విదేశాలలో ఉద్యోగమంటూ మోసం.. చివరికి..

by Sumithra |
crime news
X

దిశ, జవహర్ నగర్: ఆన్‌లైన్ యాప్‌లో పరిచయం చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న నైజీరియా వాసిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం… నైజీరియాకు చెందిన డేనియల్ ఒబియానో (30) స్టూడెంట్ వీసాతో 2011లో భారతదేశానికి వచ్చి, ముంబైలో డిగ్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాడు. తరువాత 2018లో కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులోని 48/14 వ అంతస్తు, శ్రీసాయి రామ్ ప్యారడైజ్ లయోట్, గంగమ్మ లయోట్ అమృతహల్లి, ఎస్‌కేఆర్ పోస్ట్, జక్కూర్, అమృతహల్లి, ఆర్టీ నగర్ లలో నివాసం ఉంటున్నాడు. అక్కడ తన నైజీరియా స్నేహితుల ద్వారా ఆన్‌లైన్, సైబర్ మోసాల గురించి తెలుసుకున్నాడు. ఆన్‌లైన్ లోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ లలో భారతీయులతో యూరోపియన్ పౌరుడిగా మోసానికి తెరలేపాడు.

ఆ ప్రక్రియలో నిందితుడు యూరోపియన్, ఇతర పురుషులు, స్త్రీల యొక్క అనేక ఫోటోలు ఫేస్‌బుక్ ఖాతాల నుండి డౌన్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. తరువాత అతను తన నైజీరియా స్నేహితులైన బాంకె అలియాస్ బ్యాంకింగ్స్, ఒకా ఓయిస్ అలియాస్ ఒవిస్, అబుజా బ్రోతో కలిసి వివిధ పేర్లతో అనేక నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించారు. వారు విదేశాలలో ఉద్యోగాలు, విదేశాల నుండి బహుమతులు, స్నేహం ముసుగులో డబ్బు గుంజేందు కోసం వారి లక్ష్యంగా ఉన్న వ్యక్తులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఈ క్రమంలో కుషాయిగూడ‌కు చెందిన బాధితురాలు, ఆమె సోదరికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రిజిస్ట్రేషన్ ఫీజు, ఆఫర్ లెటర్ ఫీజు, వీసా ఫీజు, ఐఈఎల్టీఎస్ కోసం బాధితుల నుండి రూ.51 లక్షల 32 వేలను అకౌంట్లో వేయించుకున్నాడు.

తరువాత ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిఘా పెట్టిన పోలీసులు బెంగుళూరులో డేనియల్ ఒబియానోను అరెస్టు చేశారు. నిందితుడిని బెంగుళూరులో అరెస్ట్ చేసి, తన బ్యాంక్ ఖాతాలోని రూ.7లక్షల 12 వేలను సీజ్ చేస్తూ, 2 మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్, రౌటర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ టాస్క్ రాచకొండ సీపీ మహేష్ భగవత్ సారథ్యంలో క్రైమ్ డీసీపీ యాదగిరి నేతృత్వంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ హరనాథ్, ఇన్స్పెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed