస్

తాము అందంగా లేమని, తమ రూపం బాగా లేదని బాధపడే వారు సమాజంలో గ్రహించిన వివిధ లోపాలను తమకు ఆపాదించుకునే ప్రమాదం కూడా ఉంది. తమ భౌతిక రూపంలో అనేక సానుకూల లక్షణాలు ఉన్నప్పటికీ వాటిని కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మంచి విషయాలను విస్మరించి లోపాలను మాత్రమే గుర్తు తెచ్చుకొని బాధపడే అవకాశం ఉంటుంది. తమ స్కిన్ కలర్ బాగోలేదని, తాము మరీ ఎక్కువ హైట్ ఉన్నామని కొందరు, తాము పొట్టిగా ఉన్నామని ఇంకొందరు తమ ఫిజికల్ అప్పీరియన్స్ విషయంలో ప్రతికూల ఆలోచనలతో సతమతం అవుతుంటారు.

సామాజిక పరిస్థితులను నివారించడం

తమ ఫిజికల్ అప్పీరియన్స్‌పై నమ్మకంలేని వ్యక్తులు స్వీయ నిరాశకు గురైనప్పుడు తమను ఎవరైనా జడ్జ్ చేస్తారేమోననే భయం వారిని వెంటాడుతుంది. కాబట్టి వారు బయట నలుగురిలో కలిసే సామాజిక పరిస్థితులకు, పరస్పర చర్యలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. పార్టీలు, ఫంక్షన్లకు, మీటింగులకు ఆహ్వానాలను తిరస్కరించడం, గ్రూప్ ఫొటోలు, సెల్ఫీలకు దూరంగా ఉండటం, పబ్లిక్ ప్లేస్‌లకు వెళ్లకపోవడం వంటివి చేస్తుంటారు. నిజం ఏమిటంటే.. ప్రతి ఒక్కరూ తాము అందంగా ఉన్నా లేకపోయినా, తమ శరీరం ఎలా ఉన్నా అందరిలో ఆనందంగా, ఆత్మగౌరవంగా జీవించడానికి అర్హులు. భౌతిక రూపంకంటే మీరు దానిని ఎలా స్వీకరిస్తున్నారనేదే ఇక్కడ ముఖ్యం.

Advertisement

Next Story

Most Viewed