దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పరుడు కేసీఆర్ : మాజీ ఎంపీ వివేక్

by Sridhar Babu |
Former MP Vivek
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ తుగ్లక్ అని, కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో ఈటల గెలిస్తే లాభమేంటి అంటున్న టీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని వారంతా ఏం పొడుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే అమలు చేయలేని హామీలు ఇచ్చి ఆ తర్వాత మర్చిపోతారని ఎద్దేవా చేశారు. అవినీతి చేయడం, అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తర్వాతనే ఎవరైనా అని విమర్శించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావంతోనే కేసీఆర్ ఫాంహౌజ్‌ను వీడి జనాల్లోకి వస్తున్నారని వెల్లడించారు. హుజురాబాద్‌లో ఈటల రాజీనామాతోనే దళిత అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారని, మొట్ట మొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నోట జై భీం అనే నినాదం రావడానికి కూడా ఈటల రాజేందరే కారణం అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తే ఏనాడో వారు అభివృద్ధి చెందేవారని, ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుమీద దోచుకున్న కమీషన్లు అన్నీ ప్రజలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో దాదాపు రూ. 55 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వివేక్ సంచలన ఆరోపణ చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ధనికులుగా మారింది కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే అని తెలిపారు. కేసీఆర్‌కు పెరిగిన అహంకారాన్ని దించాల్సిన అవసరం ఉందని, ఆర్టీసీలో 42 మంది కార్మికులు మరణించిన తర్వాత స్పందించిన దుర్మార్గుడు అని మండిపడ్డారు. ఇచ్చిన హామీ ప్రకారం.. వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా… 60 వేల మంది సింగరేణి ఉద్యోగులు ఉంటే.. ఇప్పుడు 40 వేలకు తగ్గించారని అన్నారు. నిజాం షుగర్స్ పరిశ్రమను వందరోజుల్లో రీ ఓపెన్ చేస్తా అన్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ప్రారంభించలేదని విమర్శించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు PRC ఇస్తానని ప్రకటించి, ఆ తర్వాత ఆ ఊసేత్తడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఇస్తానన్న 50 వేల ఉద్యోగాలు ఎక్కడకెళ్లాయని ప్రశ్నించారు. ప్రతిష్టాత్మకంగా వేలకోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క టీఎంసీ నీరు కూడా ఇవ్వలేదని, వెంటనే కాళేశ్వరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నిక అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. ఈ కారణంగానే రెండు వేల కోట్లతో ‘దళితబంధు’ అమలు చేస్తున్నారని అన్నారు. మోత్కుపల్లి దీక్ష ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని, ‘దళితబంధు’ తెలంగాణ అంతా ఇవ్వాలని దీక్ష చేయాలని రవిందర్ రెడ్డి సూచించారు. మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలంటే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని, కాంట్రాక్టర్, కేసీఆర్ కూర్చొని ఇంజినీర్లు లేకుండా తయారు చేసిన ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రానికి డీపీఆర్ ఇవ్వలేకపోతున్నారన్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీరు ఇవ్వలేదని, కాళేశ్వరం అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story