షాకింగ్: మావోయిస్టుల డంప్ కోసం తవ్వకాలు..?

by Anukaran |
Maoist dump
X

దిశ, కొత్తగూడ : అడవుల్లో మావోయిస్టుల డంప్ కోసం తవ్వకాలు జరుగుతున్నట్లు కొత్తగూడ, గంగారం మండల వ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి డంప్ వెలికితీసే పనికి పూనుకున్నట్లు కొద్ది రోజులుగా జనాల్లో చర్చ మొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం… గంగారం మండలంలోని కోమట్లగూడెం శివారులోని అటవీ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలకు పాల్పడినట్టు ఆనవాళ్లు కనపడ్డాయి. వీటి ఆధారంగా మండల వ్యాప్తంగా భిన్న కథనాలు మొదలయ్యాయి.

మావోయిస్టు దళాలు దాచిపెట్టిన డంప్ కోసం, విషయం తెలిసిన కొందరు వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడుతున్నారన్న వాదన తెరపైకి వస్తోంది. మరో వైపు అడవిలో గుప్త నిధులున్నాయని వాటిని చేజిక్కించుకోవడానికి ఈ తవ్వకాలు మొదలయ్యాయని మరి కొందరు కొత్త ఊహాగానాలకు తెరలేపారు. కోమట్లగూడెం అటవీ క్షేత్రంలో లభ్యమైన ఆధారాలను బట్టి మావోయిస్టు పార్టీలో పని చేసి లొంగిపోయిన మాజీలు ఈ తవ్వకాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, మావోయిస్టు అగ్రనేత హరిభూషన్ మృతి అనంతరం ఈ డంప్ వేట మొదలైందని మరి కొందరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

-చంద్ర మోహన్, గంగారం ఎస్సై
గంగారం మండలంలోని కోమట్లగూడెం అడవిలో డంప్ కోసం తవ్వకాలు జరుగుతున్నాయని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. అక్కడ ఎటువంటి డంప్‌లు లేవు. మండల వ్యాప్తంగా ప్రచారం అంత కల్పితం. ఈ ఘటనపై విచారణ చేపడతాం.

Next Story

Most Viewed