భద్రాద్రి అడవుల్లో పేలిన తూటా..

by Anukaran |
భద్రాద్రి అడవుల్లో పేలిన తూటా..
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం:

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం అడ‌విలో తుపాకీ మోత ఆగ‌డం లేదు. నెల‌న్న‌రలో మూడోసారి ఎదురు కాల్పులు జరిగాయి. జూలై 15న‌ మ‌ణుగూరు సబ్ డివిజ‌న్ ప‌రిధిలోని తొగూడెం, క‌ర‌క‌గూడెం అడ‌విలో కొద్ది గంట‌ల తేడాతో కాల్పులు జ‌రిగాయి. కాల్పులకు పాల్ప‌డిన‌ మావోయిస్టు యాక్ష‌న్ టీం త్రుటిలో త‌ప్పించుకుంది. ఓ జ‌వాన్ చేతికి గాయ‌మైంది. అప్ప‌టి నుంచి అడ‌వుల‌ను ప్ర‌త్యేక పోలీస్ బ‌ల‌గాలు జ‌ల్లెడ ప‌డుతున్నాయి. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి మ‌ణుగూరులో ప‌ర్య‌టించి వెళ్లాక పోలీసుల సీరియ‌స్‌నెస్ మ‌రింత పెరిగింది. అనుమానం క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దుమ్ముగూడెం, క‌ర‌క‌గూడెం, ఆళ్ల‌ప‌ల్లి, గుండాల మండ‌లాల‌కు చెందిన కొంత‌ మందిని ఇన్ఫార్మ‌ర్లుగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మందుపాత‌ర‌తో సంబంధం ఉన్నదాదాపు 12 మందిని ఒకే రోజు అరెస్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించారు. మూడు నెల‌లుగా జిల్లాలో మావోయిస్టుల క‌ద‌లిక‌లు పెరిగాయ‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు పోలీస్‌ శాఖ‌ను అల‌ర్ట్ చేశాయి. దీంతో ప‌క్కా ప్ర‌ణాళిక‌తో కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు. మావోయిస్టుల జాడ క‌నుగొన్నప్ప‌టికీ, త్రుటిలో త‌ప్పించుకున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికీ ఇలా నాలుగుసార్లు జ‌రిగిన‌ట్లుగా తెలిసింది. గురువారం నాటి గుండాల ఘ‌ట‌న‌తో మాత్రం పోలీసులు పైచేయి సాధించార‌ని కొంత‌మంది విశ్లేషిస్తున్నారు.

ఉక్కుపాదంతో వీరు.. ఉక్కు సంకల్పంతో వారు..

మావోయిస్టు ఉద్య‌మం జిల్లాలో విస్త‌రించ‌కుండా అణ‌చి వేయాల‌ని పోలీసులు చూస్తుండ‌గా, మావోయిస్టులు మాత్రం ఎలాగైనా విస్త‌రించాల‌నే పట్టుదలతో ఉన్నారు. మావోయిస్టులను అదుపు చేయ‌డానికి ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం త‌ప్ప‌నిస‌రి అని పోలీస్‌శాఖ భావిస్తోంది. మావోయిస్టుల హింసాకాండ‌తో ప్రాణ‌న‌ష్టంతోపాటు గిరిజ‌న‌, ఆదివాసీ గ్రామాలు, తండాలు అభివృద్ధికి దూరంగా ఉండాల్సి వ‌స్తోంద‌ని పోలీసు వ‌ర్గాలు త‌రచుగా ప్రజలకు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాయి. ‘మావోయిస్టులను తరిమి కొట్టాలి. ఆదివాసీలపై మావోయిస్టులు చేస్తున్న హింసాకాండకు అంతమే లేదా? ఆదివాసీ గ్రామాల అభివృద్ధిపై మావోయిస్టులకు చిత్తశుద్ధి లేదా? ఎన్నాళ్లిలా ఆదివాసీల కష్టాన్ని దోచుకుని తింటారు?’ ఇలాంటి ప్రశ్నలతో కూడిన పోస్ట‌ర్లు చ‌ర్ల‌, దుమ్ముగూడెం, గుండాల‌, ఆళ్ల‌ప‌ల్లి, క‌ర‌క‌గూడెం, అశ్వ‌రావుపేట వంటి ఏజెన్సీ మండాలాల్లో వెలిశాయి.

ఈ పోస్ట‌ర్లు ఎవ‌రు వేశార‌నేది స్ప‌ష్ట‌త లేదు. ఇప్పటిదాకా మావోయిస్టులు అవలంబించిన వైఖరిని ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వర్గాలు చేపట్టినట్టు స్పష్టమవుతోంది. ఇది పోలీసుల వ్యూహాత్మ‌క చ‌ర్యేన‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆదివాసీలు, గిరిజ‌నులు మావోయిస్టుల‌కు స‌హ‌క‌రించ‌కుండా, ఉద్య‌మానికి ఆక‌ర్షితులు కాకుండా చేసేందుకు ఇలాంటి ఎత్తుగ‌డ వేశార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

లొంగిపొమ్మన్న వినిపించుకోలేదు : ఎస్పీ సునీల్ దత్

భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టుగా భావిస్తున్న ఒకరు మ‌ర‌ణించారని ఎస్పీ సునీల్‌ద‌త్ తెలిపారు. ఘ‌ట‌న జ‌రిగిన తీరుపై గురువారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మావోయిస్టు యాక్ష‌న్ టీంలు సంచ‌రిస్తున్నాయ‌నే స‌మాచారంతో మూడు రోజులుగా గుండాల పోలీసుల‌తో పాటు ప్ర‌త్యేక బ‌ల‌గాలు కూంబింగ్, వాహ‌నాల త‌నిఖీ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈక్ర‌మంలోనే గురువారం తెల్ల‌వారుజామున 4.15 గంట‌ల‌కు గుండాల సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుండాల మండ‌లం దేవ‌ళ్ల‌గూడెం వ‌ద్ద వాహన తనిఖీలు నిర్వహించామన్నారు.

బైక్‌పై వస్తున్న ఇద్దరు ఇది చూసి పారిపోతుండగా పోలీసులు వారిని వెంబ‌డించారన్నారు. లొంగిపొమ్మని పోలీసులు గట్టిగా కేకలు వేస్తూ హెచ్చ‌రించినా విన‌లేదని, పోలీసులపై కాల్పులు జ‌ర‌ప‌డంతో తిరిగి కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. కొద్ది సమయం తర్వాత కాల్పులు జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సుమారు 25 సంవత్సరాలు కలిగిన గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహం, ఒక ఆయుధం, ఒక మోటార్ సైకిల్ కనిపించాయన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Advertisement

Next Story