వైల్డ్‌ లైఫ్ ఫొటోగ్రాఫర్లకు కొత్త ఇన్‌‌స్పిరేషన్

by Anukaran |   ( Updated:2020-10-19 03:10:20.0  )
వైల్డ్‌ లైఫ్ ఫొటోగ్రాఫర్లకు కొత్త ఇన్‌‌స్పిరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో మాధవన్ పోషించిన క్యారెక్టర్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అవ్వాలని కలలు కంటుంటాడు. చివరికి అవుతాడు. అప్పట్లో ఎవరైనా నీ లక్ష్యం ఏంటి అంటే.. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అని చెప్పేవారంటే, ఆ సినిమాలో పాత్రల కంటే ఈ ప్రొఫెషన్ ఎంతలా ప్రేక్షకుల మనస్సులో పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. మాధవన్ పాత్రను ఆదర్శంగా తీసుకుని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ కోర్సు చేసి, ఆ దిశగా ప్రయత్నాలు చేసిన వారు కూడా ఉన్నారు. అయితే ఇలా సినిమాల నుంచి ప్రేరణ తీసుకోవడం కంటే నిజజీవిత వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటే మరింత స్ఫూర్తి కలుగుతుంది. కానీ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌లుగా మారి, విజయాలు సాధించిన వారు చాలా తక్కువ. కానీ ఇక ఆ సందేహం వద్దు, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్న భారతీయులకు ఐశ్వర్యా శ్రీధర్ రూపంలో ఒక మంచి ఇన్స్‌పిరేషన్ దొరికింది.

మహారాష్ట్రలోని పన్వేల్‌కు చెందిన ఐశ్వర్య శ్రీధర్ వయస్సు 23 ఏళ్లే, కానీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో ప్రపంచస్థాయి అవార్డును అందుకుంది. 56వ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2020లో ఎక్కువ పొగడ్తలు సంపాదించిన కేటగిరీలో ఐశ్వర్య అవార్డు సంపాదించుకుంది. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ రంగంలో ఈ అవార్డును ఆస్కార్‌గా పరిగణిస్తారు. అలాంటిది అత్యంత చిన్నవయస్సులో ఈ అవార్డు పొందడం నిజంగా గర్వకారణం. ఈ ఏడాది 80 దేశాల నుంచి దాదాపు 50వేల ఫొటోలు వివిధ కేటగిరీల్లో అవార్డుల కోసం పోటీపడ్డాయి. వాటిలో తాను తీసిన ఫొటోకు అవార్డు రావడం సంతోషంగా ఉందని ఐశ్వర్య తెలిపారు. ఈ ఫొటోను నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచడంతో పాటు 6 దేశాల్లో 60 పర్యాటక ప్రదేశాల్లోని ఎగ్జిబిషన్లలో పెడతారు.

Advertisement

Next Story

Most Viewed