కరోనా సోకితే.. చాలామందికి ఇలానే చేస్తున్రు

by Shyam |   ( Updated:2020-08-20 21:49:37.0  )
కరోనా సోకితే.. చాలామందికి ఇలానే చేస్తున్రు
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా సోకిందని అనిపించుకోవడం కంటే గుట్టుగా బయట పడడానికే జనం మొగ్గు చూపుతున్నారు. టెస్టులు చేయించుకొని రిపోర్టు వచ్చే వరకు వేచి చూడడం. ఆసుపత్రుల్లో చేరడం..చికిత్స పొందడం కష్టంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలకు నెలవుగా మారాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కాలు పెడితే రూ.లక్షలు సమర్పించుకోవాల్సి వస్తుంది. అందుకే చాలా మంది హోం ఐసోలేషన్ వైపే అడుగులు వేస్తున్నారు. నిపుణుల పేరుతో ప్రచారంలోకి వచ్చిన 14 రోజుల మందుల జాబితా, సూచనలను ఫాలో అవుతున్నారు. హోం ఐసోలేషన్లో ఉన్నవారికి ప్రభుత్వం ఆ మందులతో కూడిన కిట్లనే పంపిణీ చేస్తోంది. అనుమానం ఉన్నవారు ఆ మందులే తెచ్చుకొని వాడుతున్నారని తెలుస్తోంది.

కరోనా రోగుల సంఖ్యపై సీసీఎంబీ, ఐఐసీటీ శాస్త్రవేత్తలు తాజాగా ఓ బాంబు పేల్చారు. మేధావులు, ప్రతిపక్షాలు వాదించినట్లుగానే రోగుల సంఖ్యపై స్పష్టత ఇచ్చారు. ఒక్క మహానగరంలోనే 35 రోజులలో ఏకంగా 6.60 లక్షల మందికి కరోనా సోకిందని తేల్చా రు. దీంతో టెస్టులు పెద్ద సంఖ్యలో చేయడం లేదంటూ చాలా రోజులుగా వస్తున్న ఆరోపణలు నిజమేనని తేలింది. మురుగు కేంద్రాల నుంచి సేకరించిన 80 శాతం నీటి ఆధారిత పరీక్షలతోనే ఆ సంఖ్య కనిపిస్తోంది. పూర్తి స్థాయిలోనైతే ఆ లెక్క మరింతగా పెరుగుతుంది. చాలా మంది ఆసుపత్రికి వెళ్లకుండానే కోలుకున్నారు. అందుకే టెస్టుల సంఖ్యకు, సీసీఎంబీ లెక్కలకు మధ్య వ్యత్యా సం స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 97,424 పాజిటివ్ కేసులు ఉండగా, కోలుకున్నవారి సంఖ్య 75,186 గా ఉంది. టెస్టుల సంఖ్య 9 లక్షల వరకు మాత్రమే ఉంది. ఒక్క హైదరాబాద్ లోని కరోనా సోకిన వారి సంఖ్యతో పోలిస్తే పరీక్షల సంఖ్య చాలా తక్కువని తెలుస్తోంది. ప్రతి కాలనీ, ప్రతి బస్తీలోనూ పాజిటివ్ లు ఉన్నట్లేనని అర్థమవుతోంది. కొందరు రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం కరోనా కిట్ల పంపిణీని కూడా చేపట్టారు.

ప్రచారంతోనే ఇదంతా

కరోనాకు చికిత్స లేదు. అనారోగ్య సమస్యల నుంచి కోలుకునేందుకే మందులు ఇస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలకు మందులు చాలు. తక్కువ లక్షణాలున్న వారి ని ఇళ్లలోనే ఉంటూ ట్రీట్‌మెంట్ పొందాలని ప్రభుత్వం సూచించింది. వారి కోసం హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తోంది. ఇందులో కరోనా ట్రీట్‌మెంట్‌కి కావాల్సిన ముఖ్యమైన 12 రకాల వస్తువులు ఉంటున్నాయి. మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు, పారాసిటమాల్ టాబ్లెట్లు ఉంటాయి. హ్యాండ్ వాష్, శానిటైజర్, యాంటీ బయోటిక్స్, విటమిన్ సీ, విటమిన్ ఇ, డి3, ఎసిడిటీని తగ్గించే టాబ్లెట్లు, లివోసిటిరిజైన్ మందులు ఉంటాయి.

దాచి పెడుతున్న జనం

వైరస్ విస్తృతికి వర్షాలు కూడా తోడయ్యాయి. జ్వరం, జలుబు, తలనొప్పి, ఒంటినొప్పులు వంటి సమస్యలతో బాధ పడుతున్నవారి సంఖ్య చాలా ఉంది. వైద్యుల దగ్గరికి వెళ్లే పరిస్థితులు లే వు. ఆర్ఎంపీలు కూడా చికిత్స ఇచ్చేందుకు భయపడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు తప్పనిసరి చేశారు. ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా అదేనేమోనన్న ఫీలింగ్ కలు గుతోంది. అందుకే జనం అనారోగ్య సమస్యలను దాచి పెడుతున్నారు. గడప దాటి బయటికి రావడం లేదు. మందులు ఇష్టానుసారంగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని మందులతో దుష్ప్రభావాలు ఉంటాయని ఫార్మకాలజిస్టు డా.ఎ.సంజయ్ రెడ్డి అన్నారు. పారాసెటిమల్ టాబ్లెట్లను అధికంగా వినియోగిస్తే కాలేయ సమస్యలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస సంబంధ సమస్యలు ఎదురవుతాయి. ఐబూప్రొఫెన్ వంటివి అధికంగా వాడితే కడుపులో నొప్పి, చెవిలో శబ్దాలు, మత్తుగా ఉండడం, గుండెల్లో మంట, మలబద్దకం, పేగుల్లో అల్సర్ వంటి వస్తాయి. అజిత్రోమైసిన్ మాత్రలు అధికంగా వినియోగిస్తే విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి, కొన్నిసార్లు మూత్రపిండాలు కూడా చెడిపోవచ్చు. మద్యపానం అలవాటు ఉన్నవాళ్లు, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవాళ్లు, గర్భిణులు వైద్యుల సూచనలు లేకుండా మందులు వాడితే దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయని సంజయ్ రెడ్డి వివరించారు. లక్షణాలు కనిపిస్తే టెస్టులకు వెళ్లడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగి పొందొచ్చునన్నారు.

Advertisement

Next Story