- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20 వరల్డ్ కప్‌పై కరోనా ఎఫెక్ట్: ప్లాన్ బీ అమలు చేస్తారా..?
దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో రోజుకు సగటున లక్ష కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడటానికి ఆయా జట్లతో ఉన్న క్రికెటర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గ్రౌండ్స్‌మెన్, ఈవెంట్ మేనేజర్లు మొత్తం 16 మంది కరోనా బారిన పడ్డారు. అక్షర్ పటేల్, దేవ్‌దత్ పడిక్కల్, డేనియల్ సామ్స్ వంటి క్రికెటర్లు కరోనా బారిన పడటంతో ఆయా ఫ్రాంచైజీలు ఆందోళన చెందుతున్నాయి. బీసీసీఐ కఠినమైన నిబంధనలతో కూడిన ప్రోటోకాల్స్ మధ్య బయోబబుల్‌ను సృష్టించింది. అయినా కరోనా బారిన పడుతుండటంతో ప్రతీ ఒక్కరిలో ఐపీఎల్ సక్రమంగా జరుగుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంబో బుధవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు సభ్యులతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇండియాలో అక్టోబర్-నవంబర్ నెలల్లో పురుషుల టీ20 వరల్డ్ కప్ నిర్వహించాల్సి ఉన్నది. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇండియాలో వరల్డ్ కప్ నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి.
ఐపీఎల్ విజయవంతం అయితేనే..!
ఐపీఎల్ 14వ సీజన్ విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత బీసీసీఐపై పడింది. ఈ లీగ్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగితేనే టీ20 వరల్డ్ కప్‌పై అనుమానాలు తొలగిపోతాయి. ఇటీవల పాకిస్తాన్‌లో నిర్వహించిన పీఎస్ఎల్ కరోనా కారణంగా మధ్యలోనే అర్ధాంతరంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. బయోబబుల్ ఏర్పాటు చేసినా ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అదే పరిస్థితి ఎదురై లీగ్ వాయిదా పడితే దాని ప్రభావం టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై కూడా పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐసీసీ తాత్కాలిక సీఈవో జెఫ్ అలర్‌డైస్ బుధవారం వరల్డ్ కప్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రస్తుతానికైతే ఇండియా నుంచి టీ20 వరల్డ్ కప్‌ను తరలించడం లేదు. ప్రస్తుతం ఐసీసీ టీమ్ భారత్‌లోని పరిస్థితిని సమీక్షిస్తున్నంది. ఐపీఎల్‌ను కూడా నిశితంగా గమనిస్తున్నది. ఐపీఎల్ అనంతరం టీ20 వరల్డ్ కప్‌పై ఒక నిర్ణయానికి వస్తాము. అప్పటికీ పరిస్థితి మరింత జఠిలంగా మారితే మా వద్ద ప్లాన్ బి సిద్ధంగా ఉన్నది. దాన్ని అమలు చేస్తాము’ అని ఆయన అన్నారు. సీఈవో జెఫ్ చెప్పిన దాన్ని బట్టి ఐపీఎల్ పైనే ఇండియాలో భవిష్యత్ టోర్నీల నిర్వహణ ఆధారపడి ఉంటుందనేది స్పష్టమైంది.
ప్లాన్ బి ఏమిటి?
ఐసీసీ సీఈవో జెఫ్ ప్లాన్ బి గురించి వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపుతున్నది. ప్రస్తుతానికైతే ప్లాన్ బి ఏమిటనేది వెల్లడించలేమని ఆయన అన్నారు. అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం ఇండియాలో టీ20 వరల్డ్ కప్ సాధ్యపడకపోతే దాన్ని యూఏఈకి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. యూఏఈలో కఠినమైన కరోనా నిబంధనలు అమలులో ఉన్నాయి. అక్కడ కేసులు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి.
గత ఏడాది ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించారు. బీసీసీఐ ఉపయోగించిన 3 స్టేడియంలకు తోడు అక్కడ అంతర్జాతీయ స్థాయి స్టేడియంలో మరిన్ని అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అక్కడికి వరల్డ్ కప్ తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఐసీసీ చెబుతున్న ప్లాన్ బీ అదేనని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఇండియాలోనే వరల్డ్ కప్ నిర్వహించాలంటే అక్టోబర్ నాటికి కేసులు తగ్గుముఖం పట్టాల్సి ఉంది. అంతే కాకుండా భారత ప్రభుత్వం ప్రేక్షకులను కూడా అనుమతించాల్సి ఉంటుంది. ఐపీఎల్ ముగిస్తే కాని వరల్డ్ కప్ నిర్వహణపై ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు.