కరోనాపై పోరులో పోలీసులకు కర్తవ్యమే ఫస్ట్..

by vinod kumar |   ( Updated:2020-04-06 00:14:09.0  )
కరోనాపై పోరులో పోలీసులకు కర్తవ్యమే ఫస్ట్..
X

దిశ, న్యూస్ బ్యూరో: అతడు లాఠీ విసిరితే, ఎంత కాఠిన్యం? అని అంటారు.. కానీ, ఖాకీ చొక్కా వెనక దాగిన కారుణ్యాన్ని ఎవరూ కనరు.. అతడు కటువుగా మాటంటే, ఈ ఖాకీకి కనికరం లేదంటారు..కానీ, జనానికేమైనా ఆపద వస్తే.. అతడో కరుణామయుడు!జనానికి కష్టమొస్తే, తన సుఖాన్ని పణంగా పెడతాడు!కరోనా.. ఎటు నుంచి ఎలా వచ్చి దొంగదొబ్బ కొడుతుందోనని సకల జనులనూ ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటున్నవేళ..అతడు మై హూనా.. అంటూ రాత్రనకాపగలనకా నడిరోడ్డు మీద కాపలాకాస్తున్నాడు.. కరోనా బారిన పడకుండా కంటికి రెప్పలా మారాడు..అతడికి దాహమేస్తే నీళ్లు లేవు.. ఆకలేస్తే వేళకు అన్నం దొరకదు.. ఎండలోనే విధులు.. ఎక్కడా నిలువనీడలేదు..తనకు ఈ మహమ్మారి ఎక్కడ సోకుతుందోనని కుటుంబం భయాందోళనతో గుడుపుతున్నా.. కర్తవ్య నిర్వహణనే ప్రాణప్రదంగా భావిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నాడు..పేరుకే రక్షకభటుడు, కానీ, అతడి బతుకుకే రక్షణ లేకుండా పోయింది.. కనిపించని ఆ నాలుగో సింహం కథ.. అతడి కన్నీటి వ్యథను ‘దిశ’ మీకు అందిస్తోంది.

‘‘ప్రజాసేవ చేద్దామంటే ప్రాణాలకు ముప్పు వచ్చె. కరోనా వైరస్ బారిన పడకుండా ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రజలందరూ ఇంటికే పరితమయ్యారు. మాకు మాత్రం డ్యూటీ తప్పడం లేదు. కరోనా మహమ్మారి మా ప్రాణాలు తీయడానికి వచ్చినట్లుంది. ఉద్యోగం చేస్తే కుటుంబానికి దూరమయ్యేటట్టున్నం.. చేయపోతే ఉద్యోగం ఊడేటట్టుంది. విధులకు రాక తప్పేటట్టులేదు. డ్యూటీ చేస్తే ఈ మాయదారి రోగం ఎక్కడా అంటుతుందో తెల్వదు. మా బతుకులు ‘కుడితిలో పడ్డ ఎలుకలా’ ఉన్నాయి. విధి నిర్వహణలో ఎవరోవరినో కలిశాను. ఎక్కడెక్కడో తిరిగాను, నాకు ఏమైనా వైరస్ సోకిందేమోనని అనుమానం వెంటాడుతోంది. ఇంటికి పోదామంటే కాలు కాదలటం లేదు. నా కుటుంబానికిది ఎక్కడ అంటుకుంటుందోనన్న భయం నన్ను ఆవహించింది. ఇంటికి వెళ్లినా పిల్లలను ముట్టికునే పరిస్థితి లేదు. ఇంటికి పోతే మా ఫ్యామీలి ఒక రోగిష్టిలా చూస్తోంది. ఇక కాలనీ వారైతే మేము ఇంటి నుంచి బయటికి వెళుతున్నామంటే తలుపులు పెట్టుకుంటున్నారు. అద్దె ఇంటి యజమానితో తలనొప్పిగా మారింది. ఏకంగా ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఇన్ని ఇబ్బందులకు తలొగ్గి విధులు నిర్వహిస్తున్నప్పటికీ విధినిర్వహణలో కడగండ్లు తప్పడం లేవు.

కరోనా వైరస్ విస్తరణను నియంత్రించేందుకు ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినా కొంతమంది ప్రజలు రోడ్లమీది వస్తున్నారు. ఎంత చెప్పినా వినిపించుకోరు. ఏదేదో కారణాలు చెప్పి రోడ్లు మీద తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారంటూ మమ్మల్నేమో పై అధికారులు చివాట్లు పెడుతున్నారు. ‘ముందు నొయ్యి వెనక గొయ్యి’ అన్న చందంగా మా పరిస్థితి దాపురించింది. మా ఆరోగ్యాలు పణంగా పెట్టి రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తుంటే మాకు ఇటు ప్రజలు సహకరించక.. అటు ప్రభుత్వం తోడ్పాటునివ్వక నానా అవస్థలు పడుతున్నాం. అందరిలాగ మాయి ప్రాణాలే.. మాకు వైరస్ సోకదా’’ అంటూ ‘కరోనా’ విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసన్న చెమ్మగిల్లిన కళ్లతో తన కష్టాలు చెప్పుకొచ్చాడు.

కరోనా వైరస్ (కొవిడ్ 19) రాష్ట్ర ప్రజలను భయందోళన గురిచేస్తున్నవేళ.. ఈ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి కంకణబద్ధులైన పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు సరిగా సహకరించక ఇరువర్గాల మధ్య కింది పోలీసులు నలిగిపోతున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను పట్టుకోవడలో పోలీసులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు పోలీసులపైనే కొందరు దాడులు చేస్తున్నారు కొందరు. క్వాంరటైన్ వద్ద డ్యూటీలో ఉన్న పోలీసులకు బెదిరింపులు తప్పడం లేవు. ‘లాక్‌డౌన్ నియమాలను అతిక్రమించి రోడ్ల మీదికి వస్తున్నవారిని అడ్డకుంటే ఒక బాధ, వదిలేస్తే మరో ఇబ్బంది. వదలక పోతే పలువురు ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఒత్తిడి చేయిస్తున్నారు. ఎవరికి ఏమీ సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి’ అని పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

రక్షణ లేని విధులు..

రాత్రనక.. పగలనక విధులు నిర్వహిస్తున్న పోలీసు ఉద్యోగులకు రక్షణ లేదు. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలంతా మాస్కులు, శానిటైజర్, గ్లౌసులతో వైరస్ తమ దరిని చేరకుండా చూసుకుంటున్నారు. కానీ, లాక్‌డౌన్ సందర్భంగా రోడ్ల మీద జనాలు తిరగకుండా బందోబస్తులో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రభుత్వం ఎలాంటి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విమెంట్స్ ఇవ్వడంలేదు. దీంతో వారి ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోయింది. లాక్‌డౌన్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా తమ తమ కుటుంబాలకు దూరంగా ఉండాల్సివస్తోంది. ‘మేము విధి నిర్వహణలో ఎవరోవరినో కలవాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో మాకు కూడా వైరస్ సోకవచ్చు. మా నుంచి మా కుటుంబాలకు రావద్దన్న ఉద్దేశంతో కుటుంబసభ్యులను మా ఊళ్లకు పంపించాం’ అని పలువురు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిలో వంట చేసేవారు లేక.. బయట డబ్బులు పెట్టి తిందామన్నా ఎక్కడా తిండి దొరకకా కడుపు మాడ్చుకొని ఉద్యోగం చేయాల్సి వస్తోందంటురు. రవాణా సౌకర్యం లేక పడుతూ, లేస్తూ స్వగ్రామాలకు వెళ్తున్న వలస కూలీల బతుకుల కంటే దీనమైంది తమ బతుకులంటూ వాపోతున్నారు. కూలీలకు దాతలు చేసే అన్నదానంలో తామూ కొంత తిని ఏపూటకాపూట సర్దుకుంటున్నామంటున్నారు.

రోడ్ల మీద ఎండకు తాళలేకపోతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రటి ఎండలో విధులు నిర్వహించాల్సి వస్తోందని, కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదని పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ రోగాని కంటే ముందు తమకు వడదెబ్బ కొట్టేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గుక్కెడు మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. ‘ఒక పూట అన్నం పెడతానన్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి’ అని కన్నీటి పర్యంతమయ్యారు. విధి నిర్వహణ ప్రాంతంలో తమకు టాయిలెట్స్ కూడా అందుబాటులో లేవు. ఎక్కడికైనా బయటికి పోతే అదే సమయంలో వచ్చిన పైఅధికారులతో చివాట్లు తప్పడం లేదు.

మహిళా పోలీసుల కష్టాలు వర్ణనాతీతం.

ముట్టుకుంటే అంటుకునే రోగంతో ప్రజలు వణికిపోతున్న సమయంలో మహిళా ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్యూటీ చేస్తున్నారు. తమ కుటుంబాన్ని దూరం చేసుకొని విధులు నిర్వహించాల్సి వస్తోందని వాపోతున్నారు. ‘‘డ్యూటీకి రావాలంటే కుటుంబంతో పోరు తప్పడంలేదు. ఎక్కడ వైరస్ తగిలించుకోని వస్తావోనని భయపడుతున్నారు. డ్యూటీ కోసం నా ఆరు నెలల బిడ్డకు పాలుకూడా పట్టించలేక పోతున్న. బిడ్డ బాగోగులు చూసుకునే భాగ్యం కూడా లేకుండా పోయింది. ఇన్ని ఇబ్బందులకు ఓర్చుకొని డ్యూటీ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహకారం అందించడం లేదు. అదనపు డ్యూటీలు వేసి ఎక్కువ సమయం పని చేయిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి మాస్కులు, శానిటైజర్, గ్లౌజులు కూడా తామే సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇవ్వడం లేదు. లాక్‌డౌన్ సందర్భంగా ఉదయం 7 గంటలకు డ్యూటీకి రావాలంటున్నారు. కానీ, కనీసం టీఫిన్ కూడా పెట్టడం లేరు. మంచినీళ్ల వసతి కూడా లేదు.ఎవరైనా దాతలు దయతలిచి ఇచ్చే నీళ్లతో దాహార్తి తీర్చుకుంటున్నాం. ఇంత చేసినా ప్రభుత్వం మాత్రం మా ఆరోగ్యం గురించి, మా కుటుంబాల గురించి పట్టించుకోవడం లేదు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మహిళా పోలీసు వ్యథ ఇది.

Tags: police, employees, lockdown, coronavirus,

Advertisement

Next Story

Most Viewed