ఏడాదిలోనే అభివృద్ధి ఘనం : మంత్రి పొన్నం ప్రభాకర్

by Kalyani |
ఏడాదిలోనే అభివృద్ధి ఘనం : మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ,హుస్నాబాద్ ; తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైసింగ్ ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు -2024 సాంస్కృతిక కార్యక్రమాలు హుస్నాబాద్ లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద 80 మంది కళాకారులతో అట్టహాసంగా నిర్వహించారు. కళాకారులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ నాటికల రూపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో అమలు చేస్తున్న పథకాలు సంక్షేమం, అభివృద్ధి చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. హుస్నాబాద్ లో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సభకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. వంతడ్పుల నాగరాజు బృందం హుస్నాబాద్ లో చేసిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు గత 11 నెలలుగా రాష్ట్రంలో నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగాల భర్తీ, గద్దర్ కు జ్ఞాపకంగా గద్దర్ అవార్డ్స్, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పాటల రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏడాది క్రితం రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గా మంత్రి గా అయ్యానని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు.

ఏడాది కాలంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు చెప్పడానికి ప్రభుత్వం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు పేరుతో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు.మొదటి సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి జరిగిందని వచ్చే 4 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో ముందించుతానని తెలిపారు. తనని గెలిపించిన ఏడాదిలోనే ఇంత అభివృద్ధి జరిగిందని నియోజకవర్గ ప్రజలు ఒకసారి సమీక్ష చేసుకోవాలని సూచించారు. మీ ఎమ్మెల్యే గా మంత్రిగా ప్రజల పక్షాన అండగా ఉంటున్నానని హుస్నాబాద్ గౌరవాన్ని మరింత పెంచుతానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు పడుతున్నాయని తెలిపారు. రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి అయిందని రూ. 2 లక్షల పైన ఉన్న వారి రుణమాఫీ కూడా అవుతుందన్నారు .10 ఏళ్లలో గురుకుల విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తమ ప్రభుత్వంలో 40 శాతం డైట్ & కాస్మొటిక్ చార్జీలు పెంచామన్నారు.

కుర్చీ వేసుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవెళ్లి ప్రాజెక్టు కడతామన్నారని వారు ఇచ్చిన హామీని మరిచినా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలనే సంకల్పంతో కాలువల నిర్మాణం కోసం రూ.430 కోట్లు కేటాయించి భూసేకరణ జరుగుతుందని తెలిపారు. హుస్నాబాద్ లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.త్వరలోనే హుస్నాబాద్ పట్టణంలో 150 పడకల ఆసుపత్రి కి శంఖు స్థాపన జరుగుతుందన్నారు. హుస్నాబాద్ నుండి కరీంనగర్ రోడ్ల విస్తరణ జరుగుతుందని ,ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి సెట్విన్ కేంద్రాన్ని తెచ్చామని గుర్తు చేశారు. టామ్ కాం కంపెనీ ద్వారా విదేశాలకు వెళ్ళే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్ , రూ.500 కి గ్యాస్,రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ, అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుందనీ అందరూ సమాచారం ఇవ్వాలని కోరారు.

సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ... తెలంగాణ పోరాట స్ఫూర్తి ,త్యాగాలు ,మన భాష, మన సంస్కృతి తెలంగాణ పండగలు చాటి చెప్పే విధంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.తెలంగాణలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 3 లక్షల 25 వేల కుటుంబాలకు 3 లక్షల 15 వేల కుటుంబాలు సర్వే పూర్తైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు,ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed