గణపతి బప్పా.. ఇంకా డిసైడ్ కాలేదప్పా

by Shyam |   ( Updated:2020-08-13 23:20:12.0  )
గణపతి బప్పా.. ఇంకా డిసైడ్ కాలేదప్పా
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నవరాత్రి ఉత్సవాలపై స్తబ్ధత. ఘననాథుడి వేడుకల నిర్వహణపై వీడని ఉత్కంఠ. చవితికి మరో వారం రోజులే గడువు ఉండగా.. కరోనా కాలంలో నవరాత్రులను ఎలా జరుపుకోవాలనే నిబంధనలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. దీంతో మండపాల నిర్వాహకులు, ప్రజలు వేడుకలు ఎలా జరుపుకోవాలనే సందిగ్ధంలో ఉన్నారు. గణపతి నవరాత్రులు వస్తున్నాయంటే పది రోజుల ముందే నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. బస్తీల్లో అడుగడుగునా ఎత్తైన మండపాలు.. ఆకర్షించే డిజైన్లు.., జిగేల్​మనే రంగురంగుల విద్యుత్ దీపాలతో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ వేడుకల నిర్వహణపై ఎలాంటి సూచనలు, మండపాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం లేదు. మండపాలు ఉంటాయా..? ఒకవేళా ఉంటే ఎన్ని అడుగుల ఎత్తు ఉండే ప్రతిమలను ప్రతిష్టించాలనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి.

నవరాత్రులు మొదలైన నాటి

నుంచి ముగిసే వరకూ మండపాల వద్ద సమీపంలో నివాసముండే భక్తులు పూజలు నిర్వహించే వారు. అంతేకాకుండా మండపాల వద్ద అన్న ప్రసాదాల వితరణ , వీఐపీల ప్రత్యేక పూజలు కొనసాగేవి. అయితే ఈ ఏడాది కరోనా పుణ్యమా అని పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. పండుగ నిర్వహణపై మండపాల ఏర్పాటు పై పోలీసు, జీహెచ్ఎంసీ విభాగాల అధికారులు ఆచితూచి నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. పండుగకు మరో వారం రోజులే గడువు ఉండగా
నవరాత్రుల కోసం బస్తీల్లో ఏర్పాటు చేసే విగ్రహాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

బస్తీల్లో తగ్గిన సందడి..

వినాయక చవితి సందర్భంగా బస్తీలు, కాలనీల్లో విగ్రహాల ఏర్పాటు కోసం పక్షం రోజుల ముందు నుంచే సందడి కనిపించేది. మండపాల నిర్మాణం, విగ్రహాల ఏర్పాటు కోసం కమిటీలు స్థానికుల నుంచి చందాలు వసూలు చేసేవారు. ఇప్పుడదీ కన్పించడం లేదు. కరోనా నేపథ్యంలో నగరంలో మండపాలకు అధికారులు ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో నవరాత్రుల నిర్వహణ విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతుండగా.. బస్తీల్లో సందడి తగ్గింది.

బస్తీకి ఒక్కటే..!

వినాయక చవితి నవరాత్రోత్సవాల్లో భాగంగా బస్తీ, గ్రామంలో నాలుగు అడుగులకు మించకుండా ఒక్క వినాయక ప్రతిమకు మాత్రమే అనుమతినివ్వాలని పోలీసు శాఖ యోచిస్తోంది. కేవలం మట్టి వినాయకులనే ప్రతిష్ఠంచేలా చూడడమే కాకుండా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు రోజుల్లో నిమజ్జనం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఒకవేళ ఎవరైనా పోలీసు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మండపాల వద్ద డీజేలతో సహా ఇతర సౌండ్ సిస్టం ఏర్పాటు, విగ్రహాల వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచడంపై నిషేధం విధించాలని యోచిస్తున్నారు. అన్ని షరతులకు లోబడి తేనే మండపాల వద్ద విగ్రహాలకు అనుమతులివ్వాలని, నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్లడం వంటివి నిషేధించాలని పోలీసు శాఖ భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఏడాది గణేశ్​ ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

62 పోలీస్ స్టేషన్లు.. 32 వేల మండపాలు..

నగరంలోని 62 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అనుమతితో గతేడాది సుమారు 32 వేల వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో వినాయక చవితి మండపాలకు అనుమతులు నేటి వరకూ ఇవ్వక పోగా.., ఇస్తారా ? లేదా ? అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది మండపాల నిర్వాహకులు, యువజన సంఘాల ప్రతినిధులు పోలీస్ స్టేషన్లకు నేరుగా వెళ్లడమే కాకుండా ఫోన్ల ద్వారా వినాయక మండపాల అనుమతులు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకుంటున్నారు. కాగా ఈ విషయం నేటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

Advertisement

Next Story