Deadly Fungal : నిశ్శబ్ద మహమ్మారి.. రాబోయే రోజుల్లో మరణాలు సంభవించే చాన్స్?

by Javid Pasha |   ( Updated:2024-09-24 08:00:15.0  )
Deadly Fungal : నిశ్శబ్ద మహమ్మారి.. రాబోయే రోజుల్లో మరణాలు సంభవించే చాన్స్?
X

దిశ, ఫీచర్స్: కరోనా, ఎబోలా వంటి భయంకర అంటు వ్యాధులు, వాటి పర్యవసనాలు, ప్రభావాల గురించి ప్రపంచం ఇంకా మరిచిపోనేలేదు. ఈ మధ్య మంకీ పాక్స్ గురించిన ఆందోళనలు పలువురిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతోపాటు అనేక వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఇన్‌ఫెక్షన్లకు కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ల కారణంగా ప్రతీ సంవత్సరం మిలియన్లమంది చనిపోయే అవకాశం ఉందని లాన్సెట్ జర్నల్‌లో పబ్లిషైన అధ్యయన వివరాలు పేర్కొంటున్నాయి. సైలెంట్ కిల్లర్ లాగా ఇది వ్యాపించే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.

అధ్యయనంలో భాగంగా యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇప్పటి వరకు సంభవించిన అంటు వ్యాధులు, వివిధ సమయాల్లో మహమ్మారుల వ్యాప్తి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాలు, వైరస్‌ల ప్రభావం వంటి అనేక అంశాలను విశ్లేసించారు. ఇప్పటికే ఔషధ నిరోధక అంటు వ్యాధుల కారణంగా 1900 నుంచి 2021 మధ్య కాలంలో ప్రతీ సంవత్సరం ఒక మిలియన్ కంటే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్లు వారు పేర్కొన్నారు. అయితే రాబోయే 25 ఏండ్లల్లో ఈ ప్రాణాంతక ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు మరింత విస్తరిస్తాయని, దీంతో ఏటా 40 మిలియనల్ మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని కూడా వారు చెప్తున్నారు.

డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా

నిజానికి కొన్ని రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఆయా వ్యాధులకు, ఇన్‌ఫెక్షన్లకు కారణం అవుతుంటాయని తెలిసిందే. ప్రతికూల పర్యావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్, రసాయనాల వాడకం వంటి అనేక పరిస్థితులు, ఆహారపు అలవాట్లు పరోక్షంగా కొన్ని రకాల వ్యాధులకు కారణం అవుతున్నాయి. అలాగే బ్యాక్టీరియాలు పరిణామం చెంది డ్రగ్ రెసిస్టెంట్‌గా మారినప్పుడు బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ జరుగుతాయి. ఇవి అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు, ముఖ్యంగా న్యుమోనియా, అతిసారం, యూటీఐ వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాపింపజేస్తాయి. అలాగే కాలక్రమంలో పలు మహమ్మారులను వ్యాపింపజేయడం, ఈ పరిస్థితిని సాధారణ వ్యాధులుగానే ప్రజలు భావించడం వంటి పరిస్థితికి నెట్టుతాయి. రోగకారక బ్యాక్టీరియాలు కూడా మందులకు తలొగ్గని పరిస్థితి ఏర్పడి మరణాలకు కారణం అవుతాయని, దీంతో 2050 నాటికి ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల ప్రతీ ఏటా మరణించే వారి సంఖ్య దాదాపు 40 మిలియన్లకు చేరుకుంటుందని పరిశోధకులు అంటున్నారు.

సరైన ఔషధాలు లేక..

ఇప్పటికే పాథోజెన్స్, యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్ ముప్పును ప్రపంచం ఎదుర్కొంటోందని పరిశోధకులు అంటున్నారు. మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు సీరియస్‌గా తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్‌ను కేవలం బ్యాక్టీరియాగానే భావించి నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా తయారవుతుందని వారు చెప్తున్నారు. ఇప్పటికీ సరైన ఔషదాలు లేకపోవడంతో కొన్ని బ్యాక్టీరియాలు ప్రాణాలు హరిస్తున్నాయని పేర్కొంటున్నారు.

ఎలా ఎదుర్కోవాలి?

సరైన యాంటీ బయాటిక్స్ కలిగి ఉన్నప్పుడే అంటు వ్యాధులను, బ్యాక్టీరియాలను, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల ద్వారా సంభవించే ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోగలమని పరిశోధకులు భావిస్తున్నారు. ఆ దిశగా పరిశోధనలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా అందుకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచిస్తున్నారు. అదే జరగకపోతే రాబోయే దశాబ్దాల్లో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు 6.5 మిలియన్ల మందికి సోకుతాయని, ఏటా 3.8 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొంటున్నారు.

ఫంగల్ సేఫ్టీ విధానం అవసం

ప్రస్తుతం అంటు వ్యాధులు లేదా మహమ్మారులు ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు తగిన మెడికేషన్స్, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం వాటిపరిధి సరిపోవడం లేదని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇన్వాసిస్ వంటి ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు ట్రీట్మెంట్ చేయడానికి 4 యాంటీ ఫంగల్స్ మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని, ఇవి పెరగాల్సిన అవసరం ఉందని రీసెర్చర్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీ విషయంలో యాంటీ ఫంగల్ సేఫ్టీ విధానాలు అవసరమని చెప్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తులో నిశ్శబ్ద మహమ్మారులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. తాజా అధ్యయనం అందకు తగిన అవగాహన కల్పించడంతోపాటు మరిన్ని పరిశోధనల అవసరాన్ని గుర్తు చేసిందని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed