కొండ‌లు పిండి.. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో జోరుగా అక్రమ మైనింగ్‌..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-23 02:10:33.0  )
కొండ‌లు పిండి.. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో జోరుగా అక్రమ మైనింగ్‌..!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది. విలువైన రాతి, గ్రానైట్‌ సంపదను కొల్లగొడుతున్నారు. అనుమ‌తుల మాటున అంతులేని రాయిని త‌ర‌లించేస్తున్నారు. నిబంధ‌న‌ల‌కు పాత‌ర వేస్తున్న అక్రమార్కులు అనుమ‌తుల‌కు మించి ఆక్రమ‌ణ‌ల‌తో ప్రకృతి సంప‌ద‌ను దోచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం క్రషర్‌, గ్రానైట్, మట్టి తదితర క్వారీలకు అనుమతులు తీసుకుంటున్నారు. అనుమతి ఉన్న స్థలంతోపాటు పక్కనే అందుబాటులో ఉన్న భూముల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. అడిగేవారు లేరని అందినకాడికి భూగర్భ వనరులను తవ్వుకుని డబ్బులు దండుకుంటున్నారు. వనరులను కొల్లగొట్టడమే కాకుండా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని ఎగవేస్తున్నారు. జిల్లాలో వివిధ రకాల ఖనిజాలు ఉత్పత్తి అయ్యే క్వారీల ద్వారా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి సుమారు ఏటా రూ.25కోట్లకుపైగా ఆదాయం వస్తుంది. వీటిలో ఖనిజ రకాల ఆధారంగా 10శాతం నుంచి 30శాతం వరకు జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌(డీఎంఎఫ్‌టీ)కి 2016 నుంచి జమ చేస్తున్నారు.

1250 కు పైగా స్టోన్‌, గ్రానైట్ క్వారీలు..

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో క్వారీల అనుమ‌తులున్నవి సుమారు 1250కి పైగా ఉండ‌గా, ఎలాంటి అనుమ‌తులు పొంద‌కుండా నిర్వహిస్తున్న క్వారీలు 430 వ‌ర‌కు, అనుమ‌తుల‌ను ర‌ద్దు చేసినా తవ్వకాలు సాగిస్తున్నవి సుమారు 250 వ‌ర‌కు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ధ‌ర్మసాగ‌ర్‌, కాజీపేట‌, ఐన‌వోలు, హ‌స‌న్‌ప‌ర్తి, ఎల్కతుర్తి, శాయంపేట, మహబూబాబాద్, నెల్లికుదురు, డోర్నక‌ల్‌, కుర‌వి, కొడ‌కండ్ల, తొర్రూరు, కేస‌ముద్రం, జ‌న‌గామ, వ‌రంగ‌ల్ జిల్లా నెక్కొండ‌ మండ‌లాల్లో క్వారీలున్నాయి. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో బ్లాక్ గ్రానైట్‌, మ్యాపుల్‌ రెడ్‌, ట్యాన్‌ బ్రౌన్‌, ట్యాన్‌బ్లూ, సర్ఫ్‌గ్రీన్ ర‌కాలు ఎక్కువ‌గా ల‌భ్యమ‌వుతున్నాయి. వందలాది హెక్టార్లలో గనులు వ్యాపించి ఉన్నాయి. చాలా వ‌ర‌కు బ్లాక్ గ్రానైట్ నిల్వలు ఉండ‌టం, దానికి మంచి డిమాండ్ ఉండ‌టంతో వ్యాపారుల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ క్వారీలకు అనుబంధంగా వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లాలో 70వ‌ర‌కు పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. క్వారీల నుంచి రోజూ వందల సంఖ్యలో లారీల్లో స్థానికంగా ఉన్న పాలిషింగ్‌, క‌టింగ్ యూనిట్లకు గ్రానైట్ ముడి రాయిని త‌ర‌లిస్తున్నారు. అలాగే పొరుగున ఉన్న ఖ‌మ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ‌, విశాఖపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు కూడా చేరుస్తుంటారు. అక్కడి నుంచి చైనా, జ‌పాన్‌, ఇండోనేషియా, ర‌ష్యా, దుబాయ్‌ త‌దిత‌ర దేశాల‌కు త‌ర‌లించి విక్రయింస్తుంటారు. ‌

ఇవీ జ‌రుగుతున్న అక్రమాలు..!

లీజు తీసుకున్నది ఒకచోటయితే ఆ చుట్టుపక్కలా తవ్వకాలు సాగిస్తున్నారు. తవ్వితీసిన ఖనిజానికి రాయల్టీ, సీనరేజ్‌ చెల్లించకుండా విక్రయాల‌కు త‌ర‌లిస్తున్నారు. లీజు ప్రాంతాల్లో మైనింగ్‌, ఖనిజాల్ని రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీ చేయ‌కుండా మైనింగ్‌, పోలీస్‌, ఆర్టీఏ అధికారులు గ‌ప్‌చుప్‌గా ఉంటుడ‌టుంతో అక్రమాలు ద‌ర్జాగా సాగిపోతున్నాయి. నిబంధ‌న‌ల ప్రకారం లీజుదారుడు తవ్వితీసిన ఖనిజానికి మేజర్‌ మినరల్‌ అయితే రాయల్టీ రూపంలో, మైనర్‌ మినరల్‌ అయితే సీనరేజ్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించి వేబిల్లు తీసుకోవాలి. అయితే కొంత‌మంది లీజుదారులు రాయల్టీ, సీనరేజ్‌ ఎగవేతకు పాల్పడుతూ ఖనిజాన్ని తీసి అమ్మేసుకుంటున్నారు. అనేక గనుల నుంచి వేబిల్లులు లేకుండానే తరలిస్తున్నారు. మరికొంత‌మంది అనుమతి పొందిన లీజు స్థలాన్ని దాటేసి పక్కనున్న ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కంకర, గ్రానైట్, మొరం త‌వ్వకాలు చేప‌డుతున్నారు. అనుమతి తీసుకున్నా పరిమితికి మించి తవ్వి తీస్తున్నారు. కొన్నిచోట్ల లీజు గడువు దాటినా యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయి.

క్వారీల అక్రమాల‌పై విచార‌ణ‌..!

ఐన‌వోలు మండ‌లంలోని వనమాల కనపర్తి, కొండ‌ప‌ర్తి గ్రానైట్ క్వారీల్లో అక్రమాలపై స్థానికుల ఫిర్యాదుల‌తో ఎమ్మార్వో విక్రమ్‌కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. మైనింగ్ శాఖ రాయల్టీ ఇన్​ స్పెక్టర్ చంద్రకళ, గిర్దావర్ మల్లయ్య ఈ త‌నిఖీల్లో పాల్గొన్నారు. ఈ త‌నిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టినట్లుగా ప్రాథ‌మికంగా గుర్తించారు. వనమాల కనపర్తి, కొండపర్తి శివార్ల లోని 11 గ్రానైట్ క్వారీలను పరిశీలించారు. ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 103లో తవ్వకాలకు అనుమతి (విస్తీర్ణం) కొంతైతే పెద్ద మొత్తంలో త‌వ్వకాలు చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం. మైనింగ్ శాఖ నుంచి తీసుకున్న క్వారీల అగ్రిమెంట్, విస్తీర్ణం, నక్ష మ్యాప్​ పత్రాలను ఇవ్వాలని అధికారులు అడిగినా దాట‌వేస్తుండ‌టం గ‌మ‌నార్హం. అయితే క్వారీల అగ్రిమెంట్ అనుమతి పత్రాలు, మ్యాప్ లను తమకు సమర్పించాలని రెవెన్యూ అధికారులు కోరినా నేటికి కొంత‌మంది అంద‌జేయ‌క‌పోవ‌డం అక్రమాల‌పై అనుమానాల‌ను పెంచుతోంది. ప్రభుత్వానికి చెల్లించిన రాయల్టీ క్షేత్రస్థాయిలో నిర్వహించిన క్వారీకి సమాన స్థాయి ఉందా? లేదా? అనే అంశంపై కొలతలు వేస్తున్నట్లు స‌మాచారం. పూర్తి స్థాయి సర్వేకు మ‌రో వారం రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. క్వారీ నిర్వహణలో ముగ్గురు నిర్వాహకులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి చెల్లించిన రాయల్టీకంటే అదనంగానే క్వారీ నిర్వహించినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి విచారణ చేపడితేనే అక్రమాలు బహిర్గతమవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అవినీతి మ‌త్తులో మైనింగ్ శాఖ‌..!

అవినీతి మత్తులో జోగుతున్న మైనింగ్‌ శాఖ మొక్కుబడి తనిఖీలు, నోటీసులతో సరిపెడుతోంది. సక్రమంగా విధులు నిర్వహించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. క్వారీ యజమానుల ధనదాహానికి గుట్టలు సైతం కరిగిపోతున్నాయి. ఇష్టారాజ్యంగా గుట్టలను పేల్చివేస్తున్నారు. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రజలు వాయు, జల కాలుష్యంతో విలవిలలాడుతున్నారు. క్వారీల నుంచి ఎగిరిపడ్డ రాళ్లు తగిలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు, పెద్దాపురం, వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ, మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం తదితర ప్రాంతాల్లోని క్వారీల్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. క్వారీల యజమానులు నిబంధనలకు పాతరేస్తున్నారు. క్వారీల అక్రమాలపై వినియోగదారుల మండలి లోకాయుక్తాలో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన లోకాయుక్తా ఆదేశం మేరకు మైనింగ్‌ శాఖ అధికారులు సమర్పించిన నివేదికలో పలు వాస్తవాలు వెలుగు చూశాయి. అయితే నేటికి చ‌ర్యలు మాత్రం శూన్యమ‌నే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed