‘యాసంగి’లో నియంత్రిత సాగుకు నో​

by Anukaran |
‘యాసంగి’లో నియంత్రిత సాగుకు నో​
X

దిశ, తెలంగాణ బ్యూరో : నియంత్రిత సాగు ఒక్క సీజన్​కే పరిమితమైంది. వానాకాలం నుంచి నియంత్రిత విధానంలోనే పంటలు వేయాలని సీఎం కేసీఆర్​ ప్రకటించిన విషయం తెలిసిందే. సన్నాల సాగు రైతులను నిండా ముంచింది. అమ్మకాలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉంది. మద్దతు ధర పెంపుపై ఎలాంటి నిర్ణయం రావడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యాన్ని తీసుకోవడం లేదు. అక్కడా ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. మిల్లర్లు ధాన్యాన్ని తీసుకుపోవడం లేదు. రైతుల దగ్గర నుంచి మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్లు ఆగిపోతాయంటూ భయపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యాసంగి సీజన్​ మొదలైంది. వానాకాలంలో మాదిరిగా అధికారులు, ప్రభుత్వం చెప్పే మాటలను రైతులు పట్టించుకోవడం లేదు. ఎప్పటిలాగానే దొడ్డు రకాల సాగుకు నారు మడులు సిద్ధం చేస్తున్నారు.

నట్టేట ముంచారంటూ…

నియంత్రిత సాగు సర్కారుకు సెగ పెడుతోంది. సన్న వడ్లు పండించమంటే రైతులు అగ్గి మండుతున్నారు. నట్టేట ముంచారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో 52.78 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తే, దానిలో 34.45 లక్షల ఎకరాలలో సన్నాలను సాగు చేశారు. 98.61 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్​ టన్నులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 6.45 లక్షల మెట్రిక్ టన్నులే.

ప్రస్తుతం సన్నధాన్యం మొత్తం రోడ్లపైనే ఉంది. కొనేవారు లేకపోవడం, మద్దతు ధర పెరుగుతుందనే ఆశతో ఇంకా కల్లాల్లోనే పెట్టుకున్నారు. సన్నధాన్యానికి మద్దతు ధర రూ.100 నుంచి రూ.150 వరకు పెంచుతామని జనగామ జిల్లా కొడకండ్లలో సీఎం కేసీఆర్ గత నెల 31న ప్రకటించారు. దీంతో చాలా మంది రైతులు ధాన్యం అమ్మకాలను వాయిదా వేసుకున్నారు. సన్నధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదు. ఎంతో కొంత కొనుగోలు చేసి ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు.

రూ. 1,650 ఇస్తాం

ప్రభుత్వం నుంచి మద్దతు ధర పెంపుపై నిర్ణయం రాకపోవడంతో రైతుల దగ్గర నుంచి వడ్లను నేరుగా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, మిల్లర్లు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ధరకు అమ్మాలని ఒత్తిడి తెస్తున్నారు. వారం రోజులు దాటితో అసలే కొనబోమంటూ బెదిరిస్తున్నారు. వారు క్వింటాలుకు పెడుతున్న ధర రూ. 1650 మాత్రమే. అంతకు మించి రూపాయి ఎక్కువ ఇవ్వడం లేదు. అందుకే యాసంగిలో సన్నాల సాగును రైతులు వదిలేస్తున్నారు. నవంబర్​15 తర్వాత రైతులు నారు మడులు సిద్ధం చేస్తారు. ప్రస్తుతం 80 శాతం దొడ్డ రకాలనే వేశారు.

నియంత్రిత సాగు విధానం అని అంటే చాలు వ్యవసాయాధికారులపై విరుచుకుపడుతున్నారు. సన్నాల సాగు దిగుబడి తక్కువ ఉండగా, పెట్టుబడి ఎకరానికి రూ. ఐదు వేల నుంచి రూ. ఏడు వేల వరకు అయ్యింది. సన్నాల సాగు విషయంలో రైతులు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రభుత్వం కూడా గుర్తించిందని చెప్పుతున్నారు. యాసంగిలో నియంత్రిత సాగు విధానంలో వేయాల్సిన పంటలపై ప్రభుత్వం ప్రణాళిక రూపొందించలేదు. వ్యవసాయ శాఖ కూడా జిల్లాలవారీగా యాసంగి నియంత్రిత సాగు ప్రణాళిక ప్రకటించలేదు. దీంతో రైతులు దొడ్డు రకం వడ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

అవకాశం ఉన్నా…

రాష్ట్రంలో మద్దతు ధర పెంచుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఇది ఏండ్ల నుంచి ఉన్న ఒప్పందమే. కేంద్రం ప్రకటించే మద్దతు ధర కంటె ఎక్కువ చెల్లించుకునే అంశాన్ని రాష్ట్రాల ఇష్టానికే వదిలేశారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మద్దతు ధరపై ఎంతైనా ఎక్కువ ఇవ్వవచ్చు. 2008, 2009, 2011, 2012లో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం మద్దతు ధర కంటే రూ.50 నుంచి రూ.200 వరకు ఎక్కువ చెల్లించింది. ఇప్పుడు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రకటించి వదిలేశారు. ఇది రైతుల నుంచి ఆగ్రమానికి కారణమవుతోంది. ప్రభుత్వంపై భారం పడుతుందనే మద్దతు ధర పెంపును ప్రకటిండం లేదంటున్నారు.

Advertisement

Next Story