పిల్లలు అర్ధరాత్రివేళ నిద్రలో ఎందుకు కలవరిస్తారు?.. ఏం చేయాలి?

by Javid Pasha |
పిల్లలు అర్ధరాత్రివేళ నిద్రలో ఎందుకు కలవరిస్తారు?.. ఏం చేయాలి?
X

దిశ, ఫీచర్స్ : పిల్లలు గాఢ నిద్రలోకి జారుకున్నాక ఒక్కోసారి సడెన్‌గా లేచి పడుకోవడం, కలవరించడం చేస్తుంటారు. కొందరు గట్టిగా ఏడుస్తుంటారు. కొన్నిసార్లు భయంతో వణికి పోతుంటారు. ఇందంతా జరుగుతుందని ఆ పిల్లలకు తెలియదు. కానీ అర్ధరాత్రి వేళ తమ పిల్లల్లో ఇలాంటి పరిస్థితిని చూస్తే ఏ తల్లిదండ్రులకైనా భయం వేస్తుంది. ఆందోళన చెందుతారు? అలా ఎందుకు జరుగుతుందో అవగాహనలేని వారైతే ఏదో దెయ్యం పట్టిందని కూడా భావిస్తుంటారు. అసలు ఎందుకిలా జరుగుతుంది? ఇది తెలుసుకునేందుకు అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్(ఏఏఎస్ఎం) ఇటీవల మరో అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఐదేండ్లకంటే తక్కువ వయస్సు కలిగిన వారిలో దాదాపు 25 శాతం మంది పిల్లల్లో రాత్రిళ్లు అకస్మాత్తుగా మేల్కొనే భిన్నమైన ప్రవర్తన కనిపిస్తోంది. కాగా దీనినే పారాసోమ్నియా లేదా ‘నైట్ టెర్రర్స్’ అని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.

నైట్ టెర్రర్స్ లేదా పారాసోమ్నియా అనేది ఒక రుగ్మత. దీనిబారిన పడిన పిల్లల్లో ఆందోళన, భయం, కోపం, కొన్ని పరిస్థితుల్లో కారణం లేకుండానే చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు అర్ధరాత్రుళ్లు నిద్రలోంచి లేచి అరవడం, నిద్రలోనే పలవరించడం, ఎవరినో కొడుతున్నట్లు చేతులు ఊపడం, ఎవరూ తమను కొట్టడానికి వచ్చినట్లు అరుస్తూ హెచ్చరించడం చేస్తుంటారు. పన్నేండేళ్ల లోపు పిల్లల్లో నిద్రలో కలవరింత అనేది సహజమే అయినా ఈ లక్షణాలు మరీ ఎక్కువగా మారడాన్ని రుగ్మతగా పరిగణించాలంటున్నారు నిపుణులు. ఈ రుగ్మతనే పారాసోమ్నియా అంటున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా 60 ఏండ్లు దాటిన పెద్దవారిలోనూ ఒక శాతం ఉంటోందని అధ్యయనం పేర్కొన్నది. కొన్నిసార్లు తీవ్రమైన అలసట, నిద్రలేమి, అధిక జ్వరం కూడా పారాసోమ్నియా లక్షణాలను బహిర్గతం చేయవచ్చు. జన్యుపరంగానూ కొందరు పిల్లలు, పెద్దలు నిద్రలో మరోలా ప్రవర్తించే అలవాట్లు కలిగి ఉండవచ్చు. ఏది ఏమైనా పిల్లల్లో నైట్‌టెర్రర్ లక్షణాలు నార్మల్‌గా ఉంటే కొంతకాలానికి వాటంతట అవే తగ్గుతాయి. మరీ ఎక్కువైతే చైల్డ్ సైకాలజిస్టులను సంప్రదించాలంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story