కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..

by Ravi |   ( Updated:2024-08-13 00:30:48.0  )
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..
X

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్... అన్నాడు వెనుకటికో కవి. ఆ పాటలోని భావాన్ని నిజం చేస్తూ కుడి చేతికి బదులుగా ఎడమచేతిని ఉపయోగిస్తూ ముందుకు సాగుతున్నారు. చాలామంది చిన్నతనం నుండే ఎడ మచేత్తో రాస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వారు బాల్యం నుండే ఎడమ చేత్తో పనులను చేసుకోవడానికి అలవాటుపడ్డారు. కుడి చేతిని వాడాలనే విధానాన్ని అధిగమించి సత్తాను చాటుకుంటూ తమ ప్రత్యేకతను ప్రద ర్శిస్తున్నారు. వారి మెదడు పనితీరు ప్రభావం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

అయితే కుడి చేతి వాటం కలిగిన వారితో పోలిస్తే కాస్త తక్కువ సంఖ్యలో కనిపించే వీరికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రపంచ జనాభాలో పదిశాతం ఉన్న వామహస్తీయులకు అవగాహన కల్పించి వారి సంక్షేమ అవసరాలను సమాజానికి తెలియజేసేందుకు అమెరికాలోని టొపేకా నగరంలో 1976 ఆగస్టు 13న మొదటిసారిగా అంతర్జాతీయ వామహస్తీయుల దినోత్స వం నిర్వహించారు. 1992 ఆగస్టు 13న భారతదేశంలో మొదటిసారిగా పూణే కేంద్రంగా చేతివాటం భారతీయుల సంఘం ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతీఏటా ఆగస్టు 13న అంతర్జాతీయ వామహస్తీయుల దినోత్సవం నిర్వహించడమే కాకుండా రకరకాల పరిశోధనలు జరుపుతున్నారు.

ఎడమచేతివాటం వచ్చేందుకు కారణాలు..

దేశంలో ఎడమ చేతి వాటం గల వ్యక్తులు మగ వారిలో 12 శాతం ఉండగా, ఆడవారిలో ఆ సంఖ్య 10 శాతం మాత్రమే. కొంతమంది జన్యుసంబంధ లక్షణాలతో ఎక్కువమంది ఈ రకంగా మారుతుండగా, కొంతమంది చిన్ననాటి నుండి సాధన చేయడంతో అన్ని పనులు ఎడమ చేతితోనే చేయగలుగుతున్నారు. వీరిలో సృజనాత్మకత, కోపం ఎక్కువేనని చరిత్ర చెబుతోంది. అసలు ఎడమచేతివాటం జన్యువుల, పరిసరాల ప్రభావం కారణంగా వస్తుంది. LRRTM1 జన్యువు తండ్రి నుంచి శిశువుకి సంక్రమిస్తే ఈ లక్షణం ఉంటుంది. శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి శరీరంలో ఉండే ఈస్ట్రోజన్ అనే హార్మోన్‌ స్థాయిపై కూడా ఆధారపడి ఈ లక్షణం వస్తుంది. అంతే కాకుండా శిశువు పెరుగుతున్న పరిస్థితుల్లో ఉండే పరిసరాలు కూడా ఎడమ చేతి వాటాన్ని ప్రదర్శించేందుకు దోహదం చేస్తాయి. కుడిచేతి వాటం కలిగిన వారికన్నా ఎడమచేతి వాటం కలిగిన వారికన్నా ఉన్నత స్థానాల్లో ఉంటారని వారికి తెలివి తేటలు, గ్రహించే శక్తితో పాటు మంచి ఆలోచనా శక్తి కలిగి ఉంటారని అంటారు. చేతులకు ఉన్నట్టే కాళ్లకు కూడా వాటం ఉంటుంది. ఎడమచేతి వాటం ఉన్నవారు ముందుగా ఎడమ కాలు వాడటం, ఎడమ కన్నుతో చూస్తారట. మహిళలలో మాత్రం మెదడు చురుగ్గా పనిచేస్తుందని, సృజనాత్మకత అధికం అని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎక్కువగా వారికోసం తయారుచేయడంతో..

మనిషి మెదడు కుడి, ఎడమ రెండు అర్ధభాగాలుగా ఉంటుంది. కుడి వైపు శరీర భాగాన్ని మెదడు ఎడమ వైపు భాగం నియంత్రిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంటే కుడి అర్ధభాగం మెదడు బలంగా ఉన్నవారిలో ఎడమచేతి వాటం వస్తుంది. మన ప్రాంతంలో చాలామంది కుడిచేతితో డబ్బు ఇవ్వడాన్ని మంచి పనులు ప్రారంభించడాన్ని సెంటి‌మెంట్‌గా పరిగణిస్తారు. అందుకే చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎడమచేతి వాటం గమనిస్తే మాన్పించే ప్రయత్నం చేస్తారు. అయితే వారికి జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు మాన్పించడం కష్టం.

నిత్య జీవితంలో మనం ఉపయోగించే కంప్యూటర్, మౌస్, కీ బోర్డ్ , టేబుళ్లు తలుపులు వంటి వాటిని కుడిచేతి వాటం కలిగిన వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని తయారు చేయడంతో ఎడమచేతి వాటం గల వ్యక్తులు వాటిని ఉపయోగించడంలో ఇబ్బందులకు గురవుతున్నారు. అందువల్ల ఎడమచేతి వాటం గల వ్యక్తులు ఉపయోగించే విధంగా వస్తువులను తయారుచేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

(నేడు ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే)

- సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Advertisement

Next Story

Most Viewed