KTR మాటకే విలువ లేదా.. ప్రోటోకాల్ బ్రేక్ చేసిన బల్దియా కమిషనర్..

by Shyam |   ( Updated:2021-07-01 07:29:12.0  )
GHMC-Commissioner
X

దిశ, సిటీ బ్యూరో : అసలే వర్షాకాలం అప్రమత్తంగా ఉంటూ, అందరు కలిసిమెలిసి చక్కటి సమన్వయంతో ముందుకెళ్లాలని సాక్ష్యాత్తు మున్సిపల్ మంత్రి కేటీఆర్.. బల్దియా పాలక మండలి, అధికారులను ఆదేశించారు. ఇలా ఆదేశించి పక్షం రోజులు కూడా గడవకముందే బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు. నగరంలోని కోటి 20 లక్షల పై చిలుకు జనాభాకు ప్రథమ పౌరురాలైన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కార్యక్రమానికి హాజరుకాకుండా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమానికి హాజరుకావటం గ్రేటర్‌లో చర్చనీయాంశంగా మారింది.

నగరంలో పది రోజుల పాటు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మేయర్ గురువారం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రావాల్సిన కమిషనర్ లోకేశ్ కుమార్ హాజరు కాలేదు. అయితే, ఈ కార్యక్రమం ముగిసిన అర్ధ గంట తర్వాత పంజాగుట్ట దుర్గానగర్‌లో జరిగిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమానికి కమిషనర్ లోకేశ్ కుమార్ హాజరుకావటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. బంజారాహిల్స్‌లో మేయర్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడ కార్యక్రమాన్ని ముగించుకుని దుర్గానగర్ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు.

కానీ, కమిషనర్ లోకేశ్ కుమార్.. మేయర్ కార్యక్రమానికి హాజరు కాకపోవటం చర్చనీయాంశమైంది. నగరంలో ఏ కార్యక్రమం జరిగినా, వాటికి మంత్రులు హాజరైనా, ప్రోటోకాల్ ప్రకారం అందరి కన్నా ఎక్కువ గౌరవం మేయర్‌కే దక్కుతుంది. జీహెచ్ఎంసీలోనూ మొదటి గౌరవప్రదమైన పదవి మేయర్ కాగా, రెండో గౌరవప్రదమైన డిప్యూటీ మేయర్ తర్వాత అతి ముఖ్యమైన, గౌరవప్రదమైన పదవి కమిషనర్‌దే. అధికార యంత్రాంగం మొత్తానికి బాస్ అయిన కమిషనర్.. మేయర్ కార్యక్రమ ప్రోటోకాల్‌ను పాటించకపోవడంలో ఆయన ఆంతర్యమేమిటోనని కొందరు అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతితో పాటు అమెరికా అధ్యక్షుడు నగరానికొచ్చినా, అతిథులను సగౌరవంగా స్వాగతించే మర్యాదపూర్వకమైన మేయర్ హోదాను కమిషనర్ అగౌరవపరిచారన్న చర్చలు కూడా లేకపోలేదు. ఒక వైపు ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి అధికారులంతా సమన్వయంతో వ్యవహారించాలని పదే పదే చెబుతున్నా, అధికారుల తీరు మారటం లేదనేందుకు ఈ ఘటన ఓ చక్కటి ఉదాహారణ. నగరంలోని నాలా పూడికతీత, విస్తరణ పనులను స్వయంగా మేయర్, కమిషనర్లు కలిసి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని కొద్ది రోజుల క్రితం వర్షాకాల ప్రణాళికపై ప్రగతి భవన్‌లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశించినా, వీరిద్దరూ ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో ఏ ఒక్క పనిని కూడా పరిశీలించకపోవడం గమనార్హం.

Advertisement

Next Story