గూగుల్ కార్యాలయాల్లో.. రోబోల హౌస్‌కీపింగ్

by Shyam |   ( Updated:2021-11-23 08:42:20.0  )
గూగుల్ కార్యాలయాల్లో.. రోబోల హౌస్‌కీపింగ్
X

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ యుగంలో మనుషులు తాము చేసే చాలా పనుల కోసం ఇప్పుడు యంత్రాలవైపే మొగ్గుచూపుతున్నారు. క్రమంగా ఒక్కో పని మెకనైజేషన్‌‌కు మారిపోతుండగా.. యాంత్రిక శకానికి సంకేతాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని గూగుల్ కార్యాలయాల్లో 100 రోబోలు టేబుల్స్ తుడవడం, చెత్తను శుభ్రపరచడం, కాఫీ కప్పులు సేకరించడంతో పాటు విజిటర్స్ వస్తే తలుపులు తెరవడం వంటి ఉపయోగకర పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి.

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్.. తన ‘ఎవ్రీడే రోబోట్స్’ ప్రాజెక్ట్ (ప్రయోగాత్మక X ల్యాబ్స్‌లోని బృందం)లో భాగంగా తయారుచేసిన రోబో ప్రోటోటైప్స్‌లో కొన్నింటిని ల్యాబ్ నుంచి బయటకు తరలించిందని, ప్రస్తుతం అవి గూగుల్ బే ఏరియా క్యాంపస్‌ల చుట్టూ ఉపయుక్తమైన పనులు చేస్తున్నాయని కంపెనీ ప్రకటించింది. చెత్తను తొలగిస్తున్న అదే రోబోలకు ఇప్పుడు టేబుల్స్ తుడిచేందుకు స్క్వీజీని అమర్చవచ్చని, అదే గ్రిప్పర్‌ను ఉపయోగించి కప్పులను పట్టుకోవడం, తలుపులు తెరవడాన్ని నేర్పించవచ్చని చీఫ్ రోబో ఆఫీసర్ పీటర్ బ్రొమో తెలిపారు.

కొన్నేళ్లుగా ఆల్ఫాబెట్.. వర్చువల్ వరల్డ్ నుంచి వాస్తవ ప్రపంచానికి లెర్నింగ్‌ను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు రూపొందించిన ఇంటిగ్రేటెడ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను నిర్మిస్తోంది. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని క్యాప్చర్ చేసేందుకు వీలుగా రోబోలు వివిధ రకాల కెమెరాలు, సెన్సార్లతో అమర్చబడ్డాయి. రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్‌, డిమాన్‌స్ట్రేషన్ వంటి మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ కాంబినేషన్‌ను ఉపయోగించి, రోబోలు బాగా అర్థం చేసుకోవడంతో పాటు రోజువారీ పనులు చేయడంలో మరింత నైపుణ్యాన్ని పొందాయని కంపెనీ తెలిపింది. రాబోయే నెలలు, సంవత్సరాల్లో ఈ ప్రయాణానికి సంబంధించిన అప్‌డేట్స్‌లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసేందుకు ఎదురుచూస్తున్నామని బ్రొమో చెప్పారు.

సెక్స్ వద్దనుకునే వారి కోసం సరికొత్త డేటింగ్ యాప్

Advertisement

Next Story