‘దుర్గాదేవి’గా వలసకూలీ మాతృమూర్తి!

by Sujitha Rachapalli |
‘దుర్గాదేవి’గా వలసకూలీ మాతృమూర్తి!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా.. అన్ని వర్గాల ప్రజలు నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే, అందరికంటే ఎక్కువ కష్టాలను ఎదుర్కొన్నది మాత్రం వలస కూలీలే. దేశవ్యాప్తంగా ఇంట్లోంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి ఉంటే.. వలస కూలీలు మాత్రం తమ పిల్లల్ని చంకనేసుకుని వందల, వేల కిలోమీటర్లు నడిచి వెళ్లారు. ఆ మాతృమూర్తుల సేవకు కృతజ్ఞతగా దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించే ‘దుర్గాదేవి’కి బదులు ‘మైగ్రేంట్ మదర్ గాడెస్’ను పెట్టనున్నారు.

కరోనా ఆపత్కాలంలో.. ముందుండి సేవలందించిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతగా గణేష్ విగ్రహాలను రూపంలో వారి రూపంలో నిలిపిన విషయం తెలిసిందే. కాగా ఈసారి దుర్గా నవరాత్రుల సందర్భంగా.. లాక్‌డౌన్ వేళ చంకన బిడ్డ, చేతిలో సంచులు మోస్తూ వందలాది కిలోమీటర్లు నడిచిన ఎందరో మాతృమూర్తుల కష్టానికి గుర్తింపునిచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. బిడ్డల కోసం కష్టపడే అమ్మలు కూడా అమ్మవార్లతోనే సమానం అని తెలియజేసేందుకు దుర్గాదేవి విగ్రహానికి బదులుగా ‘మైగ్రెంట్ మదర్ గాడెస్’ విగ్రహాన్ని కోల్‌కతా, బెహలా ప్రాంతానికి చెందిన బారిష క్లబ్ దుర్గా పూజా కమిటీ ప్రతిష్టించబోతుంది. ‘కష్టనష్టాలకు ఓర్చి, వలస కూలీ మహిళలు సాగించిన ప్రయాణం స్త్రీశక్తికి అద్దం పట్టింది. అందుకే వలస కార్మిక మహిళలను అపర కాళికలా పూజిస్తున్నామని’ కమిటీ సభ్యులు చెబుతున్నారు.

‘వలస కూలీలు.. ఎంతో ధైర్యాన్ని, తెగువను చూపారు. ఎండలు మండిపోతున్నా, ఆకలి వేస్తున్నా.. చేతిలో పిల్లల్ని మోస్తూ, మరోవైపు సంచులు పట్టుకుని, ఆకలి, దాహాన్ని తట్టుకుని ప్రయాణాన్ని సాగించారు. దుర్గాదేవి లక్షణాలు వీరిలోనూ కనిపించాయి’ అని మైగ్రెంట్ మదర్ గాడెస్ విగ్రహాన్ని తయారు చేసిన రింతు దాస్ తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో దసరా పండుగ ఉత్సవాలు అంబరాన్నంటుతాయి. ఏ వీధి చూసినా.. కాళీకా మాత విగ్రహాలతో కళకళలాడుతుంటాయి. ఈ ఏడాది మాత్రం బెంగాల్ ప్రజలు భిన్నంగా ఆలోచించి వలస కూలీ తల్లులను అమ్మవారి రూపంలో కొలువుతీర్చడం నిజంగా అభినందనీయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed