అదంతా అబద్ధం.. మాజీ ఎమ్మెల్యే సంపత్ క్షమాపణలు చెప్పాలి

by Shyam |
అదంతా అబద్ధం.. మాజీ ఎమ్మెల్యే సంపత్ క్షమాపణలు చెప్పాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. దురుద్దేశపూరితంగా ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమర్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాసారు. క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో అధారాల్లేని ఆరోపణలు చేస్తుంటే ఖండించక పోవడం విచారకరమన్నారు. తన సొంత మండలం పాన్ గల్ మండలకేంద్రం సమీపంలో ఉన్న భూములు తాను, తన సతీమణి పేరు మీద ఉన్న వివరాలు 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనడం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. 30 ఎకరాలు తన పేరుపై, 10 ఎకరాలు తన సతీమణి పేరు పై ఉందని 15 ఏళ్లుగా అందులో మామిడితోట ఉందని స్థానికంగా వివరించారు.

వృత్తిరీత్యా డాక్టరైన తన కూతురు అక్కడి నుండి ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందించేందుకు సొంత నిధులు,బ్యాంక్ రుణాల ద్వారా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. రెండేళ్ల క్రితం స్వచ్చందంగా గోశాలను నిర్వహించేందుకు 2.5 ఎకరాలు కొత్తగా కొనడం జరిగిందని చెప్పారు. చండూరు గ్రామంలో ఉన్న 10 ఎకరాల భూములతో సహా మొత్తం 50 ఎకరాల లోపే తనకు భూమి ఉందని చెప్పుకొచ్చారు, తనకు 200 ఎకరాల భూమి ఉందని ఆరోపించడం తన ప్రతిష్టకు భంగం కలిగించడమేనని తెలిపారు. వనపర్తి, పెబ్బేరు పట్టణాలలోని భూములపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఖండించారు. 1984 నుండి తాను వృత్తి రీత్యా న్యాయవాదినని ఈ భూములకు సంబంధించిన వ్యాజ్యాలలో 1990 దశకంలో తన క్లయింటు ఎస్. అజయ్ కుమార్ కుటుంబం తరపున వాదించడం జరిగిందని గుర్తు చేశారు. 2001 తర్వాత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నందున ఆ కేసుల తరపున వాదనను వదిలేయడం జరిగిందని తెలిపారు. ఆ తరువాత వచ్చిన న్యాయస్థాన ఉత్తర్వులు, తీర్పులతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆ భూములపై వివిధ ట్రిబ్యునల్ , ఇతర కోర్టులు నాటి తన క్లయింట్లకు వ్యతిరేకంగా 2005, 2013 లో తీర్పులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రావడం జరిగిందని చెప్పారు. అప్పటి ఆర్డీఓలు ఇచ్చిన తీర్పులు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభావితం చేసినట్లానని ప్రశ్నించారు. తన క్లయింటు అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా 2005, 2013 లలో ఇచ్చిన తీర్పులను, ఉత్తర్వులను హైకోర్టు సీసీఎల్ఎలో విచారించడం జరిగిందన్నారు.

ఇప్పటికీ హైకోర్టులో వివాదమున్నట్లు తెలిసిందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఉన్న రాజా రామేశ్వరరావు , వారసులు, వంశస్థులంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని చెప్పుకొచ్చారు. అలాంటిది ఈ భూములకు సంబంధించిన వివాదం తనకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. తన మీద ఆరోపణ చేయటానికి ప్రధాన కారణాలు తన ప్రతిష్టకు భంగం కలిగించడమే అన్నారు, ఈ భూముల మీద హక్కులు కోరుకుంటున్న రాజా వారి ట్రస్టుకు అనుకూలంగా మాట్లాడటం కోసమే ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వనపర్తి ఇనాం భూమి ముమ్మాటికీ పేద రైతులకు చెందిందని తన క్లయింటు ప్రత్యర్దులైన వారి దాయాదుల పక్షమే ప్రస్తుత ఉత్తర్వులున్నప్పుడు దీనిని తనకు ఎలా ఆపాదిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపణలు నిజమైన హక్కు దారులకు మేలు చేసేవి కావని గుర్తుచేశారు. ఈ భూమికి నిజమైన హక్కుదారులమని చెప్పుకుంటున్న వారు ప్రభుత్వానికి భూములను రిలింక్విషింగ్ డాక్యుమెంట్ ద్వారా అప్పగిస్తే ఆ భూమిని పేదలకోసం డబల్ బెడ్రూం ఇండ్లు కట్టించేందుకు లేదా ఇతర ప్రజా ప్రయోజన నిర్మాణాలు చేయించేందుకు సిద్దమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజా కృష్ణదేవరావు తరపున వకాల్తా పుచ్చుకున్న వారంతా భూములను ప్రభుత్వానికి అప్పగిస్తారాని ప్రశ్నించారు.

Advertisement

Next Story