మాలో ప్రవహించేది సీమ రక్తమే.. వైసీపీకి చుక్కలు చూపిస్తాం: పరిటాల సునీత

by srinivas |   ( Updated:2021-10-22 02:52:41.0  )
Paritala-Sunitha-1
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పరిటాల సునీత చాలా సౌమ్యంగా ఉంటారు. రాజకీయాల్లో చాలా ఆచితూచిగా మాట్లాడుతూ ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యలకు ఆమె చాలా దూరంగా ఉంటూ వచ్చారు. మంత్రిగా ఉన్న సమయంలో కూడా చాలా సింపుల్‌గా, హుందాతనంగా వ్యవహరించేవారు. అలాంటి పరిటాల సునీత ఒక్కసారిగా తన ఉగ్రరూపాన్ని చూపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒక గంట కళ్లు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం అంటూ పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాలో ప్రవహించేది సీమ రక్తమే అన్న ఆమె తన భర్తను చంపినప్పుడు కూడా చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామన్నారు. ఇక ఇప్పటికైనా చంద్రబాబు మీరు మారాలి అంటూ పరిటాల సునీత సూచించారు.

ఇన్నాళ్లూ ఓపిగ్గా ఉన్నాం.. ఇక ఓపికతో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని పరిటాల సునీత స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం.. పార్టీ ఆఫీసు పక్కనే డీజీపీ కార్యాలయం ఉంది.. గతంలో మేం పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే, వైసీపీ గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదు అని వ్యాఖ్యానించారు. పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నా అధికారంలో వచ్చాక శాంతిగా ఉండమని చంద్రబాబు చెప్పారని గుర్తుచేసుకున్న ఆమె ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదన్నారు పరిటాల సునీత. తన భర్త పరిటాల రవిని చంపిన వాళ్లు రోడ్ల మీద తిరుగుతున్నా చంద్రబాబు మీద గౌరవంతో గొడవలు పెట్టుకోలేదన్నారు. చంద్రబాబులో ఇకనైనా మార్పు రావాలంటూ కోరారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గంట కళ్లు మూసుకుంటే చాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా రక్తం ఉడుకుతోంది.. ఇప్పుడైనా సరే మీ పని మీరు చేయండని చెబితే మంత్రులను తిరగనివ్వమని ఆమె హెచ్చరించారు. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. చంద్రబాబు కాళ్ల కింద ఉండే వ్యక్తులు వంశీ, నాని వంటి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తిట్లు మాకూ వచ్చు.. మేమూ మాట్లాడగలం..మాకూ బీపీ వస్తుంది.. మేం ఏం చేస్తామో త్వరలో చూపిస్తామని పరిటాల సునీత హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed