- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పైసా లేకుండా వందల కోట్ల బిజినెస్.. తెలంగాణలో రూ.వేల కోట్ల వసూళ్లు
దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా ఎక్కడైనా సాగుతున్నదంటే.. అది కచ్చితంగా తెలంగాణయే. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఈ రంగానికి ఢోకా లేదు. వ్యాపారానికి ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అనుకూలం. ఇక్కడున్న భూమి లభ్యత మరెక్కడా లేదు. ఎంత విస్తరించేందుకైనా అవకాశం ఉంది. అందుకే ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగంపైనా ఎక్కడెక్కడోళ్లు వచ్చి గద్దల్లా వాలిపోతున్నారు. పైసా పెట్టుబడి లేకుండానే రూ.వందల కోట్ల వ్యాపారానికి తెర లేపుతున్నారు. జనం సొమ్ముతోనే భూమిని కొనడం మొదలు పెట్టి ఏకంగా ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. దానికి అందంగా పేర్లు ప్రీ లాంచ్, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నారు. మార్కెట్ ధరలో సగానికి ఇస్తామంటూ ముందే 100 శాతం డబ్బులు కట్టించుకుంటున్నారు. ఆ తర్వాత పగటిపూటే చుక్కలు చూపిస్తున్నారు. ఇదేదో చిన్న కంపెనీలు అనుకుంటే పొరపాటే. పెద్ద పెద్ద కంపెనీలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. ఆఖరికి చిట్ ఫండ్, ఫైనాన్స్ దందాలు నడిపిన కంపెనీలు కూడా ఈ రంగంలోకి అడుగు పెట్టి జనాన్ని మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఆ తర్వాత చేతులెత్తేసి కేసులు పెడితే పెట్టుకోండి.. కోర్టుల్లోనే తేల్చుకుంటామంటున్నారు. ఎవరికి ఫిర్యాదు చేసినా ఏం అవుతుంది? అరెస్టు చేసి జైల్లో పెడతారు.. అంతే తప్ప.. వసూలు చేసిన మొత్తాన్ని కక్కించే వ్యవస్థలు లేవు కదా! అదే అక్రమార్కులకు వరంగా మారుతుంది. అందుకే ప్రీ లాంచ్.. అదే మోసానికి నాంది పలకడమే అన్నది గుర్తుంచుకోవాల్సిందే. = శిరందాస్ ప్రవీణ్‌కుమార్
అందంగా బురిడీ
- రూ.15 లక్షలు పెట్టండి. రెండు నెలల్లోనే డబుల్ ఇస్తాం. రూ.30 లక్షలు పొందండి. అడ్వాన్స్ చెక్కులు ఇస్తాం. ప్రామిసరీ నోట్ రాసిస్తాం. బాండ్ పేపరుపై రాసిస్తాం.. నమ్మకం లేదా? ఐతే నాలుగు నెలల్లో డబుల్ చేస్తాం. దానికి గాను గుంట భూమిని రిజిస్ట్రేషన్ చేసిస్తాం. అమౌంట్ ఇవ్వగానే మా భూమి మాకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయండి.. అన్నీ కంపెనీ తరపునే జరుగుతాయి. చాలా పెద్ద కంపెనీ ఇది. ఇక్కడే కాదు.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోనూ ఆఫీసులు ఉన్నాయి. కంపెనీ మీద నమ్మకం లేకపోతే చెప్పండి. రెండు నెలల్లో 50 శాతం అదనంగా ఇస్తాం. దానికి మా సొంత చెక్కులు ఇస్తాం.. ఇది అందరికీ కాదు. మమ్మల్ని నమ్మినోళ్లకే. మా మీద విశ్వాసం ఉంటే పెట్టుబడి పెట్టండి.. అంటే ఎవరైనా బుట్టలో పడాల్సిందే.. అలాంటి కంపెనీ మూతపడింది.
- ఓ సంస్థ కస్టమర్ల నుంచి డబ్బులను సేకరిస్తున్నది. వీళ్లేమో వందకు రూ.4 వడ్డీ చెల్లిస్తామంటున్నారు. 25 నెలల్లో రెట్టింపు ఇస్తాం. ప్రతి నెలా వడ్డీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటున్నది. రూ.4 వడ్డీ చెల్లించేంతగా లాభాలు వస్తున్నప్పుడు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోకుండా కస్టమర్ల నుంచి ఎందుకు వసూళ్లు చేస్తున్నారు? ప్రతి నెలా వడ్డీ కడతామంటూ బై బ్యాక్ ఆఫర్ ఎందుకు? అన్న సందేహం రాకుండా మాటల గారడి చేసేస్తున్నారు. తమ దగ్గర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, అడ్వకేట్లు కూడా పెట్టుబడి పెట్టారంటూ ప్రచారం చేస్తున్నారు. వాళ్లందరి పేర్లు చెప్తూ మార్కెటింగ్ చేస్తుండడంతో కస్టమర్లకు ఎలాంటి డౌట్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వడ్డీ చెల్లింపు బిజినెస్ చట్టం ప్రకారం ఎలా చెల్లుబాటు అవుతుందన్న ప్రశ్నలే ఉత్పన్నం కాకుండా మాయ చేస్తారు.
- హైటెక్ సిటీకి కూతవేటు దూరం. చదరపు అడుగ ధర రూ.4,999 మాత్రమే. నాలుగేండ్లల్లో మీరు గృహ ప్రవేశం చేయొచ్చు. ఐతే ఇప్పుడే 100 శాతం డబ్బులు చెల్లించాలి.. అంటూ ప్రీ లాంచ్ స్కీంలను అమలు చేస్తున్న కంపెనీలు ఉన్నాయి. అక్కడ చ.అ. ధర రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. కానీ అంత తక్కువ ధరకే ఎలా సాధ్యం? గ్యారంటీ ఏంటి? అన్న సందేహాలే రాకుండా కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలా ఒకటీ రెండు కాదు.. పదుల సంఖ్యలో బడా కంపెనీలు అందంగా బురిడీ కొట్టించి వేలాది మంది కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టేస్తున్నారు.
రైతుబంధు ఇప్పిస్తాం
మీరు రూ.16 లక్షల పెట్టుబడి పెడితే భద్రత కోసం 484 చదరపు గజాల భూమి రిజిస్ట్రేషన్ మీ పేరు మీద చేయిస్తాం. ధరణి పోర్టల్ ద్వారా పట్టా పాస్ బుక్ మీ చేతికి వస్తుంది. అదే విధంగా రైతుబంధు ఇప్పిస్తాం. రైతుబంధుకు అర్హులవుతారు. ప్రతి నెలకు రూ.64 వేలు చొప్పున 25 నెలలు ఇస్తాం. మళ్లీ 25 నెలల తర్వాత, మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం రూ.8 లక్షలు తిరిగి ఇచ్చేస్తాం. భూమి రిజిస్ట్రేషన్ పత్రాలను తిరిగి ఇవ్వాలి. 25 నెలల్లో మొత్తం రూ.32 లక్షలు అంటే రెట్టింపు అందుతుంది. ప్రతి నెల 25వ తేదీన రూ.64 వేలు మీ ఖాతాలో జమ చేస్తామంటూ విస్తృతంగా మార్కెటింగ్ చేశారు. పెట్టిన పెట్టుబడికి వందకు రూ.4 వడ్డీ చెల్లించేందుకు సదరు కంపెనీ అగ్రిమెంట్లు రాసిచ్చారు. ల్యాండ్ సేల్ డీడ్స్ మాత్రం వ్యక్తుల పేర్ల మీద నడుస్తున్నాయి. అగ్రిమెంట్లు మాత్రం కంపెనీతో కుదుర్చుకుంటున్నారు. ఎక్కడైనా భూముల అమ్మకం అంటే హెచ్ఎండీఏ, డీటీసీపీ లే అవుట్లకు అనుమతులు తీసుకోవాలి. రెరా పర్మిషన్ కూడా ఉండాలి. ఈ కంపెనీ మాత్రం గుంట భూమిని కూడా వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించారు. సకల సౌకర్యాలు కల్పించిన భూముల అమ్మకం వ్యవసాయం ఎలా అవుతుందో తహశీల్దార్లు క్లారిటీ ఇవ్వరు. పైగా గుంట భూమికి కూడా రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఎంపిక చేస్తుండడం ఏ రీతిన ఆమోదమో కూడా చెప్పరు. కానీ ఈ లోగా వందలాది మంది నుంచి రూ.వందల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు.
క్యూ కడుతున్న బాధితులు
- బై బ్యాక్ పాలసీ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్ పేరుతో అమాయకుల నుంచి డిపాజిట్లు వసూలు చేసి, వారికి ఇచ్చిన హామీ మేరకు వడ్డీ చెల్లించకుండా ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసిన ఎనిమిది మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ స్కీమ్ లలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో తిరిగి చెల్లిస్తామని అమాయకుల చేత పెట్టుబడులు పెట్టించింది. వాటిని తిరిగి చెల్లించకుండా నిందితులు 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు మోసం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారించారు. సంస్థ ఎండీ కలిదిండి పవన్ కుమార్. రావుల సత్యనారాయణ, బొద్దులు హరికృష్ణ, వల్లూరు భాస్కర్ రెడ్డి, పగడాల రవి కుమార్ రెడ్డి, కొల్లాటి జ్యోతి, కురళ్ల మౌనిక, కుర్కుల లావణ్యలు ఓ జట్టుగా ఏర్పడి 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. బై బ్యాక్ ఓపెన్ ప్లాట్స్ స్కీమ్‌ని 25 నెలలకు ( రూ.8 లక్షల 8 వేలు) ప్రవేశపెట్టారు. ఇందులో ప్రతి వినియోగదారుడు కనీసం 2 గుంటల భూమిని కొనుగోలు చేయాలి, దీని కోసం వినియోగదారులు రూ. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపి రూ. 8.08 లక్షలు. దాని కోసం కంపెనీ ప్రతి కస్టమర్‌కు ప్రతి నెలా 4 శాతం లాభం ఇస్తుంది. ఇది 25 నెలలకు నెలకు రూ.32,000 వేలు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బిజినెస్ అసోసియేట్‌కి ఒక్క శాతం కమీషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే డబుల్ గోల్డ్ స్కీమ్ కింద కస్టమర్ రూ. 4 లక్షల వరకు కనీస పెట్టుబడి పెడితే కంపెనీ కస్టమర్‌కు బాండ్ రసీదుని ఇస్తుంది. 12 నెలల వ్యవధి పూర్తయిన తర్వాత, చివరిలో వారు రూ. 8 లక్షల విలువైన స్విట్జర్లాండ్ ముద్రతో ఉన్న బంగారం బిస్కెట్లను అందిస్తుంది. ఈ గోల్డ్ చిట్స్ స్కీమ్ 20 నెలల ప్లాన్ కింద, కస్టమర్లు రూ. 5 లక్షలు ఇస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. 19 నెలలకు 3శాతం వడ్డీగా నెలకు రూ.15 వేల చొప్పున తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విధంగా నిందితులు సుమారు 3600 మంది సభ్యుల నుండి రూ.300 కోట్ల వరకు వసూల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అయితే, మోసపోయినవారికి డబ్బులు అందుతాయా? మోసం చేసిన వారికి ఎలాంటి శిక్ష ఉంటుంది? అన్నది జవాబు లేని ప్రశ్నలుగా మిగిలిపోనున్నాయి.
భారతీ బిల్డర్స్ దగా
ప్రీ లాంచ్ పేరుతో బాధితులను నట్టేట ముంచేసింది. కొంపల్లిలో వెంచర్ పేరుతో బాధితుల నుంచి భారతీ బిల్డర్స్ అనే సంస్థ భారీగా డబ్బులు వసూలు చేసింది. ఆపై ల్యాండ్ ను వారి పేరున రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేసింది. 450 మంది నుంచి రూ.200 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణ. బాధితులు తమ డబ్బు తమకు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భారతి బిల్డర్స్ ఫైనాన్షియర్ సునీల్ అహుజ నివాసం ఎదుట కూడా వారు ఆందోళన చేశారు. ఈ సంస్థ కొంపల్లిలోని ప్రైమ్ ఏరియాలో ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో భారతి బిల్డర్స్ ల్యాండ్ కొనుగోలు కోసం సుమారుగా కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి దగ్గరి నుంచి సుమారుగా 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు డబ్బు కట్టించుకుంది. అయితే ల్యాండ్ రిజిస్ట్రేషన్ మాత్రం వారి పేరుతో చేయలేదు. తమ డబ్బు తమకు తిరిగివ్వాలని అనేకమార్లు వారి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని బాధితులు వాపోయారు. దీంతో పాటు కస్టమర్ల పేరుతో కొనుగోలు చేసిన ల్యాండ్ ను భారతి బిల్డర్స్ వారు మరొక దగ్గరి తనఖా పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు వారికి తెలిసింది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు స్థానిక పోలీస్ స్టేసన్ లో ఫిర్యాదు చేశారు. రెండేళ్లు కావొస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ కంపెనీలే
+ సాహితీ డెవలపర్స్ వినియోగదారులను ముంచారు. డబ్బులు చెల్లించి ఏండ్లు గడుస్తున్నా ఫ్లాట్ హ్యాండోవర్ చేయలేదు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ వద్ద సాహితీ శర్వాని ఎలైట్ పేరుతో ప్రాజెక్టులో ప్రీ లాంచ్ ఆఫర్ అంటూ వందలాది మందికి టోకరా వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.వందల కోట్ల మేర దండుకుని మోసం చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఆనంద్ ఫార్చ్యూన్ పేరుతో ప్లాట్లు విక్రయించిన సాహితి కన్‌స్ట్రక్షన్స్‌పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్ఎండీఏ అనుమతులతో సాహితి కన్‌స్ట్రక్షన్స్ వారు ఇచ్చిన భారీ భవన నిర్మాణంలో ప్లాట్లు కొనుగోలు చేసి సంవత్సర కాలంగా బిల్డర్, ల్యాండ్ ఓనర్ చేతిలో మోసపోయామని, ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదని, లోన్లు రావడం లేదని, నిర్మాణం కూడా పూర్తి కాకపోవడంతో బాధితులు సంఘంగా ఏర్పడ్డారు. సాహితి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ లక్ష్మీనారాయణ, పార్వతీ.. ఆనంద్ ఫార్చున్ ఎండీ ఆనంద్ నాయుడు మధ్య వివాదం కారణంగా ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రగతి నగర్ మెయిన్ రోడ్ కు సమీపంలో ఈ భవన నిర్మాణంలో చిరుద్యోగులు కష్టార్జితాన్ని కూడబెట్టి అపార్ట్ మెంట్ లో ఫ్లాట్లు కొనుక్కున్నారు. 36 నెలలు గడిచినా ఇప్పటికి కూడా నిర్మాణం పూర్తి కాలేదు.
+ హైదరాబాద్ లోని జయంత్రి రిలియబిలిటీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ సామాన్యులను ముంచింది. పాటిఘనపూర్, అమీన్ పూర్, చందానగర్, నిజాంపేట, తోల్కట్ట, సదాశివపేట, షాద్‌నగర్, రాయదుర్గం, లింగంపల్లి, సర్దార్ పటేల్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రీ లాంచ్ పేరిట ముందే డబ్బులు వసూలు చేసింది. కంపెనీ ఎండీ కాకర్ల శ్రీనివాస్, అతని అనుచరగణం వసూళ్లకు పాల్పడ్డారు. ఆ తర్వాత రూ.కోట్లను దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టిన వారంతా నిలదీశారు. 2021 నుంచే ఈ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
+ కపిల్ దేవ్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, మరో క్రికేటర్ ఎంఎస్ కే ప్రసాద్ ఫోటోలతో ప్రచారం చేశారు. కస్టమర్లకు మాయ మాటలు చెప్పి 500 మందిని రోడ్డు పాలు చేసిన ఘనత ఆర్ జే హోమ్స్ కి దక్కింది. సుమారు రూ.150 కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులు. కూకట్ పల్లిలో భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణి భార్య భర్తలు కలిసి ఆర్ జే హోమ్స్(ఆర్ హోమ్స్) పేరిట దందా చేశారు. ఘట్ కేసర్ మండలం యమ్నంపేట దగ్గర దాదాపు 7 ఏకరాలలో వాసవి బ్లిస్ హైట్స్ పేరుతో ఫ్లాట్స్ ను నిర్మిస్తున్నట్లు ప్రకటనలు ప్రచారం చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్ కింద మార్కెట్ ధరకు రూ.1000 ఎస్ఎఫ్‌టీకి తక్కువగా ఇస్తు్న్నానని నమ్మించాడు. 2023 కల్లా పూర్తి చేసి మీ సొంతింటి కలను తీరుస్తామని హామీ ఇచ్చారు. పటాన్ చెరు సమీపంలో ఖద్దనూరు దగ్గర కూడా 9 ఎకరాల్లో ఫ్లాట్స్ ను నిర్మిస్తున్నానని మొత్తం 600 మంది బాధితుల వద్ద వసూలు చేశారు.
నిబంధనలేవి?
హైదరాబాద్లో నలభై నుంచి యాభై మంది రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు.. గత రెండు మూడేళ్ల నుంచి ప్రీలాంచ్ దందాలు చేస్తున్నారు. రేటు తక్కువ అంటూ.. ప్లాట్లు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాలు, ఐటీ స్పేస్, మెట్రో స్టాళ్లు, అద్దె గృహాలు.. ఇలా రకరకాల విభాగాల్లో అమాయక కొనుగోలుదారులకు ఆశలు చూపించి రూ.కోట్లు దండుకుంటున్నారు. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీరిని ఎందుకు వదిలేస్తున్నారు? నిబంధనల ప్రకారం నిర్మాణాల్ని చేపట్టని వారి పట్ల చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ప్రతి డెవలపర్స్, రియల్ ఎస్టేట్ కంపెనీ వెనుక బడా లీడర్ ఉండడం మూలానేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిబంధనల ప్రకారం నిర్మాణాల్ని కట్టే బిల్డర్లను ప్రభుత్వ అధికారులు రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. ఎన్వోసీల కోసం సతాయిస్తారు. కానీ, ప్రీలాంచ్‌లో ప్లాట్లు, ఫ్లాట్లు అమ్మే వారికి వీరితో ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. ఏ ఒక్కరిపైనా సుమోటోగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేసులు నమోదు చేయించిన అధికారి కూడా లేకపోవడం గమనార్హం.
చూడాల్సినవి అంశాలివే
1. ఆ సంస్థ పేరిట ల్యాండ్ ఉందా? లేదా? ఎవరి పేరిట ఉంది? మార్కెటింగ్ చేస్తున్నది ఎవరు? అగ్రిమెంట్లు చేస్తున్నది ఎవరు?
2. జీహెచ్ఎండీ/హెచ్ఎండీఏ/డీటీసీపీ అనుమతులు ఉన్నాయా? కనీసం అప్లై చేశారా?
3. అసలు ఎంత ల్యాండ్ కంపెనీ పేరు మీద ఉంది? ఎంత విస్తీర్ణం అంటూ ప్రాజెక్టులో పేర్కొన్నారు?
4. ముందు 100 శాతం డబ్బులు చెల్లిస్తే ప్రాజెక్టు అనివార్య కారణాలతో నిలిచిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు గ్యారంటీ? ఏం గ్యారంటీ?
5. అసలు రెరాలో ప్రాజెక్టు నమోదైందా? లేదా?
6. ఇలాంటి అంశాలను పరిశీలించకుండా ప్రీ లాంచ్ లేదా మరే ఇతర ప్రకటనలను నమ్మి డబ్బులు చెల్లిస్తే గ్యారంటీ శూన్యం.