Google: గూగుల్‌కు భారీ షాక్..

by vinod kumar |   ( Updated:2021-07-13 07:55:28.0  )
google
X

దిశ, వెబ్‌డెస్క్ : గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. కాపీరైట్ చట్టం ఉల్లంఘన కేసులో ఫ్రాన్స్.. గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. ఐరోపా సమాఖ్య కాపీరైట్ చట్టం ఉల్లంఘన కేసులో ఫ్రాన్స్‌కు చెందిన కాంపిటిషన్ రెగ్యులేటర్ గూగుల్‌పై ఏకంగా 500 మిలియన్ యూరోల(దాదాపు రూ. 4451 కోట్లు) జరిమానా విధించింది. అయితే, కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ న్యాయపోరాటంలో తాజాగా ఫలితం మాత్రం గూగుల్‌కు వ్యతిరేకంగా వచ్చింది. అయితే, మీడియా కంపెనీలకు ఇచ్చే పరిహారంపై గూగుల్ నిజాయతీగా వ్యవహరించని కారణంగానే జరిమానా విధించినట్టు కాంపిటీషన్ రెగ్యులేటర్ ఈ సందర్భంగా వెల్లడించింది. తాము ఇప్పటివరకూ విధించిన జరిమానాల్లో ఇదే అత్యధికమని కూడా వ్యాఖ్యానించింది. పలు సంస్థల వార్తలను వినియోగించుకున్న కారణంగా మీడియా సంస్థలకు ఎంత మొత్తం ఇవ్వాలనే దానిపై ఓ ప్రతిపాదన ఇవ్వాలని కాంపిటీషన్ రెగ్యులేటర్ కోరింది. ఒకవేళ అలా జరగని పక్షంలో అదనపు జరిమానాగా రోజుకు 900,000 యూరోలు చెల్లించాలని కూడా స్పష్టం చేసింది.

కాగా.. ఈ ఆదేశాలపై గూగుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘మీడియా సంస్థలతో చర్చల సందర్భంగా మేం అత్యంత నిజాయితీతో వ్యవహరించాం. గూగుల్‌లో వార్తల వినియోగానికి సంబంధించిన వాస్తవ పరిస్థితి, చర్చల సందర్భంగా తాము ప్రదర్శించిన నిబద్ధతకు ఈ తీర్పు తగినది కాదు’’ అని గూగుల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇక, తమకు తగినంత పరిహారం చెల్లించకుండానే గూగుల్ తన సెర్చ్ రిజల్ట్స్‌లో వార్తలను చూపెడుతోందని పలు మీడియా సంస్థలు ఆరోపించాయి. ఈ కారణంగా గూగుల్ సంస్థకు లాభం చేకూరుతున్నా.. తమకు మాత్రం తీవ్ర నష్టం జరుగుతుందని మీడియా సంస్థలు గతంలో ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటరీ సంస్థను ఆశ్రయించాయి. యాడ్లపై వచ్చే ఆదాయంలో అధిక భాగం గూగుల్‌కు వెళుతుండగా తాము నష్టపోతున్నామని పేర్కొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed