- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వేళ… ఫౌండేషన్లు ఇలా!
దిశ, ఆదిలాబాద్: కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని ఊదరగొట్టే ప్రజాప్రతినిధులే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. కరోనాను అరికట్టడం కోసం తమవంతు సహాయం అందిస్తామంటూ ముందుకు వస్తున్న ప్రజాప్రతినిధులు ఫౌండేషన్ల పేరుతో జనాకర్షక కార్యక్రమాలను చేపడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా విస్తరిస్తున్న ఈ సమయంలో జనాలను పోగు చేయడం, ఒక దగ్గరికి ప్రజలను పిలిపించి కార్యక్రమాలు నిర్వహించడం ప్రమాదకరమైనదని తెలిసినప్పటికీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు మాత్రం సహాయం కన్న ఎక్కువగా… తమ పేరు ప్రఖ్యాతుల కోసమే కరోనా సహాయక కార్యక్రమాలను చేపడుతున్నారన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో అధికారపార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఫౌండేషన్‌ల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యవహారం చర్చనీయాంశం అవుతోన్నది.
ఎక్కడెక్కడంటే…
సిర్పూర్ నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యుడు కోనేరు కోనప్ప తన సోదరులతో కలిసి కరోనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగు రామన్న తనయులు ప్రేమేందర్, మహేందర్ జోగు ఫౌండేషన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తనయుడు గౌతమ్‌రెడ్డి ఇక్కడ ఐ.కె.ఆర్ ఫౌండేషన్ పేరుతో కార్యక్రమాలను చేపడుతున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖానాయక్ అనుచరులు ఏఆర్ఎస్ ఫౌండేషన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు తనయుడు విజిత్ రావు కూడా ఫౌండేషన్ పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారని అభిప్రాయాలున్నాయి.
సామాజిక దూరం ఎలా సాధ్యం?
ప్రస్తుతం కరోనా సమయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పౌండేషన్‌ల పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ వర్గాలకు, వలస కూలీలకు ఆహార పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ, కూరగాయల పంపిణీ చేస్తున్నారు. అలాగే శానిటైజర్లు, మాస్క్ లు అందజేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో జనం పెద్దఎత్తున గుమి గూడుతున్నారు. ఈ కార్యక్రమాలలో అనేక చోట్ల సామాజిక దూరం పాటించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు వెళ్తున్నారంటే ఆ కార్యక్రమాలకు లబ్ధి పొందే సామాన్య ప్రజలతోపాటు అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు కూడా భారీగానే హాజరవుతున్నారు. దీంతో ఈ కార్యక్రమాలు సామాజిక దూరాన్ని దూరం చేస్తున్నాయి. నేతలకు పేరు తెచ్చే కార్యక్రమాలుగా మారిపోతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్ కు ఇవ్వొచ్చు కదా?
జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (విపత్తుల నివారణ) అమలవుతున్నది. దాతలు నగదుతో పాటు ఏదైనా సహాయం చేయగలిగితే నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వాలి. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను బట్టి కలెక్టర్ నేతృత్వంలో అధికార యంత్రాంగం పేదల సమస్యలను, కరోనా నివారణకు పనిచేస్తున్న ఉద్యోగులకు అందజేసే వస్తువులను పంపిణీ చేసే చర్యలు తీసుకుంటుంది. కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది అమలుకావడం లేదు. ఎక్కడికక్కడా ప్రజాప్రతినిధులు వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కరోనా ప్రభావం సమయంలో ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెద్దలు పెద్ద మనసుతో సాయం చేస్తే కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఆ ప్రముఖుల పేర్లను ప్రకటిస్తారు కదా..!
Tags: Adilabad, Foundations, Collector, Coronavirus, MLAs