ఫార్మా సిటీ.. పరిహారం పిటీ !

by Shyam |   ( Updated:2020-03-15 05:49:21.0  )
ఫార్మా సిటీ.. పరిహారం పిటీ !
X

దిశ, రంగారెడ్డి:
పచ్చటి పొలాలు.. ఎత్తైన కొండలు.. జంతు జీవరాశి, వ్యవసాయ పంటలకు అనువైన భూములను ప్రభుత్వం ముచ్చర్ల ఫార్మా సిటీకి అప్పగిస్తోంది. అయితే ఎన్నో ఏండ్లుగా తమకు జీవనాధారంగా ఉన్న ఈ భూమిని కోల్పోతే.. మరో దగ్గర కొనుక్కునే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫార్మా సిటీ రాకతో అక్కడి వాతావరణం విషతుల్యమవుతుందని ఆలస్యంగా గమనించిన గ్రామ ప్రజలు, రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫార్మా సిటీకి తెలంగాణ సర్కార్‌ 19330 ఎకరాల భూమిని కేటాయించింది. వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములున్నాయి. జిల్లాలోని కడ్తాల్‌, కందుకూర్‌, యాచారం మండలాల పరిధిలోని 12 గ్రామాల్లో ప్రభుత్వం వ్యవసాయ భూమిని సేకరిస్తోంది. మొదట ప్రభుత్వ భూమిని మాత్రమే తీసుకుంటామని, పట్టా భూములను తీసుకునే ప్రసక్తే లేదని అప్పటి స్థానిక ఎమ్మెల్యేలు రైతులకు, ప్రజలకు వివరించారు. ఇప్పుడు పట్టా భూములు కూడా తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ‘2015-16 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నాం, భూ సేకరణకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. అందుకు కందుకూర్‌, కడ్తాల్ మండలాల పరిధిలోని రైతులు సైతం ఒప్పుకున్నారు. కానీ యాచారం మండల పరిధిలోని 4 గ్రామాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకించారు.’ ఈ గ్రామాల్లోని రైతుల ప్రతిఘటన ప్రస్తుతం కందుకూర్‌, కడ్తాల్‌ మండలాల్లోని గ్రామాలకూ విస్తరించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణహిత ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని స్థానికులను నమ్మించింది. ఇందుకు మొదట నిరాకరించిన రైతులు.. ఆ తర్వాత అసైన్డ్‌ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు ఒప్పుకుంటే పరిహారం ఇస్తారు, లేకపోతే భూమి పోతుంది, నష్టపరిహారం రాదని అధికార పార్టీ నాయకులు చెప్పడంతో రైతులు గత్యంతరం లేక అందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు వారు తిరిగి ఆలోచనలో పడటంతో ఫార్మాసిటీ భూసేకరణకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే ప్రభుత్వం దళారులను రంగంలోకి దించి, రైతులను భూసేకరణకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం.

భూసేకరణ చట్టానికి తూట్లు..

2013 భూసేకరణ చట్టం ప్రకారం అసైన్డ్‌, ప్రైవేట్‌ భూమికి తేడా లేకుండా నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా ప్రభుత్వ నిర్దేశించిన ధరలకు మూడు రెట్లు అధికంగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఫార్మా సిటీ కోసం భూసేకరణ చేస్తోంది. అసైన్డ్‌ భూమికి రూ.7.50 లక్షలు, పట్టా భూములకు రూ.12 లక్షల చొప్పున కేటాయించింది. కందుకూర్‌, కడ్తాల్, యాచారం ప్రాంతాల్లో భూములు ధరలు సాధారణంగానే అధికంగా ఉంటాయి. ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో భూమి విలువ సుమారుగా ఎకరానికి రూ.20 లక్షలకు పైమాటే. అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన భూ విలువ కంటే నష్టపరిహారం తక్కువగా చెల్లించి రైతులను మోసం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు అధికారులపై తిరుగుబాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఫార్మా కంపెనీలు విస్తరించిన తర్వాత వచ్చే దుర్వాసనతో ఇండ్లు వదిలిపెట్టిపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమికి భూమి ఇవ్వకపోవగా, ఇచ్చే నష్టపరిహారమూ అరకొరగా ఉండటంతో పేద రైతుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.

నష్టపరిహారం చెల్లింపుల్లోనూ మోసాలే..!

మేడిపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల బుచ్చయ్య కుటుంబానికి చెందిన 30 మంది తమకున్న 20 ఎకరాల అసైన్డ్ భూములను ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భూమిని ఫార్మా సిటీకి అప్పగించాలని, లేకపోతే భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఒప్పుకున్న రైతులకు 4 ఎకరాలకే నష్టపరిహారం చెల్లించారు. ఈ పరిహారంతో 30 మందికి న్యాయం జరుగుతుందా..! తాడిపర్తి గ్రామానికి చెందిన పొలెమోని శ్రీరాములు 5 ఎకరాల అసైన్డ్‌ భూమిలో సాగు చేసుకుంటుండగా.. అతనికి 3 ఎకరాలకే పరిహారం ఇచ్చారు. నానాక్‌నగర్‌ గ్రామానికి చెందిన కట్టెల రాములుకు.. ఎకరం భూమికి గాను 20 గుంటలకే పరిహారం అందింది. ఇవి మచ్చుకు మాత్రమే, ఇలాంటి ఘటనలు అనేకం.

యాచారంలో ఇదీ పరిస్థితి!

శ్రీశైలం- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఉన్న కందుకూర్‌ నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు ఫార్మాసిటీ కోసం రోడ్లు వేస్తున్నారు. ఇందుకోసం తొలుత తాడిపర్తి గ్రామంలో రెవెన్యూ అధికారులు భూసేకరణకు దిగడంతో రైతులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. తాడిపర్తిలోని 104 సర్వే నంబర్‌లో 504 ఎకరాల 16 గుంటల భూమి ఉందని గ్రామస్తులు వాదిస్తున్నారు. ఈ సర్వే నెంబర్‌లో భూములున్న రైతులంతా నేడు నగరంలో వ్యాపారులు, రియల్టర్లుగా ఉన్నారు. ఇక్కడ రెవెన్యూ అధికారులు 504 ఎకరాలకు పట్టా పాస్‌ పుస్తకాలు ఇచ్చినట్లు తెలిసింది. కుర్మిద్దలోని 274, 275, 281, 284 సర్వే నెంబర్లలోని 54 ఎకరాల 28 గుంటలు భూమిలో ఇటు ఫార్మాసిటీకి, అటు ప్రజల రాకపోకలకు వాలుగా ప్రధాన జంక్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. 170, 171, 168, 101, 93, 94 సర్వే నెంబర్లలో 9 ఎకరాలు, నానక్‌ నగర్‌లోని 41, 49, 38, 39, 60, 61, 58, 62, 57, 56, 53, 54 సర్వే నెంబర్లలో 23 ఎకరాల మూడు గుంటల భూమిలో 60 ఫీట్ల వెడల్పు గల రోడ్డు వేయడం కోసం అధికారులు భూసేకరణ చేస్తున్నారు. నానక్‌ నగర్‌లోని 32 నుంచి 42, 44 నుంచి 47, 49 నుంచి 51, 53 సర్వే నెంబర్లలో 259 ఎకరాల 20 గుంటల భూమిని ఫార్మా సిటీ కోసం తీసుకునేందుకు ఇబ్రహీంపట్నం ఆర్డీవో 1,536 సర్క్యులర్‌.. జిల్లా కలెక్టర్‌ ఎల్‌ఆర్‌ నెంబర్‌ జీ1/88/217 మేరకు భూసేకరణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భూములు కోల్పోతున్న రైతులకు సెక్షన్‌30(ఏ) తెలంగాణ అమెండమెంట్‌ యాక్ట్‌ ఎల్‌ఏ 21 ఆఫ్‌ 2017 మేరకు పరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు సర్క్యులర్‌ జారీ చేశారు. దీనిని ఆయా పంచాయతీ కార్యాలయాల్లో నోటీస్‌ బోర్డుపై కూడా పెట్టలేదని పలువురు సర్పంచ్‌లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

Tags: Pharma City, Farmers lands, Patta lands, Compensation, Assigned lands

Advertisement

Next Story

Most Viewed