పాదయాత్రలో బండి సంజయ్‌కి ఎదురీత తప్పదా?

by Shyam |   ( Updated:2021-08-14 00:01:19.0  )
పాదయాత్రలో బండి సంజయ్‌కి ఎదురీత తప్పదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి తలపెట్టిన ‘ప్రజా సంగ్రామ‘ పాదయాత్రపై పార్టీలోనే చర్చ మొదలైంది. రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ ధోరణి, టీఆర్ఎస్ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పాదయాత్రకు ప్రజల నుంచి ఆగ్రహం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలోని సమస్యలు ఎలా ఉన్నా.. కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజలపై పడిన భారం సంగతేందో తేల్చాలని ప్రజలు నిలదీస్తే ఎలాంటి సమాధానం చెప్పాలనే విషయమై వారం క్రితమే రాష్ట్ర నేతలతో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ను ఉచితంగానే ఇస్తున్నదనే అంశాన్ని తెరపైకి తెచ్చి వారి ఆగ్రహాన్ని చల్లార్చాలనే నిర్ణయానికి వచ్చారు. ‘ప్రజా సంగ్రామ’పాదయాత్రలో ప్రధానంగా పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, నిత్యావసర వస్తువుల ధర పెరుగుదల, కరోనా కట్టడిలో వైఫల్యం లాంటి అంశాలపై ప్రజలు గట్టిగానే నిలదీసే అవకాశం ఉంది.

ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుంటుందనే అనుమానంతోనే ఈ ఆర్థిక భారం ద్వారా ప్రభుత్వానికి సమకూరిన డబ్బును ప్రజలకు వ్యాక్సిన్ రూపంలో ఖర్చు చేస్తున్నదంటూ చెప్పి తిప్పికొట్టాలని బీజేపీ భావిస్తున్నది. వ్యాక్సిన్ కోసం భారీ స్థాయిలో ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని, ‘ఆత్మనిర్భర్’ప్యాకేజీలో రూ. 35 వేల కోట్లను ఇందుకోసమే కేటాయించిందంటూ సర్ది చెప్పాలనుకుంటున్నది. సరిగ్గా ఇవే అంశాలను ప్రస్తావించి ఇరుకున పెట్టడానికి టీఆర్ఎస్ సైతం తన కార్యకర్తల ద్వారా ప్లాన్ చేస్తున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటు వేయడానికి ముందు కేటీఆర్ ఎల్‌పీజీ వంటగ్యాస్ సిలిండర్‌కు ఇంట్లో దండం పెట్టుకున్న ఫోటోను ట్విట్టర్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. వంట గ్యాస్ ధర పెరిగినందుకు బీజేపీకి ఓటు వేయాలా అనే చర్చను పట్టభద్రులైన ఓటర్లలో లేవనెత్తారు. ఈ ట్వీట్‌పై అప్పట్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. అదే అంశాన్ని ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతోపాటు వంట గ్యాస్‌పై సబ్సిడీని భారీ స్థాయిలో తగ్గించిన అంశాన్ని కూడా తమ కార్యకర్తల ద్వారా వేడి పుట్టించేందుకు టీఆర్​ఎస్​ సిద్ధమవుతున్నది.

స్థానికుల ఆగ్రహం, వామపక్షాల తెర వెనక ప్రయత్నాలు కూడా ఇందుకు తోడయ్యే అవకాశం ఉంది. కరోనా పరిస్థితుల్లో ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి ఊహకు అందని విధంగా దిగజారిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. ఉప్పు-పప్పు మొదలు వంటనూనెలు సహా అన్ని రకాల ఆహార పదార్ధాల ధరలు గణనీయంగా పెరిగాయి. దీనిపై ప్రజల్లో తీవ్రంగానే ఆగ్రహం ఉన్నది. ప్రజలు ఈ అంశాలపై నిలదీస్తారని బీజేపీ ముందుగానే ఊహించింది. కరోనా సమయంలో ఆస్పత్రుల బెడ్‌ల కోసం, ఆక్సిజన్ కోసం, మందుల కోసం పడిన కష్టాలన్నింటినీ ఈ యాత్ర సందర్భంగా ప్రస్తావించి బీజేపీని ఇరుకున పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి పరిణామాలను గుర్తించిన బీజేపీ రాష్ట్ర నేతలు తమదైన శైలిలో తిప్పికొట్టడానికి కూడా తగిన వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న ‘వ్యాట్’ను తగ్గించుకోవచ్చనే అంశాన్ని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నది. ప్రజలపై పడిన పెట్రోలు, డీజిల్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పన్నులు తగ్గించడం ద్వారా ఉపశమనం కలిగించాలన్న సూచన చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. బండి సంజయ్ పాదయాత్ర కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నా.. ఇలాంటి అనూహ్య పరిణామాలు ఎదురవుతాయని ముందుగానే ఊహించి అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తున్నది.

Read More:

చిక్కుల్లో కరీంనగర్ డీఈవో..వివాదస్పదంగా ఉత్తర్వులు

‘దళితబంధు’కు చిక్కులు స్టార్ట్ (వీడియో)

Advertisement

Next Story

Most Viewed