Supreme Court: జీహెచ్ఎంసీ పరిధిలో ఆ హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులు రద్దు

by Prasad Jukanti |   ( Updated:2024-11-25 08:30:03.0  )
Supreme Court: జీహెచ్ఎంసీ పరిధిలో ఆ హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులు రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు (Housing Society) ప్రభుత్వాలు చేసిన భూ కేటాయింపుల విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు ఇచ్చింది. హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను రద్దు చేసింది. ఈ మేరకు ఇవాళ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేసిన విషయం తెలిసిందే. వీటిని సవాల్ చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వం చేసిన ఆ భూకేటాయింపులను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులను ఆర్బీఐ నిర్ణయించిన వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.

సందిగ్ధంలో జేఎన్‌జే హౌసింగ్ సొసైటీ

గత సెప్టెంబర్ 8న జవహర్‌‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీలో (Jawahar Lal Nehru Housing Society) సభ్యులకు పేట్ బషీరాబాద్ స్థలానికి సంబంధించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించింది. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీకీ ఇళ్ల స్థలాల కోసం 70 ఎకరాల భూమిని కేటాయించారు. 2008 మార్చిలో నిజాంపేట్‌లో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్‌లో 38 ఎకరాలను జర్నలిస్టుల ఇళ్ల కోసం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. కాగా నిజాంపేటలోని 32 ఎకరాల స్థలం సొసైటీ ఆధీనంలో ఉంగా పేట్‌బషీరాబాద్‌లోని 38 ఎకరాలకు సంబంధించిన ఇండ్ల స్థలాల కేటాయింపు పత్రాలను సెప్టెంబర్ 8న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అర్హులైన వారికి అందజేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హౌసింగ్‌ సొసైటీలు పొందిన భూముల విషయమై సందిగ్ధత నెలకొన్నది.

Advertisement

Next Story

Most Viewed