T20 World Cup 2024 : బెంబేలెత్తించిన పసికూన.. చెమటోడ్చి నెగ్గిన విండీస్

by Harish |   ( Updated:2024-06-02 18:43:33.0  )
T20 World Cup 2024 : బెంబేలెత్తించిన పసికూన.. చెమటోడ్చి నెగ్గిన విండీస్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఆతిథ్య వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో పపువా న్యూగినియాలాంటి చిన్నజట్టుతో తలపడుతుండటంతో మ్యాచ్ ఏకపక్షమే అని అంతా భావించారు. కానీ, విజయం కోసం విండీస్ జట్టు తీవ్రంగా శ్రమించింది. గయానా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాపువా న్యూగినియాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాపువా న్యూగినియా నిర్ణీత ఓవర్లలో 136/8 స్కోరు చేసింది. సెసే బావు(50) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆ జట్టు ఆ స్కోరైనా చేయగలిగింది. కిప్లిన్ డోరిగా(27), కెప్టెన్ అసద్ వాలా(21) విలువైన పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో రస్సెల్(2/19), అల్జారీ జోసెఫ్(2/34) రాణించారు.

అనంతరం ప్రత్యర్థి నిర్దేశించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ అలవోకగా ఛేదిస్తుందనుకుంటే చివరి వరకూ కష్టపడింది. 5 వికెట్లు కోల్పోయి 19వ ఓవర్‌లో లక్ష్యాన్ని పూర్తి చేసింది. పాపువ న్యూగినియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విండీస్‌ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ జాన్సన్ చార్లెస్(0) డకౌటవ్వగా.. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్(34), నికోలస్ పూరన్(27) ఇన్నింగ్స్ నిర్మించారు. పరుగులు సాధించడానికి వీరు కష్టపడ్డారు. అయితే, విండీస్‌ను బెంబేలెత్తించిన ప్రత్యర్థి బౌలర్లు వరుసగా వికెట్లు సాధించారు. బ్రాండన్ కింగ్, పూరన్‌తోపాటు కెప్టెన్ పావెల్(15), రూథర్‌ఫోర్డ్(2) వికెట్లు పారేసుకోవడంతో 97 పరుగులకు కరేబియన్ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రోస్టన్ చేజ్ జట్టుకు అండగా నిలిచాడు. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్న తరుణంలో అతను కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన సమయంలో పాపువా న్యూగినియా బౌలర్లు అద్భుతం చేసేలా కనిపించారు. రోస్టన్ చేజ్(42 నాటౌట్)కు రస్సెల్(15 నాటౌట్) తోడవడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే విండీస్ విజయతీరాలకు చేరింది.

Advertisement

Next Story

Most Viewed