సంతానం కావాలనుకుంటున్నారా.. అయితే ఈ అలవాట్లకు దూరంగా ఉండండి!

by Hamsa |   ( Updated:2023-02-20 06:45:06.0  )
సంతానం కావాలనుకుంటున్నారా.. అయితే ఈ అలవాట్లకు దూరంగా ఉండండి!
X

దిశ, ఫీచర్స్: మారుతున్న జీవనశైలి, కొన్ని రకాల ఆహారపు అలవాట్లు ఈరోజుల్లో సంతాన సంతానలేమి సమస్యకు కారణం అవుతున్నాయి. పిల్లల్ని కనాలనుకునే దంపతులు అటువంటి ప్రభావాలు కలిగిన జీవన శైలికి, ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. పెళ్లైన ప్రతీ జంట సహజంగానే పిల్లల్ని కనాలని ఆరాటపడుతుంది. కానీ ఈరోజుల్లో ఆలస్యం కావడమో, సమస్యలు తలెత్తడమో కామన్ అయిపోయింది. పెళ్లయి 10 నుంచి 20 ఏండ్లు అయినప్పటికీ పిల్లలు కలుగని వారు చాలామందే ఉంటున్నారు. రీ ప్రొడక్టివ్ ఏజ్ కలిగిన జంటలలో దాదాపు 15 శాతం మంది సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

స్మోకింగ్ వద్దు

సంతానలేమి సమస్యకు స్మోకింగ్‌ ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. ఇటీవల కొందరు ఆడవాళ్లు కూడా స్మోకింగ్ చేయడం చూస్తున్నాం. స్మోకింగ్ అలవాటు లేనివారు కూడా తమ భర్త, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నప్పుడు పరోక్షంగా పొగను పీల్చడంవల్ల ప్రభావితం అవుతుంటారు. ఫలితంగా ఇది ఆడ, మగ ఇద్దరిలోనూ సంతానోత్పత్తి సమస్యకు దారి తీస్తోంది. స్మోకింగ్ అనేది మహిళల్లో మెనోపాజ్ సమస్యకు, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి దారి తీస్తోంది.

నిద్రసరిగ్గా లేకపోవడం

తగిన నిద్ర లేకపోవడంవల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో సంతానలేమి కూడా ఒకటి. పైగా నిద్రలేమి సమస్య ఉన్నవారు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్లు సరిగ్గా రిలీజ్ కావు. గర్భందాల్చడానికి మహిళల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, లెప్టిన్, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ వంటి హార్మోన్లు కీలకం. ఇవి బాడీలో తగినంతగా ఉత్పత్తి కావాలంటే రోజుకూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు.

కెఫిన్ ఎక్కువగా తీసుకోవద్దు

కెఫిన్ అధికంగా కలిగిన పదార్థాలు, డ్రింక్స్ తీసుకోవడం కూడా సంతానలేమి సమస్యకు కారణం అవుతాయి. కొందరు కెఫిన్ మోతాదు అధికంగా ఉన్న స్ర్టాంగ్ కాఫీని ఇష్టపడుతుంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. దీనివల్ల పురుషుల్లో సంతానోత్పత్తికి అవసరమైన స్పెర్మ్ సెల్స్ తగ్గుతాయి. ఆడవారిలో అయితే ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం అనే సమస్య తలెత్తుతుంది. కాఫీ, టీ తాగకుండా ఉండలేం అనుకునేవారు రోజుకు 250 మి.గ్రా. మించి కెఫిన్ మోతాదు ఉండకుండా జాగ్రత్త పడాలి.

ఆల్కహాల్ అస్సలు మంచిది కాదు

ఆల్కహాల్ మహిళల్లోను, పురుషుల్లోను అనారోగ్యాలకే కాదు, సంతానలేమికీ దారితీస్తుంది. ఇక గర్భంతో ఉన్నప్పుడు అస్సలు దీనిని వాడకూడదు. ఎందుకంటే అది పిండంపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. అబార్షన్ అయ్యే చాయిస్ ఉంటుంది. పురుషులు ఆల్కహాల్ తీసుకోవడంవల్ల హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ సమస్య ఏర్పడుతుంది. మహిళల్లో ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం జరుగుతుంది. అందుకే స్త్రీ, పురుషులిద్దరు కూడా ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.

హెల్తీ డైట్ అవసరం

ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. సంతాన సాఫల్యతకు, సంతానలేమికి కూడా వారి వారి ఆహారపు అలవాట్లు ప్రధానపాత్ర పోషిస్తాయి. తరచూ బ్రేక్ ఫాస్ట్ చేయకుండా మధ్యాహ్నం ఏ మూడు గంటలకో ఒకేసారి లంచ్ చేయడం, సమయానికి తినకపోవడం, లేకపోతే హెవీగా తినడం వంటివి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అలాగే శరీరానికి కావాల్సిన హార్మోన్ల ఉత్పత్తి తగ్గి సంతానోత్పత్తిని సమస్య ఏర్పడుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే తాజా కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, మాసం, గుడ్లు వంటివి తక్కువ మోతాదులో తీసుకుంటూ.. ఫ్రైడ్, ప్యాకేజ్డ్, ఆయిలీ ఫుడ్స్ అధికంగా తీసుకుంటుండటంవల్ల కూడా సంతానోత్పత్తి సమస్యకు ఏర్పడుతుంది. కాబట్టి పిల్లల్ని కనాలనుకునేవారు స్మోకింగ్, ఆల్కహాల్, అనారోగ్యానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లను ప్రధానంగా నివారించాలి. ఆ తర్వాత కూడా సమస్య ఉంటే వైద్య నిపుణులను సంప్రదించాలి.

Advertisement

Next Story