IRCTC: ప్రైవేట్ రైళ్ల ఆలస్యానికి పరిహారం చెల్లించే పథకాన్ని నిలిపేసిన ఐఆర్‌సీటీసీ

by S Gopi |
IRCTC: ప్రైవేట్ రైళ్ల ఆలస్యానికి పరిహారం చెల్లించే పథకాన్ని నిలిపేసిన ఐఆర్‌సీటీసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రైవేట్ రైళ్ల ఆలస్యంపై ప్రయాణికులకు పరిహారం పథకాన్ని నిలిపేసినట్టు ఐఆర్‌సీటీసీ తెలిపింది. సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) ద్వారా వార్తా సంస్థ పీటీఐ దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానం ఇచ్చిన ఐఆర్‌సీటీసీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రస్తుతం టిక్కెట్ బుకింగ్‌తో పాటు ప్రైవేట్ రైళ్లను కూడా నిర్వహిస్తోంది. ప్రైవేట్ రైళ్లు ఆలస్యంగా వస్తే అందుకుగానూ ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తుంది. ఐఆర్‌సీటీసీ ప్రకారం, ఈ పథకం కింద 2019, అక్టోబర్ 4 నుంచి 2024, ఫిబ్రవరి 16 ప్రయాణీకులకు రూ.26 లక్షలు పరిహారంగా చెల్లించారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే రూ.15.65 లక్షల పరిహారం అందించినట్లు సమాచారం. అయితే, ప్రైవేట్ రైళ్లు ఆలస్యంగా నడవకుండా పరిహారం అందించే ఈ పథకాన్ని 2025, ఫిబ్రవరి 15 నుంచి నిలిపేసినట్టు ఐఆర్‌సీటీసీ పేర్కొంది. దీనికి గల కారణాలు గోప్యమని వెల్లడించేందుకు నిరాకరించింది. ఆర్‌టీఐ ప్రకారం.. 2019-20లో రూ.1.78 లక్షలు, 2020-21లో సున్నా, 2021-22లో రూ.96,000, 2022-23లో రూ.7.74 లక్షలు, 2023-24లో రూ.15.65 లక్షలు ప్రయాణికులకు అందించినట్లు కార్పొరేషన్ తెలిపింది. రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు ఎంత పరిహారం అందుతుందన్న ప్రశ్నకు 60 నుంచి 120 నిమిషాల ఆలస్యానికి రూ.100, 120 నుంచి 240 నిమిషాల ఆలస్యమైతే రూ.250 పరిహారంగా అందజేశామని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed