కనపడితే చాలు.. హాంఫట్!

by srinivas |   ( Updated:2021-12-23 23:21:57.0  )
Vizag1
X

దిశ, ఏపీ బ్యూరో: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంకు స్మార్ట్ సిటీ హోదా ఎప్పుడైతే దక్కిందో ఆ క్షణం నుంచే భూ కబ్జాదారుల కన్ను పడింది. ఆంధ్రా ఆర్థిక రాజధానిగా పేరున్న విశాఖ మిగిలిన నగరాలైన విజయవాడ, తిరుపతి, గుంటూరులను దాటుకుని సూపర్ సిటీ‌గా మారిపోతున్నది. ఇక త్వరలోనే రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వైజాగ్‌నే పెట్టి తీరుతానంటున్న సీఎం జగన్ మాటలు ఈ నగర అభివృద్ధికి మరింత ఊతమిచ్చాయి. అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను వైజాగ్ నుంచే ప్రారంభించడానికి ఆరాటపడుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఇక్కడి భూముల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. అయితే ఆ ధోరణే ఇప్పుడు కబ్జాదారుల పాలిట కొంగుబంగారంగా మారిపోతున్నది.

పెరుగుతున్న భూ వివాదాలు

ఎప్పుడైతే ఏపీకి ఒక రాజధానిగా సీఎం ప్రకటించారో అప్పటి నుంచే నగరంలో భూ వివాదాలు ఎక్కువైపోతున్నాయి. ఆధారాలు సరిగ్గా లేని, యజమానులు దూరంగా ఉన్న భూములను ఎలాగైనా చేజిక్కించుకునేందుకు ల్యాండ్ మాఫియా కన్నేసింది. ఈ నేపథ్యంలో రోజుకో వివాదం బయటికి వస్తున్నది. ఏడాది క్రితం విశాఖలో జ్ఞానానంద – రామానంద ఆశ్రమం భూ వివాదం సంచలనం సృష్టించింది. ఆశ్రమానికి చెందిన భూమిని సర్వే చేయిస్తే ఆశ్రమం పశ్చిమం వైపు భూమిని కొంతమంది ఆక్రమించి తప్పుడు సర్వే నెంబర్లతో అమ్మేసి నివాస స్థలాలుగా మార్చేశారని ఆశ్రమ అధిపతి పూర్ణానంద సరస్వతి ఆరోపించారు. అలాగే దాదాపు రూ.300 కోట్ల విలువైన భూమిని ఆక్రమించడానికి కుట్రలు జరుగుతున్నాయని స్వామీజీ చేసిన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆశ్రమంలోని దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉండగా, మిగిలిన ప్రాంతాన్ని ప్రైవేట్ ట్రస్ట్‌కు అప్పగించాలని కొందరు పలుకుబడి గల వ్యక్తులు స్వామీజీపై ఒత్తిడి తేవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టు స్టేటస్‌ కో ఇచ్చింది.

హయగ్రీవ ఇన్‌ఫ్రా అధినేత జగదీశ్వరుడి ఆరోపణలు

మరో అంశంలో రూ.200 కోట్లు విలువ చేసే తన భూమిని అక్రమంగా కొట్టెయ్యడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ హయగ్రీవ ఇ‌‌న్‌ఫ్రా అధినేత ఇటీవల విడుదల చేసిన వీడియో రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకప్పుడు తన ఆడిటర్‌గా పనిచేసిన ప్రస్తుత విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జీవీ‌గా పిలువబడే జి. వెంకటేశ్వర్ కొంతమంది రాజకీయ పెద్దలతో కలిసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. అనంతరం అజ్ఞాతం‌లోకి వెళ్లిపోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే విశాఖ రూరల్ మండలం పరిధిలోని సర్వే నెంబర్లు 86/పి, 92/3పి…లో 10 ఎకరాల భూమి వుంది. హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థ ఈ భూమిని దశాబ్దం క్రితం ప్రభుత్వం దగ్గర తీసుకుని అభివృద్ధి చేసింది. ఇందులో 10 శాతం భూమిని వృద్ధాశ్రమం నిర్మాణం, నిర్వహణ కోసం కేటాయించాలని ఒప్పందం కుదిరింది. మిగిలిన స్థలంలో విల్లాలను నిర్మిస్తామని.. వాటిని సైతం సీనియర్ సిటిజన్లకు విక్రయిస్తామని ప్రతిపాదించింది. దీంతో హయగ్రీవ సంస్థకు తక్కువ ధరకు ఈ భూములను కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేటాయింపులపైన వివాదం చెలరేగడంతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఖరీదైన ఆస్తుల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని కాగ్ ఆక్షేపించింది. అప్పటికే కొన్ని అమ్మకాలు జరిగినట్టు గుర్తించగా మిగిలిన భూమి హయగ్రీవ సంస్థ ఆధీనంలోనే ఉంది. నగర విస్తరణ తర్వాత ఈ భూముల మార్కెట్ విలువ దాదాపు రూ.200 కోట్లకు చేరింది. తాజాగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జి.వెంకటేశ్వరరావు అలియాస్ జీవీగా గుర్తింపు పొందిన వెంకటేశ్వర రావు….తనపై వేధింపులకు పాల్పడుతున్నారని హయ‌గ్రీవ ఇన్‌ఫ్రా యజమాని జగదీశ్వరుడు ఆరోపించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో బెదిరించి రూ.200 కోట్లు విలువ చేసే భూములను రూ.15 కోట్లకే తన పేరిట రాయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో తనను కాపాడమని ముఖ్యమంత్రి, ఇతర పార్టీ ముఖ్యులకు ఫిర్యాదు చేస్తూ జగదీశ్వరుడు ఓ వీడియో విడుదల చేశారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్‌పైనే ఆరోపణలు చేసిన జగదీశ్వరుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది.. ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవీని తక్షణమే పదవి నుంచి తొలగించడమో, లేక నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయించడమో చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

అంతా అబద్ధం: జీవీ

అయితే జగదీశ్వరుడు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని జీవీ ఖండించారు. కేవలం చేసిన అప్పులు తీర్చలేక తనని ఒక బూచి‌గా చూపించి చేసిన అప్పుల నుంచి తప్పించుకోవాలని జగదీశ్వరుడు ప్రయత్నిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. జగదీశ్వరుడిగా తనకూ మధ్య జరిగాయని చెబుతున్న కొన్ని లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఆయన బయట పెట్టారు. జగదీశ్వరుడుకు ఇచ్చిన రూ. కోట్ల అప్పును వసూలు చేసుకోవడానికే వేరే దారిలేక ఇలా చేస్తున్నారని వాపోయారు. లీగల్‌గా వివాదాస్పదం అని తెలిసినా ఆ భూమిని తాకట్టు పెట్టుకోవాల్సి వచ్చిందని జి.వెంకటేశ్వర్ చెబుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి, వైజాగ్ ఎంపీ సత్యనారాయణ, లాంటి వార్ల పేర్లు తీసుకు రావడం వెనుక పెద్ద కుట్ర ఉందనీ త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానని జీవీ అంటున్నారు.

వైజాగ్‌లో భూదందాలకు చెక్ పెట్టాల్సిందే: ప్రజా సంఘాలు

ఏదేమైనా ప్రస్తుత భూ వివాదాలు విశాఖ ఇమేజ్‌పై పెద్ద దెబ్బే కొట్టాయి. దాంతో ప్రభుత్వం కల్పించుకుని విశాఖలో భూ మాఫియాకు చెక్ పెట్టాల్సిందేనని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి అంశాలు సీఎం దృష్టిలో పడ్డాయనీ, త్వరలోనే విశాఖలో భూ వివాదాలకు చెక్ పెట్టేలా ఆయనో నిర్ణయం తీసుకుంటారనీ అధికార వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story