RBI: ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలాన్ని రెండోసారి పొడిగించే అవకాశం

by S Gopi |
RBI: ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలాన్ని రెండోసారి పొడిగించే అవకాశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా ఉన్న శక్తికాంత దాస్ పదవీకాలాన్ని రెండోసారి పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంకు మధ్య సంబంధాలు గందరగోళంగా ఉన్న 2018, డిసెంబర్ సమయంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో అత్యంత విశ్వసనీయ ప్రభుత్వోద్యోగులలో ఆయన ఒకరు. దాస్ ప్రస్తుత పదవీకాలం డిసెంబర్ 10తో ముగియనుంది. ఇప్పటికే ఐదేళ్ల కంటే ఎక్కువకాలం ఆర్‌బీఐ గవర్నర్‌గా దాస్ ఉన్నారు. మరోసారి పొడిగింపు అవకాశం లభిస్తే బెనగల్ రామారావు తర్వాత అత్యధిక కాలం ఆర్‌బీఐ గవర్నర్‌గా చేసిన వ్యక్తిగా నిలవనున్నారు. రామారావు 1949-1957 మధ్య ఏడున్నర సంవత్సరాల పాటు ఆర్‌బీఐ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆయనే అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్నారు. దాస్ పదవీకాలం పొడిగించే విషయానికి సంబంధించి కొత్త అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయని రాయిటర్స్ పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని, మరోసారి దాస్ పదవీకాలం పొడిగించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. కాగా, దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్‌బీఐల నుంచి స్పందన రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed