గర్భిణులపై పొల్యూషన్ ఎఫెక్ట్ .. పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల లోపాలు !

by Javid Pasha |
గర్భిణులపై పొల్యూషన్ ఎఫెక్ట్ .. పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల లోపాలు !
X

దిశ, ఫీచర్స్ : పర్యావరణ మార్పులు, గాలి కాలుష్యం గర్భిణులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తరచుగా ఎయిర్ పొల్యూషన్‌కు గురయ్యే గర్భిణులు అనారోగ్యాల బారిన పడటంతోపాటు దీర్ఘకాలిక ప్రభావానికి గురైతే వారు తక్కువ బరువుగల శిశువులకు జన్మనిచ్చే అవకాశం ఉందని లేదా బిడ్డకు జన్మనిచ్చాక ఆ శిశువులో ఎదుగుదల లోపాలు ఏర్పడే చాన్స్ ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇక కాలుష్యం లేని ప్రాంతాల్లో, పచ్చని చెట్లు ఎక్కువగా ఉండే పరిసరాల్లో నివసించేవారిపై ఇటువంటి ఎఫెక్టు ఉండదని అంటున్నారు. నిజానికి తక్కువ బరువుతో పుట్టిన శిశువుల్లో వయసు పెరిగే కొద్దీ ఆస్తమా లేదా క్రానిక్ అబ్‌స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజెస్ వంటివి డెవలప్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

గర్భిణులపై వాయు, వాతావరణ కాలుష్యాల ప్రభావాన్ని అధ్యయనం చేయడంలో భాగంగా నార్వేలోని బెర్గెన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఐస్‌లాండ్ అండ్ ఎస్టోనియా నుంచి 5000 కంటే ఎక్కువ మంది పిల్లలకు చెందిన రెస్పిరేటరీ హెల్త్ డేటాను ఎనలైజ్ చేశారు. అలాగే ఆస్తమా, తక్కువ బరువుగల శిశువుల తల్లులు గర్భిణులుగా ఉన్నప్పుడు వారు నివసించిన ప్రాంతాల్లోని వాతావారణ పరిస్థితులు, ఎయిర్ పొల్యూషన్ వంటి అంశాలను కూడా విశ్లేషించారు. అలాగే సరైన బరువుతో జన్మించిన పిల్లలకు సంబంధించిన తల్లుల నివాస ప్రాంతాలకు చెందిన ఎయిర్ పొల్యూషన్ లెవల్స్‌ను కూడా గుర్తించారు. దీంతోపాటు పచ్చదనం కలిగిన, వాయు కాలుష్యం లేని ప్రాంతాల్లో నివసించిన గర్భిణులకు జన్మించిన పిల్లల బరువును, అలాగే తరచూ ఎయిర్ పొల్యూషన్‌కు గురైన గర్భిణులకు జన్మించిన పిల్లల బరువును పరిశోధకులు కొలువగా తేడాలు స్పష్టంగా కనబడ్డాయి. ఎయిర్ పొల్యూషన్‌కు గురైన తల్లులు జన్మనిచ్చిన శిశువులు, ఈ పొల్యూషన్‌కు గురికాని తల్లులు జన్మనిచ్చిన శిశువులకంటే 26 నుంచి 31 గ్రాముల తక్కువ బరువుతో జన్మిస్తున్నట్లు రీసెర్చర్స్ కనుగొన్నారు. అందుకే శిశువుల్లో వృద్ధి చెందుతున్న శ్వాసకోశ వ్యవస్థలను రక్షించడానికి వాయు కాలుష్యాన్ని తగ్గించడం, పట్టణ ప్రాంతాలను పచ్చగా మార్చడం వంటి సామాజిక బాధ్యతలను ప్రభుత్వాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా ఐక్యరాజ్య సమితి సూచిస్తోంది.

Advertisement

Next Story