హామీలకే పరిమితమా.. కేసీఆర్ మాటలనే పట్టించుకోరా..

by Shyam |   ( Updated:2021-06-19 07:04:56.0  )
హామీలకే పరిమితమా.. కేసీఆర్ మాటలనే పట్టించుకోరా..
X

దిశ ప్రతినిధి, మెదక్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన సొంత ప్రాంతమైన సిద్దిపేట గడ్డ మీద ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. ఆయన సిద్దిపేటలో పర్యటించిన ప్రతీసారీ వరాల జల్లు కురిపిస్తూనే ఉంటారు. ఇటీవలే ఆరు నెలల క్రితం కూడా సిద్దిపేటలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోనూ సిద్దిపేట గడ్డను పొగుడుతూనే జిల్లాలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలను ప్రస్తావిస్తూ అభివృద్ధి పేరిట వరాల జల్లు కురిపించారు.

వాటికి సంబంధించిన నిధులు సైతం 2021-22 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించి నిధుల విడుదలకు సంబంధించి జీవో సైతం విడుదల చేశారు. కానీ సీఎం చెప్పిన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా టెండర్లు పిలవలేదు. ఇప్పటి వరకూ పనులు ప్రారంభించలేదు. మరోసారి సిద్దిపేటకు సీఎం కేసీఆర్ వస్తుండటంపై గత పర్యటనలో వచ్చినప్పుడు ఇచ్చిన పనులే ప్రారంభం కాలేదు.. మరి ఈ సారి వరాల జల్లు కురపిస్తాడా.? లేక అభివృద్ధి పనులను ప్రారంభించి వెళ్తాడా అంటూ ముచ్చటించుకుంటున్నారు.

ఆరు నెలల కిందట సిద్దిపేటలో సీఎం పర్యటన ..

సిద్దిపేట జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, రంగనాయక సాగర్ అతిథి గృహం, మిట్టపల్లి రైతు వేదిక, కోమటి చెరువు సుందరీకరణ, సిద్దిపేట మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్.. గతేడాది డిసెంబర్‌లో 10 వ తేదీన హాజరై పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిద్దిపేట సిద్ధించిన గడ్డ.. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉందంటూ ప్రసంగం ప్రారంభించిన కేసీఆర్.. మధ్యమధ్యలో గతంలో సిద్దిపేట అభివృద్ధికి పడిన ఇబ్బంది చెబుతూనే.. నేడు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి.. వాటికి సంబంధించి నిధులు కేటాయించారు.

సిద్దిపేటకు ప్రకటించిన వరాలు..

సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పలు అభివృద్ధి పనులకు వరాల జల్లు కురిపించారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టును కోమటి చెరువును మించి అభివృద్ధి చేసుకుందామని, ప్రాజెక్టు మధ్యలో 65 ఎకరాల స్థలం ఉందని, అందులో డెస్టినేషన్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్, స్టార్ హోటళ్లు నిర్మించుకుందామని ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మల్లన్నసాగర్ నుంచి ఇర్కోడు లిప్టు ఇరిగేషన్ పేరిట పలు గ్రామాలకు సాగు నీరు అందించేందుకు రూ. 80 కోట్లు నిధులు కేటాయించారు. సిద్దిపేట నియోజక వర్గ రింగు రోడ్డుకు రూ.160 కోట్లు, సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు నాలుగు రోడ్ల రహదారి నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్ నుండి రూ.254 కోట్లు మంజూరు చేశారు.

సిద్దిపేట, దుబ్బాక బస్టాండ్ల ఆధునీకరణ కోసం సిద్దిపేటకు రూ. 6 కోట్లు, దుబ్బాకకు రూ. కోటి మంజూరు చేశారు. సిద్దిపేట పట్టణానికి మరో వెయ్యి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. రాజీవ్ రహదారిపై త్రీ టౌన్ పోలీసు స్టేషన్ మంజూరు చేసి తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేశారు. సిద్దిపేట కోమటి చెరువు అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేశారు. రెండు వేల పైచిలుకు మంది కవులు, కళాకారులు కూర్చోనేలా ఉండేందుకు గజ్వేల్ మహతి ఆడిటోరియం మాదిరిగా నిర్మించేందుకు రూ.50 కోట్లు నిధులు కేటాయించారు. సిద్దిపేటలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కోసం రూ.25 కోట్లు నిధులు కేటాయించారు.

టెండర్లు పిలవలే .. పనులు ప్రారంభించలే..

సిద్దిపేటలో పర్యటించిన రోజున వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ. వెయ్యి కోట్ల పైచిలుకు నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. సీఎం చెప్పిన మాదిరిగానే 2021-22 రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు అన్ని పనులకు నిధులు మంజూరు చేశారు. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. సీఎం సొంత గడ్డలో ఏ పనైనా నిధులు మంజూరైతే చాలు.. టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారనే పేరుంది. కానీ ఈ ఒక్కసారి ఆ విషయంలో సవరణలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఈ సారి పనుల ప్రారంభోత్సవంలో ఆలస్యం చేస్తున్నట్టు కన్పిస్తున్నది.

కారణాలేమో తెలియదు కానీ.. మార్చిలో రాష్ట్ర బడ్జెట్ కింద నిధులు మంజూరై మూడు నెలలు పూర్తి కావొస్తున్నా ఇప్పటి వరకూ.. ఏ ఒక్క పనికి టెండర్లు పిలవలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రేమో వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశించి ఆరు నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా సీఎం ప్రతిపాదించిన పనులకు సంబంధించి త్వరితగతిన టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సిద్దిపేట ప్రజలు కోరుతున్నారు.

దుబ్బాక పర్యటన ఎప్పుడో.. !

సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటనలో దుబ్బాక షెడ్యూల్ లేనట్టు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటి సారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను చదువుకున్న స్కూల్‌ని, తాను పెరిగిన దుబ్బాక పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఆ మేరకు దుబ్బాకలో పర్యటించిన సీఎం కేసీఆర్.. దుబ్బాక నూతన పాఠశాల మంజూరు, వెయ్యి పడకల ఆస్పత్రి, వేంకటేశ్వర స్వామి ఆలయం, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రస్తుతం అవి నిర్మాణం పూరై ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. గతంలోనే వీటిని ప్రారంభిస్తారని ప్రచారం జరిగినా ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.

ప్రస్తుతం దుబ్బాక నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సైతం త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేసుకుందామని చెప్పారు. కాగా రేపు సిద్దిపేటకు సీఎం కేసీఆర్ వస్తుండగా.. దుబ్బాకలో పర్యటిస్తారని, అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని అంతా అనుకున్నారు. కానీ సీఎం పర్యటనలో దుబ్బాక అంశం లేదని అధికార వర్గాల నుంచి సమాచారం. దుబ్బాక నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకుడు కానందునే దుబ్బాకకు సీఎం రావడం లేదనే చర్చ జోరుగా సాగుతున్నది. మున్ముందు కూడా సీఎం కేసీఆర్ ఈ మూడెండ్ల కాలంలో దుబ్బాకలో పర్యటించకపోవచ్చని పలువురు ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీ నాయకులు బహిరంగంగానే ముచ్చటించుకుంటున్నారు. దీనిపై సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.

రేపు సీఎం రాక ..

గత ఆరు నెలల క్రితం పర్యటించిన సీఎం కేసీఆర్ మరోమారు తన పురిటిగడ్డ సిద్దిపేటలో పర్యటించనున్నారు. గతేడాది క్రితమే పూర్తయిన సిద్దిపేట జిల్లా నూతన కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. వాటితో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సైతం సీఎం ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి గత వారం రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సైతం ఒకట్రెండు సార్లు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సీఎం కేసీఆర్ వాటిని ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించే భవనాలను విద్యుత్ దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సీపీ జోయల్ డేవిస్ నేతృత్వంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed