Mahatma Gandhi: మహాత్మా గాంధీకి చెందిన కళాఖండాలు, పత్రాలను భారత్‌కు అందజేసిన దక్షిణాఫ్రికా ట్రస్ట్

by S Gopi |
Mahatma Gandhi: మహాత్మా గాంధీకి చెందిన కళాఖండాలు, పత్రాలను భారత్‌కు అందజేసిన దక్షిణాఫ్రికా ట్రస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహాత్మా గాంధీ చేతితో నేసిన వస్త్రాలు, ఇతర కీలక కళాఖండాలు, దక్షిణాఫ్రికాలో ఆయన బసకు సంబంధించిన చారిత్రాత్మక పత్రాలను ఆదివారం దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్ ట్రస్ట్-గాంధీ డెవలప్‌మెంట్ ట్రస్ట్(పీఎస్‌టీ-జీడీటీ) భారత ప్రభుత్వానికి అందజేసింది. వాటిని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం అందుకున్నారు. దీని గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఎస్ జైశంకర్.. ఫీనిక్స్ సెటిల్‌మెంట్ ట్రస్ట్‌కు కృతజ్ఞతలు చెప్పారు. మహాత్మా గాంధీకి సంబంధించిన కళాఖండాలు, పత్రాలను అందుకోవడం సంతోషంగా ఉంది. బాపు జీవితం, సందేశం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందన్నారు. వస్తువుల జాబితాలో మహాత్మా గాంధీ చేతితో నేసిన దుస్తులు, ఎరుపు అంచుతో ఉన్న కస్తూర్బా చీర, ఆమె బ్లౌజ్, అండర్ స్కర్ట్, గుడ్డ ముక్క, గాంధీ లుంగీ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా, మహాత్మ గాంధీ కుమారుడు మణిలాల్ గాంధీతో వివాహ సమయంలో ఆయన భార్య సుశీలాబెన్ ధరించిన దూదితో బాపు చేసిన మాలలోని ఒక భాగం, దాని మూలాన్ని వివరించిన లేఖ ఉన్నాయని అధికారులు తెలిపారు. అలాగే, ఫీనిక్స్ సెటిల్‌మెంట్ బదిలీ పత్రం, ఫీనిక్స్ సెటిల్‌మెంట్ బ్యాలెన్స్ షీట్, పాసివ్ రెసిస్టెన్స్ ఫండ్ బ్యాలెన్స్ షీట్, ఇండియన్ ఒపీనియన్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇండియన్ ఒపీనియన్ పబ్లిషర్‌ల లైసెన్స్, ఫీనిక్స్‌లోని స్టేషనర్ల లైసెన్స్ బదిలీ పత్రాలు అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇతర పత్రాలలో చార్లెస్‌టౌన్ నుంచి 1913లో వచ్చిన టెలిగ్రామ్‌లు, మణిలాల్ గాంధీ దేవదాస్ గాంధీకి రాసిన లేఖలు, సుశీల గాంధీకి రాసిన లేఖలు ఉన్నాయి.

Next Story

Most Viewed